సింగవరం భూముల్లో సర్వే
ABN , Publish Date - Jun 01 , 2026 | 11:35 PM
మండలంలోని గరుగుబిల్లి పంచాయతీ సింగవరం రెవెన్యూ సర్వే నంబర్ 22లోని సుమారు 942 ఎకరాల భూములకు సంబంధించి అటవీ, రెవెన్యూ శాఖల మధ్య భూ వివాదం నెలకొన్న దృష్ట్యా సోమవారం ఆ రెండు శాఖల అధికారులు సంయుక్తంగా సర్వే చేశారు.
అటవీ, రెవెన్యూ శాఖల మధ్య భూ వివాదం దృష్ట్యా సంయుక్తంగా హద్దుల పరిశీలన
అనంతగిరి, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గరుగుబిల్లి పంచాయతీ సింగవరం రెవెన్యూ సర్వే నంబర్ 22లోని సుమారు 942 ఎకరాల భూములకు సంబంధించి అటవీ, రెవెన్యూ శాఖల మధ్య భూ వివాదం నెలకొన్న దృష్ట్యా సోమవారం ఆ రెండు శాఖల అధికారులు సంయుక్తంగా సర్వే చేశారు. ఈ భూములకు సంబంధించి జడ్పీటీసీ సభ్యుడు దీసరి గంగరాజు, మాజీ సైనికుడు పిన్నింటి వెంకటేశ్వరరావు ఇటీవల మండల కేంద్రంలోని పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ టి.నిషాంతికి ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం తహశీల్దార్ ఎం.వీరభద్రాచారి, అటవీశాఖ రేంజర్ రవికుమార్ సిబ్బందితో కలిసి సింగవరం రెవెన్యూలోని 22 సర్వే నంబరులో గల సుమారు 942 ఎకరాల భూములకు సంబంధించి రికార్డులు, హద్దులను పరిశీలించారు. నివేదికలను వేర్వేరుగా ఉన్నతాధికారులకు పంపించనున్నామని వారు తెలిపారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ సభ్యుడు గంగరాజు మాట్లాడుతూ 1960లోనే సెటిల్‌మెంట్ రికార్డు ప్రకారం భూములు రెవెన్యూకు చెందినవేనని, ఏళ్లుగా సాగులో గిరిజనులు ఉన్నారని, జాయింట్ సర్వే నివేదికలను త్వరగా పంపించి ఇప్పటికైనా భూముల వివాదాన్ని ఓ కొలిక్కి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ తేజశ్వరరావు, ఎంపీటీసీ తౌటినాయుడు, వీఆర్వో కోటిబాబు, అటవీశాఖ సెక్షన్ అధికారి పాపారావు, జగదీశ్, తదితరులు పాల్గొన్నారు.