స్వయంభూ గౌరీశ్వరాలయం పుష్కరిణికి మోక్షం
ABN , Publish Date - Apr 12 , 2026 | 11:29 PM
ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతి చెందిన స్థానిక స్వయంభూ గౌరీశ్వరాలయం పుష్కరిణికి మోక్షం కలగనుంది, మురికికూపంగా ఉన్న గౌరీశ్వరాలయం పుష్కరిణి పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి.
రూ.50 లక్షలతో అభివృద్ధి పనులు
చోడవరం, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతి చెందిన స్థానిక స్వయంభూ గౌరీశ్వరాలయం పుష్కరిణికి మోక్షం కలగనుంది, మురికికూపంగా ఉన్న గౌరీశ్వరాలయం పుష్కరిణి పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. ఈ పుష్కరిణి అభివృద్ధి పనులకు రూ.50 లక్షలు మంజూరుకావడంతో గత నెలలో ఈ పనులకు స్థానిక ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో వారం రోజుల నుంచి పుష్కరిణిలో పూడికతీత పనులు జోరుగా సాగుతున్నాయి.
ఎంతో ప్రసిద్ధి చెందిన గౌరీశ్వరాలయం పుష్కరిణి నిర్వహణ కొరవడడంతో చాలా కాలంగా మురుగునీటి చెరువులా, డంపింగ్ యార్డులా మారిపోయి అధ్వానంగా తయారైంది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ పుష్కరిణి అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయని భావించినా, వివిధ కారణాల వల్ల ఈ పనులు సుమారు రెండు సంవత్సరాలుగా నిలిచిపోయాయి. చివరకు ఆలస్యంగానైనా పనులు పట్టాలెక్కడంతో మరో ఆరు నెలల్లో ఈ పుష్కరిణి భక్తులకు అందుబాటులో రానుందని అంచనా. ఏటా కార్తీక మాసం సీజన్‌లో వివిధ ప్రాంతాల నుంచి ఎంతో మంది భక్తులు ఆలయానికి వచ్చి పుష్కరిణి వద్ద పూజలు చేసే పరిస్థితి ఉండేది. పుష్కరిణిలో దీపాలు వెలిగించేవారు. అయితే కాలక్రమంలో సరైన నిర్వహణ లేక, ఈ కొలనులో చెత్తాచెదారం పేరుకుపోయి, గేదెలు దిగి ఈ పుష్కరిణి దుర్గంధం వెదజల్లుతూ భక్తులు సమీపంలోకి వెళ్లలేని విధంగా మారిపోయింది. ముక్కుమూసుకుని కూడా వెళ్లలేని దుస్థితిని పూర్తిగా మార్చడానికి ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా పుష్కరిణిని మరింత లోతు చేసి, చుట్టూ వర్షం నీరు పోయేందుకు డ్రైనేజీ ఏర్పాటు చేయడంతో పాటు కొలనులో పూర్తిగా మంచినీరు మాత్రమే ఉండేలా బోర్లను తవ్వనున్నారు. కాంక్రీటుతో చుట్టూ గోడలు నిర్మించడంతో పాటు మెట్లను నిర్మించనున్నారు. ఒక పక్క పూలవనాన్ని అభివృద్ధి చేయడంతో పాటు పుష్కరిణి మధ్యలో శివపార్వతుల భారీ విగ్రహాన్ని నెలకొల్పాలని నిర్ణయించారు. ఆలస్యంగానైనా స్వయంభూ గౌరీశ్వరుడి పుష్కరిణి పనులు పట్టాలెక్కడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.