కదంతొక్కిన స్వర్ణ వార్డు/ స్వర్ణ గ్రామ ఉద్యోగులు
ABN , Publish Date - Sep 07 , 2026 | 01:02 AM
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌చేస్తూ మూడు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న స్వర్ణ వార్డు/గ్రామ పంచాయతీల ఉద్యోగులు ఆదివారం రోడ్డెక్కారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్షా శిబిరం నుంచి వందలాదిగా ఒకేసారి ఆర్టీసీ కూడలి, ఎల్‌ఐసీ కూడలికి చేరుకుని రోడ్డుపై బైఠాయించారు.
ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో రోడ్డుపై బైఠాయింపు
సచివాలయాల డైరెక్టర్ హామీతో ఆందోళన విరమణ
సిరిపురం, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌చేస్తూ మూడు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న స్వర్ణ వార్డు/గ్రామ పంచాయతీల ఉద్యోగులు ఆదివారం రోడ్డెక్కారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్షా శిబిరం నుంచి వందలాదిగా ఒకేసారి ఆర్టీసీ కూడలి, ఎల్‌ఐసీ కూడలికి చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. దీంతో మధ్యాహ్నం నుంచి రాత్రి 9 గంటల వరకు ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. ఈ దశలో ఆర్డీవో దిలీప్ చక్రవర్తి వచ్చి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని హామీ ఇచ్చినా నిరసన విరమించలేదు. రాత్రి 9 గంటల వరకు ద్వారకా బస్టాండ్ పరిసరాల్లోని రోడ్లపై బైఠాయించడంతో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించారు. అవసరమైతే ఉద్యోగులను అరెస్టు చేసేందుకు సిద్ధం చేశారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ ఉద్యోగులతో చర్చించాల్సిందిగా సూచించడంతో జిల్లాలో స్వర్ణ వార్డు సచివాలయాల పర్యవేక్షణ బాధ్యతలు చూసే పూర్ణిమ ఆందోళనకారుల వద్దకు చేరుకున్నారు. ఉద్యోగుల సంఘం నాయకులతో చర్చించారు. రాష్ట్ర స్థాయి అధికారులతో స్పష్టమైన హామీ కావాలని వారు పట్టుబట్టడంతో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం స్వర్ణ వార్డు/గ్రామ సచివాలయాల శాఖ రాష్ట్ర డైరెక్టర్‌కు ఫోన్‌ద్వారా ఇక్కడి పరిస్థితిని వివరించారు. దీంతో ఆయన సెల్‌ఫోన్‌లో నేరుగా ఉద్యోగ సంఘం నాయకులతో మాట్లాడి, సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. దీంతో రాత్రి పది గంటల తరువాత ఉద్యోగులు తమ ఆందోళనను విరమించారు. గడువులోగా సమస్యలను పరిష్కరించకుంటే, రాష్ట్రస్థాయిలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.