జర్రెల బాక్సైట్ కొండపైకి సర్వే బృందం
ABN , Publish Date - Jun 18 , 2026 | 10:57 PM
జర్రెల బాక్సైట్ కొండపై ఓ కంపెనీ సర్వే బృందం మట్టి నమూనాలు సేకరించి తరలిస్తుండగా ఆదివాసీలు అడ్డుకున్నారు. సర్వే బృందం సభ్యులు, వాహనాలను పంచాయతీ కార్యాలయానికి తరలించి నిర్బంధించారు.
మట్టి నమూనాల సేకరణ
తిరిగి వస్తుండగా అడ్డుకున్న ఆదివాసీలు
పంచాయతీ కార్యాలయంలో నిర్బంధం
గిరిజనులతో చర్చించి విడిపించిన ఏఎస్పీ
గూడెంకొత్తవీధి, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): జర్రెల బాక్సైట్ కొండపై ఓ కంపెనీ సర్వే బృందం మట్టి నమూనాలు సేకరించి తరలిస్తుండగా ఆదివాసీలు అడ్డుకున్నారు. సర్వే బృందం సభ్యులు, వాహనాలను పంచాయతీ కార్యాలయానికి తరలించి నిర్బంధించారు. విషయం తెలుసుకున్న ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా గురువారం రాత్రి జర్రెల చేరుకుని ఆదివాసీలతో చర్చించి సర్వే బృందాన్ని విడిపించారు. ఈ సంఘటనకు సంబంధించి స్థానికుల కథనం ప్రకారం .. గురువారం ఉదయం పది గంటలకు రెండు జీపుల్లో ఆరుగురు వ్యక్తులు నేరుగా బాక్సైట్ కొండపైకి వెళ్లారు. కొండపైన కొన్ని మట్టి నమూనాలు సేకరించి ప్యాకింగ్ చేసుకుని మధ్యాహ్నం జీపుల్లో తిరుగు ప్రయాణమయ్యారు. బాక్సైట్ కొండపైకి వాహనాలు వెళ్లడాన్ని గమనించిన జర్రెల, మొండిగెడ్డ పంచాయతీల గిరిజనులు మహిళలతో కలిసి కొండ్రుపల్లి, గిల్లకొంది, అసంపల్లి గ్రామాల్లో రహదారికి అడ్డంగా బైఠాయించారు. తిరుగు ప్రయాణమైన వాహనాలను గిరిజనులు నిలిపివేశారు. వాహనాలను పరిశీలించగా మట్టి నమూనాలు, తవ్వేందుకు ఉపయోగించిన పనిముట్లు కనిపించాయి. దీంతో ఆదివాసీలు సర్వే బృందం సభ్యులను జర్రెల పంచాయతీ కార్యాలయానికి తీసుకొచ్చారు. సర్వేకు ఎవరు పంపించారో ఆ కంపెనీ ప్రతినిధులు వచ్చే వరకు పంపించేదిలేదని తెగేసి చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న చింతపల్లి ఎంపీపీ కోరాబు అనూషదేవి, జెడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్య, జీకేవీధి ఎంపీపీ బోయిన కుమారి, తాజా మాజీ సర్పంచులు జర్రెల పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే జీకేవీధి ఎస్‌ఐ సురేశ్‌కుమార్ జర్రెల వచ్చారు. సర్వే బృందాన్ని పంపించాలని ఎస్‌ఐ కోరినప్పటికి ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, గిరిజనులు నిరాకరించారు. దీంతో రాత్రి సుమారు ఏడు గంటలకు చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా, సీఐ ఎం. వినోద్‌బాబు జర్రెల వచ్చారు. గిరిజనులు, ప్రజాప్రతినిధులతో గంటసేపు సుదీర్ఘంగా చర్చించారు. ఏఎస్పీ జోక్యం చేసుకుని సర్వే బృందం సభ్యులను చింతపల్లి తీసుకు వెళతామని, ఈ ఘటనపై పూర్తి విచారణ చేస్తామని, ఆదివాసీలకు అన్యాయం జరిగే ఎటువంటి పని ప్రభుత్వం చేయబోదని చెప్పడంతో గిరిజనులు, ప్రజాప్రతినిధులు సర్వే బృందాన్ని పంపించేందుకు అంగీకరించారు. రాత్రి ఎనిమిదిన్నర గంటలకు సర్వే బృందాన్ని చింతపల్లి తీసుకొచ్చారు. అయితే సర్వేకు పంపించిన కంపెనీ పేరుపై స్పష్టత ఇవ్వలేదు.