Share News

రౌడీషీటర్లపై నిఘా పెంచాలి

ABN , Publish Date - Nov 19 , 2026 | 01:22 AM

రౌడీషీటర్లపై నిఘా పెంచాలని అధికారులను నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చీ ఆదేశించారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్‌, నేర పరిశోధన విభాగాలకు సంబంధించిన అధికారులతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రతి స్టేషన్‌ పరిధిలో గల రౌడీషీటర్ల గురించి ఆరా తీశారు. యాక్టివ్‌గా ఉండే రౌడీషీటర్ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.

రౌడీషీటర్లపై నిఘా పెంచాలి
సమావేశంలో మాట్లాడుతున్న సీపీ శంఖబ్రతబాగ్చి

నగర పోలీస్‌ కమిషనర్‌

శంఖబ్రతబాగ్చి ఆదేశం

సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేకంగా పికెట్లు

పారదర్శకంగా విధులు నిర్వర్తించాలి

విశాఖపట్నం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి):

రౌడీషీటర్లపై నిఘా పెంచాలని అధికారులను నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చీ ఆదేశించారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్‌, నేర పరిశోధన విభాగాలకు సంబంధించిన అధికారులతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రతి స్టేషన్‌ పరిధిలో గల రౌడీషీటర్ల గురించి ఆరా తీశారు. యాక్టివ్‌గా ఉండే రౌడీషీటర్ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. గంజాయి నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. స్టేషన్‌ల వారీగా ఎన్‌డీపీఎస్‌ కేసుల నమోదు, దర్యాప్తు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌ కేసులను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనూ సమస్యాత్మక ప్రాంతాలపై సమీక్షించిన ఆయన ఆయాచోట్ల ప్రత్యేక పికెట్‌, అవసరమైతే డెకాయ్‌ టీమ్‌లు, విజిబుల్‌ పోలీసింగ్‌ ఏర్పాటుచేయాలని సూచించారు. బైక్‌ రేసింగ్‌లు, ర్యాష్‌ డ్రైవింగ్‌పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. పోక్సో కేసుల వివరాలపై సమీక్షించిన ఆయన క్రైమ్‌ రేట్‌ తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను తక్షణం పరిష్కారం అయ్యేలా చూడడంతోపాటు దోషులకు శిక్షపడేలా చొరవ తీసుకోవాలని సూచించారు. పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని, అవినీతికి పాల్పడినా, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గత నెలలో నేర పరిశోధన విభాగంలో ప్రతిభచూపిన అధికారులు, సిబ్బందికి సీపీ రివార్డులు అందజేశారు.

Updated Date - Nov 19 , 2026 | 01:22 AM