మధుర విషం
ABN , Publish Date - Jun 05 , 2026 | 12:50 AM
ఆరోగ్యంగా ఉండేందుకు పండ్లు తినాలని వైద్యులు చెబుతుంటారు. అయితే, ఇప్పుడు మార్కెట్‌లో లభిస్తున్న పండ్లు తింటే అనారోగ్యం బారినపడే ప్రమాదం ఉంది.
పండు చూస్తే నిగనిగ... అంతా దగా
కృత్రిమంగా పక్వానికి తెచ్చేందుకు యథేచ్ఛగా రసాయనాల వినియోగిస్తున్న వ్యాపారులు
మామిడిపై ఇథలిన్, కాల్షియం కార్బైడ్ వంటివి స్ర్పే
అరటి, ద్రాక్ష, బొప్పాయి వంటి వాటిపై కూడా...
దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారితీసే ప్రమాదం
తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఆరోగ్యంగా ఉండేందుకు పండ్లు తినాలని వైద్యులు చెబుతుంటారు. అయితే, ఇప్పుడు మార్కెట్‌లో లభిస్తున్న పండ్లు తింటే అనారోగ్యం బారినపడే ప్రమాదం ఉంది. పండ్లను మగ్గబెట్టేందుకు ప్రమాదకర రసాయనాలు వినియోగిస్తుండడమే అందుకు కారణం. రసాయనాలు పిచికారీ చేసిన పండ్లను తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి, మార్కెట్‌లో పండ్లు కొనుగోలు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
రంగు, మెరుపు కోసం రసాయనాలు
పండ్లు పక్వానికి వచ్చేలా చేయడానికి, నిగారింపుగా కనిపించేందుకు ఇథలిన్, కాల్షియం కార్బైడ్, ఎథిలీన్ వంటి రసాయనాలను వినియోగిస్తుంటారు. మామిడి, అరటి, యాపిల్, బొప్పాయి, ద్రాక్ష, పుచ్చకాయ...ఇలా అన్నింటిపైనా రసాయనాలు స్ర్పే చేస్తుంటారు. పండ్లను మగ్గబెట్టడానికి ఇథిలిన్ వినియోగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, ఇథలిన్ గ్యాస్ 100 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్)కు మించకూడదు. కానీ, నేరుగా స్ర్పే చేయడం వల్ల పీపీఎం పరిధికి మించి ఉంటోంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు బారినపడే అవకాశం ఉంది. అదేవిధంగా ఎసిటిలీన్ అనే వాయువును వినియోగిస్తుంటారు. కాల్షియం కార్బైడ్ అనే రసాయన ఘాటును నీటితో కలిపినప్పుడు ఎసిటిలీన్ వాయువు విడుదల అవుతుంది. దీనిని పండ్లను మగ్గించేందుకు వినియోస్తుంటారు. దీని వాడకం చట్టరీత్యా నేరం. అలాగే, ఎథిలీన్ గ్యాస్‌ను కొన్ని రకాల పండ్లను మగ్గబెట్టేందుకు వినియోగిస్తుంటారు. యాపిల్ వంటి వాటిపై వాక్స్ కోటింగ్ వేస్తుంటారు. కొన్ని రకాల కృత్రిమ ఫుడ్ కలర్స్‌ను వినియోగిస్తుంటారు.
అనారోగ్య సమస్యలు
పరిధికి మించి రసాయనాలు వినియోగించిన పండ్లను తీసుకోవడం వల్ల తలనొప్పి, తల తిరగడం, వాంతులు, కడుపునొప్పి, గొంతు మంట, జీర్ణ సమస్యలు, వికారం, కడుపు అసౌకర్యంగా ఉండడం, అలర్జీ, జీర్ణకోశ ఇబ్బందులు, చర్మంపై దురద వంటి సమస్యలు వస్తుంటాయి. దీర్ఘకాలంలో అనేక ప్రమాదకర వ్యాధులకు కారణమయ్యే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎసిటిలీన్ గ్యాస్ వినియోగించి మగ్గించిన పండ్లను తీసుకుంటే క్యాన్సర్ బారినపడే అవకాశముంది. ఈ రసాయనాలు కలిగిన పండ్లను తినడం వల్ల తలనొప్పి, మైకం, మానసిక గందరగోళం, జ్ఞాపకశక్తి నశించడం, మానసిక స్థితి నిలకడగా లేకపోవడం, నిద్రలేమి, సెరిబ్రల్ ఎడిమా వంటి ఇబ్బందులు కనిపిస్తాయని చెబుతున్నారు. వీటితోపాటు మూర్ఛ వంటి వాటి బారినపడి దీర్ఘకాలంలో హైపోక్సియాను ప్రేరేపిస్తూ శరీర వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది.
ఇలా గుర్తించాలి
రసాయనాలు కలిపిన పండ్లను రంగు, రుచి, గుజ్జు కనిపించే విధానం, రసం బట్టి గుర్తించవచ్చు. కృత్రిమంగా పండిన ఫలంపై రంగు మారిన మచ్చలు ఉంటాయి. రసాయనాలు చల్లిన పండ్లు సాధారణంగా మగ్గిన పండ్ల మాదిరిగా కాకుండా అసహజ ముదురు రంగును కలిగి ఉంటాయి. అలాగే రసాయనాలు కలిపిన పండ్లలో రుచి తేడాగా ఉంటుంది. సాధారణ పండుకు ఉండే రుచి ఉండదు. చప్పగా ఉంటుంది. కాల్షియం కార్బైడ్ కలిపిన పండ్లను తీసుకున్నప్పుడు నోటిలో మంటగా ఉంటుంది. వీటిని తిన్న తరువాత కడుపునొప్పి, డయేరియా, గొంతులో మంట ఉంటాయి. సహజంగా పండిన ఫలాలతో పోలిస్తే రసాయనాలు కలిపిన పండ్లలో తగినంత రసం ఉండదు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
పండ్లను తినే ముందు నీటితో శుభ్రం చేయాలి. 15 నుంచి 20 నిమిషాలపాటు ఉప్పు లేదా బేకింగ్ సోడా కలిపిన నీటిలో నానబెట్టి కడగాలి. పైన ఉండే తొక్కను పూర్తిగా తొలగించి తినాలి. మెరిసే, అసహజ రంగుతో ఉన్న పండ్లకు దూరంగా ఉండాలి.
తనిఖీలు నిర్వహించి నమూనాలు ల్యాబ్‌కు పంపించాం
- కల్యాణ చక్రవర్తి, ఆహార భద్రత, ప్రమాణాలశాఖ అధికారి
ప్రస్తుత సీజన్‌లో మామిడి పండ్ల విక్రయాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాం. వివిధ ప్రాంతాల్లో పది వరకు నమూనాలు సేకరించి తనిఖీకి పంపించాం. వాటి ఫలితాలను బట్టి తరువాత చర్యలు తీసుకుంటాం. ప్రజలు పండ్లను కొనుగోలు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇథలిన్ 100 పీపీఎం దాటితే కఠిన చర్యలు ఉంటాయి. పండ్లపై కాల్షియం కార్బైడ్ వినియోగించినట్టు తేలితే జైలు శిక్షతోపాటు రెండు లక్షల వరకు జరిమానా కూడా ఉంటుంది.