పాల కల్తీపై నిఘా
ABN , Publish Date - Mar 04 , 2026 | 12:58 AM
ఇటీవల రాజమహేంద్రవరంలో కలుషితమైన పాలు తాగి ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వం పాల కల్తీపై దృష్టిసారించింది. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా వివిధ ప్రైవేటు డెయిరీలు, వ్యాపారులు సేకరించి సరఫరా చేసే పాలలో స్వచ్ఛతపై పక్కాగా పరిశీలన చేయాలని పశుసంవర్థక శాఖ అధికారులకు ఆదేశాలు జారీచేసింది.
ప్రైవేటు డెయిరీలు, వ్యాపారులు విక్రయించే పాలు తరచూ తనిఖీ
పశుసంవర్థక శాఖకు ప్రభుత్వం ఆదేశాలు
కల్తీ పాలను గుర్తించడంపై వినియోగదారులకు అవగాహన
చోడవరం, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): ఇటీవల రాజమహేంద్రవరంలో కలుషితమైన పాలు తాగి ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వం పాల కల్తీపై దృష్టిసారించింది. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా వివిధ ప్రైవేటు డెయిరీలు, వ్యాపారులు సేకరించి సరఫరా చేసే పాలలో స్వచ్ఛతపై పక్కాగా పరిశీలన చేయాలని పశుసంవర్థక శాఖ అధికారులకు ఆదేశాలు జారీచేసింది.
అడ్డగోలుగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో కొంతమంది పాల వ్యాపారులు పంచదార, యూరియా, గంజి పొడివి వంటివి కలిపి విక్రయిస్తున్నారు. చూడడానికి ఇవి స్వచ్ఛమైన పాల మాదిరిగానే కనిపిస్తాయి. కానీ వీటిని సేవించిన వారు క్రమంగా అనారోగ్యం బారిన పడే ప్రమాదం వుంది. రాజమహేంద్రవరం ఘటన నేపథ్యంలో పాల కల్తీకి అడ్డుకట్ట వేసి, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేటు డెయిరీలు విక్రయించే పాలతోపాటు పశుపోషణ రైతుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేసి, పట్టణాల్లో ఇంటింటికీ తిరిగి విక్రయించే పాల నమూనాలను పశుసంవర్థక శాఖ అధికారులు సేకరించి వాటిని నిశితంగా పరీక్షించనున్నారు. ఇందులో భాగంగా తరచూ పాల సేకరణ, పాలు విక్రయించే కేంద్రాలతోపాటు, బల్క్‌మిల్క్ కూలింగ్ సెంటర్లలో తనిఖీలు చేసి పాలల్లో నాణ్యతను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తారు. ఇదే సమయంలో సామాన్యులు సైతం తాము కొనుగోలు చేసే పాలలో కల్తీని గుర్తించడంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పశుసంవర్థక శాఖ చోడవరం ఏడీ జి.శ్రీనివాసరావు తెలిపారు. పాల కల్తీకి పాల్పడినట్టు రుజువైతే సంబంధిత వ్యక్తులకు పది సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
కల్తీ పాలను గుర్తించడం ఎలా...
స్వచ్ఛమైన పాలను మరిగిస్తున్నప్పుడు తీపివాసన వస్తుంది. ఒకవేళ కల్తీ పాలు అయితే రసాయన వాసన వస్తుంది.
స్వచ్ఛమైన పాలను కాచి చల్లార్చిన తరువాత పైన మీగడ మందంగా కడుతుంది. కల్తీ పాలు అయితే.. ఎంత వేడి చేసినా మీగడ కట్టదు.
ఏటవాలుగా వున్న గాజు లేదా నాపరాయి పలకపై రెండు, మూడు చుక్కల పాలు వేస్తే.. అవి నెమ్మదిగా కిందకు జారితే స్వచ్ఛమైనవిగా భావించాలి. వేగంగా కిందకు జారితే ఆ పాలు కల్తీవని, ఎక్కువ నీళ్లు కలిపినట్టు భావించాలి.
పాలల్లో ఎక్కువ నీరు పోసి, చిక్కగా కనిపించడం కోసం యూరియా కలుపుతుంటారు. ఇటువంటి పాలను గుర్తించడానికి మందుల షాపుల్లో యూరియా స్ట్రిప్పులు లభ్యమవుతాయి. ఒక స్ర్టిప్పుని పాలలో వేస్తే అది రంగుమారితే యూరియా కలిపినట్టు భావించాలి.
పాలల్లో గంజి పొడి కలిసిందో లేదో తెలుసుకోవడానికి ఐదు మిల్లీలీటర్ల పాలలో రెండు స్పూన్ల ఉప్పు కలపాలి. పాలు నీలిరంగులోకి మారితే గంజి పొడి కలిపినట్టు గుర్తించాలి.