Share News

టిడ్కో ఇళ్ల కేటాయింపుపై సర్వే

ABN , Publish Date - Jan 07 , 2026 | 01:02 AM

నగర పరిధిలో డబ్బులు చెల్లించిన వారికి టిడ్కో ఇళ్లు కేటాయించలేదని ఎమ్మెల్యేలు పలువురు జీవీఎంసీ కమిషనర్‌ దృష్టికి తీసుకువచ్చారు.

టిడ్కో ఇళ్ల కేటాయింపుపై సర్వే

జీవీఎంసీ కమిషనర్‌కు ఎమ్మెల్యేల ఆదేశం

డబ్బులు చెల్లించిన వారికి ఇళ్లు ఇవ్వడం లేదని ఫిర్యాదు

గాజువాక, శంకరంలలో క్లోజ్డ్‌ గార్బేజ్‌ స్టేషన్లు నిర్మించాలని కోరిన పల్లా, కొణతాల

విధులకు గైర్హాజరయ్యే పారిశుధ్య కార్మికులపై చర్యలు తీసుకోవాలన్న గణబాబు

పాఠశాలల భవనాలకు మరమ్మతులు చేయించాలన్న వంశీకృష్ణ శ్రీనివాస్‌

విశాఖపట్నం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి):

నగర పరిధిలో డబ్బులు చెల్లించిన వారికి టిడ్కో ఇళ్లు కేటాయించలేదని ఎమ్మెల్యేలు పలువురు జీవీఎంసీ కమిషనర్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఇళ్లపై సర్వే చేయించి సమగ్ర నివేదిక తయారుచేయాలని ఆదేశించారు. జీవీఎంసీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల గురించి ఎంపీ, ఎమ్మెల్యేలకు వివరించేందుకు మేయర్‌ పీలా శ్రీనివాసరావు, కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ మంగళవారం సమావేశం ఏర్పాటుచేశారు. వీఎంఆర్‌డీఏ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మేయర్‌ పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు. కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ మాట్లాడుతూ పరిపాలనా సౌలభ్యం కోసం జోన్‌ల పునర్వ్యస్థీకరణ చేపట్టామన్నారు. నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల గురించి పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. జీవీఎంసీ పరిధిలో 35 చోట్ల టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టగా, అందులో పదిహేనుచోట్ల ఇళ్లను ఏడాది కిందటే లబ్ధిదారులకు అందజేశామన్నారు. మరో పదహారుచోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, ఇంకొక నాలుగుచోట్ల పూర్తికావాల్సి ఉందన్నారు. కొందరు లబ్ధిదారులు మృతిచెందడం, మరికొందరు తమకు ఇళ్లు వద్దని అంగీకారపత్రాలను అందజేయడం వల్ల కొన్ని ఖాళీగా ఉండిపోయాయన్నారు. వాటికి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉందన్నారు. దీనిపై కొందరు ఎమ్మెల్యేలు స్పందించి ఇప్పటికే డబ్బులు చెల్లించిన వారికి గృహాలు మంజూరు చేయకపోవడంతో ఇబ్బందిపడుతున్నారన్నారు. ఈ సమస్య పరిష్కారమయ్యేలా చూడాలన్నారు.

గాజువాకలో బహిరంగంగా ఉన్న డంపింగ్‌ యార్డు నుంచి దుర్వాసన రాకుండా క్లోజ్డ్‌ గార్బేజ్‌ స్టేషన్‌ నిర్మించాలని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కోరారు. అనకాపల్లిలో కాలువల్లో పూడికతీతలు సరిగా జరగడం లేదని, శంకరం వద్ద కొత్తగా గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ నిర్మించాలని అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కోరారు. ప్రస్తుతం ఉన్న అనకాపల్లి జోన్‌ కార్యాలయాన్ని తొలగించి అదే స్థలంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌తో కూడిన జోనల్‌ కార్యాలయం భవనాన్ని నిర్మించాలని కోరారు. పారిశుధ్య కార్మికులు చాలాచోట్ల విధులకు గైర్హాజరవుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని, పాఠశాలల భవనాలకు మరమ్మతులు చేయాలని పశ్చిమ, దక్షిణ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గణబాబు, వంశీకృష్ణశ్రీనివాస్‌ సూచించారు. ఎంపీ శ్రీభరత్‌ మాట్లాడుతూ ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్నుల వసూళ్లకు సంబంధించిన అంశాలపై ఆరా తీశారు. నగరంలో చాలాచోట్ల రెసిడెన్షియల్‌ భవనాల్లో వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నారని, అలాంటి వాటికి కమర్షియల్‌ అసెస్‌మెంట్‌లుగా మార్చాలని సూచించారు. స్టీల్‌ప్లాంటు నుంచి రూ.300 కోట్ల ఆస్తిపన్ను బకాయి వసూలుకు సహకరించాలని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును మేయర్‌, కమిషనర్‌ కోరారు. రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్‌ పథకాన్ని అందరూ వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కమిషనర్‌ను కోరారు. నగరంలో టీడీఆర్‌ల సమస్యలను తక్షణం పరిష్కరించాలని కొందరు ఎమ్మెల్యేలు కోరారు. ఉత్తర నియోజకవర్గం పరిధిలోని సమస్యలపై ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు వినతిపత్రం అందజేశారు. ఈ సమావేశంలో జీవీఎంసీలోని వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2026 | 01:02 AM