Share News

రిసార్ట్స్‌పై నిఘా

ABN , Publish Date - Sep 03 , 2026 | 01:30 AM

నగర పరిధిలోని రిసార్టులు నేరాలకు కేంద్రాలుగా మారుతుండడాన్ని పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి సీరియస్‌గా తీసుకున్నారు.

రిసార్ట్స్‌పై నిఘా

  • వరుస ఘటనల నేపథ్యంలో సీపీ అలర్ట్‌

  • తనిఖీలకు ప్రత్యేక బృందం ఏర్పాటు

  • అనుమతులు, వసతులు, భద్రతా చర్యలపై నివేదికకు ఆదేశం

  • పెందుర్తి, ఆనందపురం, భీమిలి పరిధిలోనే అత్యధిక రిసార్టులు

  • యథేచ్ఛగా మద్యం, డ్రగ్స్‌ వినియోగం

  • అశ్లీల నృత్యాలు, లేట్‌నైట్‌ పార్టీలు నిత్యకృత్యం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగర పరిధిలోని రిసార్టులు నేరాలకు కేంద్రాలుగా మారుతుండడాన్ని పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి సీరియస్‌గా తీసుకున్నారు. రిసార్టుల్లో దిగేవారి కదలికలు, కార్యకలాపాలపై నిఘా లేకపోవడంతో డ్రగ్స్‌ వినియోగం, అసాంఘిక కార్యకలాపాలు, హత్యలు, హత్యాయత్నాలకు నిలయాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో నగర పరిధిలో రిసార్టులపై సమగ్ర విచారణ బాధ్యతలు ప్రత్యేక బృందానికి సీపీ అప్పగించినట్టు చెబుతున్నారు.

నగరంలో రిసార్టుల పేరుతో పెద్దఎత్తున వ్యాపారం జరుగుతోంది. ఆనందపురం, భీమిలి, పెందుర్తి ప్రాంతాల్లో ఇవి పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. జన సమర్థం పెద్దగా లేని ప్రాంతాల్లో 300 గజాల నుంచి వెయ్యి గజాల మధ్య స్థలంలో రెండు, మూడు అంతస్థుల భవనాన్ని నిర్మిస్తున్నారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఫంక్షన్‌ హాల్‌కు సరిపడా ఖాళీగా ఉంచి పైఅంతస్థులో గదులు నిర్మిస్తున్నారు. టెర్రస్‌పై ఓపెన్‌ డైనింగ్‌, డ్యాన్సింగ్‌ ఫ్లోర్‌ ఏర్పాటు చేస్తున్నారు. భవనం ముందుభాగంలో స్మిమ్మింగ్‌పూల్‌, చుట్టూ గ్రీనరీతో ఓపెన్‌ డైనింగ్‌, డ్యాన్స్‌కు వీలుగా ఏర్పాట్లుచేస్తున్నారు. పగటిపూట చూసేవారికి ఇది మామూలు భవనంలానే కనిపిస్తుంది. కానీ చీకటిపడిన తర్వాత భారీ లైటింగ్‌తో జిగేల్‌ మనిపిస్తూ ప్రత్యేక ప్రపంచాన్ని తలపిస్తుంది. నగరంతోపాటు చుట్టుపక్కల జిల్లాలకు చెందిన యువత, ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయ నేతలు రిసార్టులను బుక్‌ చేసుకుని పార్టీలు చేసుకుంటున్నారు. మద్యం, డ్రగ్స్‌ సేవిస్తూ స్విమ్మింగ్‌పూల్‌లో ఎంజాయ్‌ చేయడానికి ఇష్టపడుతున్నారు. నగర శివారు ప్రాంతాలైన పెందుర్తి, ఆనందపురం, భీమిలి మండలాల పరిధిలో సుమారు వంద వరకు రిసార్టులున్నాయంటే వాటికి ఉన్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు.

పోలీసుల సహకారం?

పోలీసులతో రిసార్టుల నిర్వాహకులు సత్సంబంధాలు నెరుపుతున్నారు. పోలీసు దాడులు, తనిఖీలు లేకపోవడంతో యథేచ్ఛగా మద్యపానం, డ్రగ్స్‌ వినియోగం, అశ్లీల నృత్యాలు, అసాంఘిక కార్యకలాపాలు నిత్యకృత్యమయ్యాయి.

నేరాలకు అడ్డాలుగా ...

నగర పరిధిలోని రిసార్టులు ఇటీవల నేరాలకు అడ్డాలుగా మారుతున్నాయి. తరచూ ఏదో ఒకచోట గొడవలు, కొట్లాటలు, అసాంఘిక కార్యకలాపాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఏకంగా హత్యలు, హత్యాయత్నాలు చోటుచేసుకోవడం పోలీసువర్గాలను సైతం ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత నెల 26న ఆనందపురం మండలం గండిగుండం సమీపంలోని హ్యాపీ నేచర్‌ రిసార్టులో బ్యూటీషియన్‌ తన బర్త్‌డే సందర్భంగా పార్టీ ఏర్పాటుచేసింది. అర్ధరాత్రి దాటిన తర్వాత మద్యం మత్తులో చిందులేస్తున్న ఇద్దరు యువకుల మధ్య వివాదం తలెత్తడంతో ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. తాజాగా నగరంలోని కొబ్బరితోట ప్రాంతానికి చెందిన ఓ యువతి తన పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 31న రాత్రి పెందుర్తి మండలం ఎస్‌ఆర్‌పురంలోని లక్కీ రిసార్ట్స్‌లో పార్టీ ఏర్పాటుచేసింది. అక్కడ కూడా విచ్చలవిడిగా మద్యం, డ్రగ్స్‌ వినియోగం జరిగిందనే ప్రచారం జరుగుతోంది. పార్టీలో పూటుగా మద్యం సేవించిన ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగి రిసార్టులోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు వెళ్లిన వాచ్‌మన్‌ పైడయ్యను బీరు బాటిళ్లతో పొడిచి పరారయ్యారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా బయటకు రాకుండా నిర్వాహకులు వ్యవస్థలను మేనేజ్‌ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కనిపించని భద్రతా చర్యలు

రిసార్టు ఏర్పాటుచేయాలంటే ముందుగా భవన నిర్మాణానికి డ్రాయింగ్‌ను జీవీఎంసీకి సమర్పించి, ప్లాన్‌ అప్రూవల్‌ తీసుకోవాలి. అగ్నిప్రమాదాలు జరిగితే ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా వ్యవస్థను ఏర్పాటుచేయాలి. వ్యాపారం ప్రారంభించడానికి ముందు జీవీఎంసీ నుంచి ట్రేడ్‌లైసెన్స్‌, వాణిజ్య పన్నులశాఖ నుంచి జీఎస్టీ సర్టిఫికెట్‌ తీసుకోవాలి. రిసార్టులో మద్యం సేవించేందుకు అనుమతించాలంటే ఎక్సైజ్‌ శాఖ నుంచి పర్మినెంట్‌ లైసెన్స్‌ లేదా ప్రత్యేక రోజుల్లో అనుమతికి తాత్కాలిక లైసెన్స్‌ తీసుకోవాలి. రిసార్టు బయట, ఆవరణతో పాటు కారిడార్‌, ఫంక్షన్‌హాల్‌, లిఫ్ట్‌, మెట్లు తదితర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి మూడు నెలలపాటు ఫుటేజీ నిల్వ ఉంచాలి. రిసెప్షన్‌లోని రిజిస్టర్‌లో రిసార్టుకు వచ్చేవారి గుర్తింపుకార్డు, ఫోన్‌ నంబరుతో పాటు ఇతర వివరాలను నమోదుచేయాలి. డ్రగ్స్‌, కత్తులు, తుపాకీలు వంటి మారణాయుధాలతో ఎవరైనా కనిపిస్తే సంబంధిత పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి. కానీ నగరంలోని రిసార్టులో ఇవేవీ లేవు. అడిగినంత డబ్బు ఇస్తే ఎలాంటి వివరాలు అడగకుండానే గదులు అద్దెకు ఇస్తున్నారు. పార్టీలకు అనుమతులు ఇస్తున్నారు.

ప్రత్యేక బృందంతో విచారణ

వరుస ఘటనల నేపథ్యంలో నగర పరిధిలోని రిసార్టుల వివరాలను సేకరించి, వాటిలో భద్రతా చర్యలు, నిర్వహణపై విచారణకు సీపీ శంఖబ్రతబాగ్చి ప్రత్యేక బృందానికి బాధ్యతలు అప్పగించినట్టు తెలిసింది. ఈ బృందం అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలోని రిసార్టులను సందర్శించి అనుమతులు, నిర్వహణ తీరుతెన్నులపై ఆరా తీస్తుంది. బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా చట్టపరమైన చర్యలకు సీపీ ఉపక్రమిస్తారనే ప్రచారం జరుగుతోంది.

Updated Date - Sep 03 , 2026 | 01:30 AM