Share News

రాయి క్వారీలపై నిఘా

ABN , Publish Date - Oct 31 , 2026 | 11:09 PM

జిల్లాలో వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న రాయి క్వారీలపై అధికార యంత్రాంగం నిఘా పెట్టింది.

రాయి క్వారీలపై నిఘా
జిల్లాలోని రాయి క్వారీ

పీచుమామిడి పేలుడు ఘటనతో జిల్లా అధికారుల నిర్ణయం

ప్రధానంగా బ్లాస్టింగ్‌, ఇతర పేలుడు పదార్థాల వినియోగంపై దృష్టి

8 శాఖల అధికారులు సర్వే చేపట్టి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశం

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న రాయి క్వారీలపై అధికార యంత్రాంగం నిఘా పెట్టింది. ప్రధానంగా అక్టోబరు 24వ తేదీన అనంతగిరి మండలం పీచుమామిడిలో జరిగిన పేలుడులో ఏడుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో జిల్లాలోని రాయి క్వారీల స్థితిగతులు, అక్కడ జరిగే బ్లాస్టింగ్‌, వినియోగిస్తున్న పేలుడు పదార్థాలు, తదితర విషయాలను పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి ఎక్కడైనా రాయి క్వారీల నిర్వాహుకులు నిబంధనలు అతిక్రమించడం సర్వసాధారణంగా మారింది. ఇదిలావుండగా పీసుమామిడి పేలుడు ఘటనపై కచ్చితమైన కారణాలు నేటికీ వెలుగులోకి రాలేదు. అయితే ఒక వాహనం నుంచి మరో వాహనంలోకి డీజిల్‌ నింపుతుండగా పేలుడు సంభవించిందని అధికారులు పేర్కొంటుండగా, ఆయా వాహనాల్లో గ్యాస్‌ సిలిండర్‌ ఉందని, పేలుడు పదార్థాలు సైతం ఉన్నట్టుగా పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. వాహనాల్లో పేలుడు పదార్థాలుండడం వల్లే పీసుమామిడి ఘటన భారీ స్థాయిలో జరిగిందని తెలుస్తున్నది. కేవలం డీజిల్‌ పేలుడు వల్లే ఘటన చోటుచేసుకుంటే ప్రమాదం ఈస్థాయిలో ఉండదనే వాదన బలంగా వినిపిస్తున్నది. దీంతో పీసుమామిడి ఘటనపై నేటికీ అనుమానాలు నివృత్తి కాలేదు. ఈ తరుణంలో జిల్లాలోని రాయి క్వారీలపై నిఘా పెట్టాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది.

రాయి క్వారీలపై జాయింట్‌ సర్వేకు ఆదేశం

జిల్లాలో రాయి క్వారీల స్థితిగతులపై వివిధ శాఖల అధికారులు జాయింట్‌ సర్వే చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి గతవారమే ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా ఎన్ని రాయి క్వారీలున్నాయనేది గుర్తించాలని, వాటిని జిల్లా అగ్నిమాపకాధికారి, మైనింగ్‌ ఏడీ, సబ్‌ఇన్‌స్పెక్టర్‌, తహశీల్దార్‌, అటవీ రేంజర్‌, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ ఏఈఈ, డిప్యూటీ ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి ఒక బృందంగా ఏర్పడి తమ ప్రాంతాల్లోని ఉన్న రాయి క్వారీలను పరిశీలించాలన్నారు. జాయింట్‌ సర్వేలో భాగంగా అధికారులు సందర్శించిన క్వారీల్లో నిబంధనల మేరకు జరుగుతున్న చర్యలు, అతిక్రమణలను గుర్తించాలని సూచించారు. ఆయా రాయి క్వారీల్లో వాస్తవ స్థితిగతులను పరిశీలించి సమగ్ర నివేదికను తమకు సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ నిషాంతి ఆదేశించారు. దీంతో ఆయా శాఖల అధికారులు జిల్లాలోని ఉన్న రాయి క్వారీలను గుర్తించి, వాటిని పరిశీలించేందుకు సన్నద్ధమవుతున్నారు.

Updated Date - Oct 31 , 2026 | 11:09 PM