జడ్పీ పీఠంపై ఉత్కంఠ
ABN , Publish Date - Nov 18 , 2026 | 01:08 AM
అనకాపల్లి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవిని కూటమి భాగస్వామ్య పార్టీలైన తెలుగుదేశం, జనసేన పార్టీలతోపాటు బీజేపీ పట్టుబడుతున్నాయి. జిల్లాలోని మొత్తం (24) స్థానాలను కూటమి కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. చైర్పర్సన్ ఎన్నిక ఏకపక్షంగా మారడంతో మూడు పార్టీల్లోనూ పలువురు మహిళలు ఆశిస్తున్నారు. ఎవరికి వారు తమ వంత ప్రయత్నాలు సాగిస్తున్నారు. చైర్పర్సన్ ఎన్నికకు మరో రోజు మాత్రమే గడువు వుండడంతో .. కూటమి పార్టీల పెద్దలు ఈ పదవిని ఏ పార్టీకి కేటాయించాలన్నదానిపై ఇంతవరకు స్పష్టత లేకపోవడంతో ఆయా పార్టీల జడ్పీటీసీ సభ్యులు, శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.
తమకు కేటాయించాలని ఇటు జనసేన, అటు బీజేపీ పట్టు
అత్యధిక సంఖ్యా బలం ఉండడంతో టీడీపీకే ఇవ్వాలంటున్న తెలుగు తమ్ముళ్లు
కూటమిలో ఏ పార్టీకి కేటాయించాలన్న దానిపై రాష్ట్రస్థాయిలో నిర్ణయం కోసం నిరీక్షణ
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
అనకాపల్లి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవిని కూటమి భాగస్వామ్య పార్టీలైన తెలుగుదేశం, జనసేన పార్టీలతోపాటు బీజేపీ పట్టుబడుతున్నాయి. జిల్లాలోని మొత్తం (24) స్థానాలను కూటమి కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. చైర్పర్సన్ ఎన్నిక ఏకపక్షంగా మారడంతో మూడు పార్టీల్లోనూ పలువురు మహిళలు ఆశిస్తున్నారు. ఎవరికి వారు తమ వంత ప్రయత్నాలు సాగిస్తున్నారు. చైర్పర్సన్ ఎన్నికకు మరో రోజు మాత్రమే గడువు వుండడంతో .. కూటమి పార్టీల పెద్దలు ఈ పదవిని ఏ పార్టీకి కేటాయించాలన్నదానిపై ఇంతవరకు స్పష్టత లేకపోవడంతో ఆయా పార్టీల జడ్పీటీసీ సభ్యులు, శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.
జిల్లాలో 24 జడ్పీటీసీ స్థానాల్లో తెలుగుదేశం 17, జనసేన 5, బీజేపీ 2 స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. సంఖ్యాబలం పరంగా టీడీపీకి స్పష్టమైన ఆధిక్యం ఉన్నప్పటికీ, రాష్ట్రంలోని అన్ని జిల్లాలను పరిగణనలోకి తీసుకొని అనకాపల్లి జడ్పీ చైర్పర్సన్ పదవిని తమకు ఇవ్వాలని ఇటు జనసేన, అటు బీజేపీ నేతలు కోరుతున్నట్టు సమాచారం. బీజేపీ నుంచి ఈ పదవికి కశింకోట జడ్పీటీసీగా ఎన్నికైన పొన్నగంటి నాగమణి పేరు ప్రధానంగా వినిపిస్తున్నది. ఎంపీ సీఎం రమేశ్‌తోపాటు బీజేపీ ముఖ్య నేతలు కూడా ఆమెకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్టు తెలిసింది. ఇక జనసేన నుంచి పరవాడ జడ్పీటీసీగా ఎన్నికైన మోటూరు నాగమణి, సబ్బవరం జడ్పీటీసీగా ఎన్నికైన మామిడి అరుణ, బుచ్చెయ్యపేటగా ఎన్నికైన పోతల భవాని జడ్పీ చైర్పర్సన్ పదవి రేసులో వున్నారు. జిల్లాలో తాము తక్కువ జడ్పీటీసీ స్థానాలు తీసుకున్నందున చైర్పర్సన్ పదవిని జనసేనకు కేటాయించాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నట్టు తెలిసింది. అయితే అత్యధిక జడ్పీటీసీలను గెలుచుకున్నందున చైర్పర్సన్ పదవి సహజంగానే తెలుగుదేశం పార్టీకే దక్కాలన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నది.
ఇదిలావుండగా జిల్లాలో జడ్పీటీసీలుగా గెలిచిన మూడు పార్టీల బీసీ మహిళల రాజకీయ నేపథ్యం, పార్టీ పట్ల విధేయత, విద్యార్హత, సామాజిక వర్గం, ఇతర విషయాలకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే మూడు పార్టీల పెద్దలు కలిసి సేకరించినట్టు తెలిసింది. ఇదే సమయంలో ఆయా పార్టీలకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతల అభిప్రాయాలను కూడా తెలుసుకున్నట్టు చెబుతున్నారు. అనకాపల్లి జడ్పీ చైర్పర్సన్ పదవిని కూటమిలో ఏ పార్టీకి కేటాయించాలన్న దానిపై రాష్ట్రస్థాయిలో నిర్ణయం తీసుకొన్న తరువాత జిల్లాలో ఆ పార్టీకి చెందిన జడ్పీటీసీ సభ్యుల్లో ఎవరికి ఇవ్వాలన్నది నిర్ణయిస్తారని సమాచారం. ఈ ఉత్కంఠకు మరికొద్ది గంటల్లోనే తెరపడుతుందని కూటమి నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.