Share News

వివాహిత అనుమానాస్పద మృతి

ABN , Publish Date - Jul 27 , 2026 | 11:28 PM

మండలంలోని దుడ్డుపాలెం గ్రామంలో ఒక వివాహిత సోమవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

వివాహిత అనుమానాస్పద మృతి
భవ్యశ్రీ (ఫైల్‌ ఫొటో)

అత్తింటివారు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ మృతురాలి కుటుంబ సభ్యుల ఆరోపణ

చోడవరం, జూలై 27 (ఆంధ్రజ్యోతి): మండలంలోని దుడ్డుపాలెం గ్రామంలో ఒక వివాహిత సోమవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆమె అత్తింటివారు చెబుతుండగా, ఆమె ఒంటిపై గాయాలు ఉండడంతో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. మండలంలోని వెంకన్నపాలెం గ్రామానికి చెందిన భవ్యశ్రీ(23)కి, దుడ్డుపాలెం గ్రామానికి చెందిన కూర్మదాసు శ్రీనుతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వివాహ సమయంలో శ్రీనుకు కట్నంతో పాటు బంగారం, ద్విచక్రవాహనం కూడా భవ్యశ్రీ తల్లిదండ్రులు ఇచ్చారు. లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న భర్త శ్రీను, మరిది హరి, అత్త ఈశ్వరమ్మలు కొంతకాలంగా అదనపు కట్నం కోసం భవ్యశ్రీని శారీరకంగా, మానసికంగా వేధించి హింసిస్తున్నట్టు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం భవ్యశ్రీ ఉరివేసుకుని మృతి చెందినట్టు అత్తింటివారు ఆమె తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి చెప్పడంతో వారు దుడ్డుపాలెం చేరుకుని కుమార్తె మృతదేహాన్ని పరిశీలించారు. భవ్యశ్రీ ఒంటిపై గాయాలు ఉండడంతో భర్త, మరిది, అత్త తమ కుమార్తెను కొట్టి చంపేసి ఆత్మహత్యగా చెబుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సీఐ అప్పలరాజు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్‌టీం సభ్యులు ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత దాని ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకుంటామని సీఐ అప్పలరాజు తెలిపారు.

Updated Date - Jul 27 , 2026 | 11:28 PM