ఫ్లూ జ్వరాలు విజృంభణ
ABN , Publish Date - Nov 19 , 2026 | 01:17 AM
జిల్లాలో కొద్దిరోజులుగా ఫ్లూ జ్వరాలు (ఇన్‌ఫ్లుయెంజా వైరస్ వల్ల వచ్చే శ్వాసకోశ ఇన్ఫెక్షన్, దానితో కూడిన జ్వరం) ప్రబలుతున్నాయి. వాతావరణంలో మార్పులతో ఫ్లూ వైరస్ విస్తరిస్తోంది. చిన్నారులు, వృద్ధులతో పాటు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఫ్లూ వైరస్ తీవ్రత అధికంగా ఉంటున్నట్టు వైద్యులు చెబుతున్నా
ఆస్పత్రులకు వందల్లో బాధితులు
జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు
జ్వరం తగ్గినా రెండు వారాలకుపైగానే వేధిస్తున్న తీవ్రమైన దగ్గు
యాంటీ బయోటిక్స్‌కు లొంగకపోవడంతో ఇబ్బందులు
అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న వైద్య నిపుణులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో కొద్దిరోజులుగా ఫ్లూ జ్వరాలు (ఇన్‌ఫ్లుయెంజా వైరస్ వల్ల వచ్చే శ్వాసకోశ ఇన్ఫెక్షన్, దానితో కూడిన జ్వరం) ప్రబలుతున్నాయి. వాతావరణంలో మార్పులతో ఫ్లూ వైరస్ విస్తరిస్తోంది. చిన్నారులు, వృద్ధులతో పాటు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఫ్లూ వైరస్ తీవ్రత అధికంగా ఉంటున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం నగర పరిధిలోని కేజీహెచ్, విమ్స్‌తోపాటు ప్రైవేటు ఆస్పత్రులకు వస్తున్న జ్వర పీడితుల్లో ఈ తరహా లక్షణాలు (జలుబు, గొంతునొప్పి, జ్వరం) అధికంగా ఉంటున్నట్టు పేర్కొంటున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో చలి పెరగడం, వాతావరణంలో తేమ అధికంగా ఉండడంతో శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు వస్తున్నాయంటున్నారు. చిన్నారుల్లో ఎక్కువగా తీవ్రమైన దగ్గు, కఫం, ఆయాసంతో కూడిన జ్వరాలు ఉంటున్నట్టు వైద్యులు చెబుతున్నారు. మిగిలిన వారిలో గొంతు నొప్పి, ముక్కు కారడం, తుమ్ములు, దగ్గు, జ్వరం ఉంటున్నాయన్నారు.
జ్వరం తగ్గినా.. వేధిస్తున్న దగ్గు
బాధితుల్లో దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, జ్వరం వంటి లక్షణాలు ఉంటున్నాయి. అయితే జ్వరం మూడు రోజుల్లో తగ్గుతున్నప్పటికీ..దగ్గు, జలుబు, గొంతునొప్పి మాత్రం రెండు నుంచి మూడు వారాలపాటు ఇబ్బంది పెడుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఫ్లూ జ్వర బాధితులకు ఇచ్చే కొన్నిరకాల యాంటీ బయోటిక్స్‌తో దగ్గు, గొంతునొప్పి తగ్గడం లేదని, దాంతో కొత్త యాంటీ బయోటిక్స్ సూచించాల్సి వస్తోందని పేర్కొంటున్నారు.
జాగ్రత్తలు అవసరం
జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలతో బాధపడే వాళ్లలో ఎక్కువమంది మెడికల్ షాపునకు వెళ్లి మందులు కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. అయితే, ప్రస్తుతం కనిపిస్తున్న ఫ్లూ జ్వరాలు భిన్నంగా ఉండడం వల్ల సొంత వైద్యం పనికి రాదని, వైద్యుల సూచనలు మేరకు మందులు వాడాలని సూచిస్తున్నారు. లక్షణాలను బట్టి అవసరమైన వారికి డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, కరోనా వంటి పరీక్షలను నిర్వహించాల్సి ఉంటుందని, ఎక్కువ మందికి టైఫాయిడ్, మరికొందరికి మలేరియా పాజిటివ్ నిర్ధారణ అవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు.
భారీగా రోగులు
జ్వరాలతో రోజుకు కేజీహెచ్ జనరల్ మెడిసిన్ విభాగానికి 100 మంది, విమ్స్‌కు మరో 70 నుంచి 80 మంది వస్తున్నారు. అర్బన్ హెల్త్ సెంటర్స్‌కు పది మంది వరకు వస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితికి వాతావరణంలో మార్పులే కారణమని సీనియర్ వైద్యులు డాక్టర్ సోమయాజులు తెలిపారు. వరుసగా తుఫాన్లు రావడం, రాత్రి వేళల్లో చల్లని గాలులు వీయడం వంటి కారణాలతో ఫ్లూ వైరస్ యాక్టివ్ అయినట్టు పేర్కొన్నారు.
నిర్లక్ష్యం చేయొద్దు
డాక్టర్ వై.జ్ఞానసుందరరాజు, జనరల్ ఫిజీషియన్
మందులకు జ్వరాలు తగ్గుముఖం పడుతున్నా దగ్గు, గొంతునొప్పి, జలుబు ఎక్కువ రోజులపాటు ఉంటున్నాయి. దీనికి కారణం అరుదుగా కనిపించే వైరస్‌గా భావించాల్సి వస్తోంది. కాబట్టి, జ్వరంతోపాటు ఇతర లక్షణాలు ఉన్నట్టయితే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సలహా మేరకు పరీక్షలు చేయించుకుని మందులు వినియోగించాలి.