Share News

స్వర్ణభారతి రెడీ

ABN , Publish Date - Jan 19 , 2026 | 12:35 AM

స్వర్ణభారతి ఇండోర్‌స్టేడియం ప్రారంభానికి సిద్ధమైంది.

స్వర్ణభారతి రెడీ

ప్రారంభానికి సిద్ధంగా ఇండోర్‌ స్టేడియం

రూ.12 కోట్లతో ఆధునికీకరణ

25వ తేదీన ప్రారంభించే అవకాశం

29న రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్‌షిప్‌ పోటీలకు వేదిక

(విశాఖపట్నం-ఆంఽధ్రజ్యోతి)

స్వర్ణభారతి ఇండోర్‌స్టేడియం ప్రారంభానికి సిద్ధమైంది. రూ.12 కోట్లకుపైగా నిధులు వెచ్చించి స్టేడియంలో కొత్తహంగులు, సదుపాయాలను కల్పించారు. దాదాపు మూడేళ్లుగా జరుగుతున్న ఆధునికీకరణ పనులు దాదాపుపూర్తికావచ్చాయి. ఈ నెల 29వ తేదీన రాష్ట్రస్థాయి కరాటే పోటీలను స్వర్ణభారతి స్టేడియంలో నిర్వహించేందుకు అధికారులు అనుమతిచ్చారు. ఈలోగా.అంటే 25వ తేదీన ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

జీవీఎంసీ తూర్పుజోన్‌ పరిధిలోని రేసపువానిపాలెంలో 1997లో స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియం నిర్మించారు. 1,300 సీటింగ్‌ కెపాసిటీ, ఆరు బ్యాడ్మింటన్‌ కోర్టులను ఏర్పాటుచేశారు. పదేళ్ల తర్వాత 32వ జాతీయ క్రీడలకు ఏపీ ఆధిత్యం ఇవ్వడంతో స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో వెయిట్‌ లిఫ్టింగ్‌, వాలీబాల్‌ క్రీడలు నిర్వహించారు. దీనికోసం స్టేడియంలో ఏసీ సదుపాయంతోపాటు మరికొన్ని హంగులను కల్పించారు. తర్వాత కాలంలో స్టేడియం భవనం మరమ్మతులకు గురవడం, ఉడెన్‌ఫ్లోర్‌ దెబ్బతినడం, గ్యాలరీలో సీట్లు, ఏసీ ప్లాంట్‌ పాడైపోవడంతో స్టేడియంలో ఆధునికీకరణ చేయాలని మూడేళ్ల కిందట అధికారులు నిర్ణయించారు. జీవీఎంసీ కౌన్సిల్‌ అనుమతితో రూ.8 కోట్లు వెచ్చించి భవనం మరమ్మతులకు సివిల్‌వర్కులు, పెయింటింగ్‌లు, కొత్త ఏసీ ప్లాంట్‌ ఏర్పాటుచేయాలని భావించారు. అంచనాలు తయారు చేసిన తర్వాత ఆ మొత్తం సరిపోదని, గ్యాలరీలో సీటింగ్‌ కెపాసిటీని 2,400కి పెంచడంతోపాటు వాష్‌రూమ్‌ల్లో మాడ్యులర్‌ సిస్టమ్‌ అందుబాటులోకి తేవడం, ప్లేయర్‌ డ్రెస్‌ ఛేంజింగ్‌కు ప్రత్యేక రూమ్‌లు, ఓపెన్‌ జిమ్‌, వాకింగ్‌ట్రాక్‌, చిల్డ్రన్‌ ప్లే ఏరియా వంటి సదుపాయాలను కల్పించాలని నిర్ణయించారు. దీనికోసం రూ.4 కోట్లకుపైగా అవసరమవుతుందని ఆ మేరకు కౌన్సిల్‌ అనుమతి పొందారు. ఆధునికీకరణ పనుల్లో తీవ్రజాప్యం జరగడంతో కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ ఇటీవల ఇండోర్‌ స్టేడియంకు వెళ్లి జరుగుతున్న పనులను చూసి అధికారులు, కాంట్రాక్టర్‌పై తీవ్రఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో పనులు జోరందుకోవడంతోపాటు ఇప్పుడు ముగింపు దశకు చేరాయి. ఒక్క ఏసీప్లాంట్‌ ప్యానల్స్‌ మాత్రమే బిగించాల్సి ఉండగా, మిగిలిన పనులన్నీ పూర్తిచేశారు. స్టేడియం చుట్టూ బీటీరోడ్డు నిర్మాణం కూడా పూర్తయిపోవడంతో త్వరలోనే స్టేడియంను ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఈనెల 29వ తేదీన విశాఖ వేదికగా జరిగే రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్‌షిప్‌ పోటీలను స్టేడియంలో నిర్వహించేందుకు అసోసియేషన్‌ ప్రతినిధులు జీవీఎంసీకి దరఖాస్తుచేసుకోగా, అధికారులు ఫీజులు కట్టించుకుని అనుమతి జారీచేశారు. అయితే అధికారికంగా స్టేడియంను ప్రారంభించాల్సి ఉంటుంది కాబట్టి, ఈ నెల 25న ప్రారంభించేందుకు ముహూర్తం పెట్టినట్టు అధికారులు చెబుతున్నారు.

Updated Date - Jan 19 , 2026 | 12:35 AM