జ్వరాల విజృంభణ
ABN , Publish Date - Jun 28 , 2026 | 12:36 AM
ప్రస్తుతం వాతావరణంలో మార్పుల కారణంగా జిల్లాలో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఏజెన్సీలోని ప్రభుత్వాస్పత్రులు జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. ఆస్పత్రుల్లో రోజువారీ ఓపీలో జ్వర బాధితులే అధికంగా ఉంటున్నారు. అలాగే గత ఏడాది జూన్‌తో పోలిస్తే ఈ ఏడాది మలేరియా కేసులు అధికంగా నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
- వాతావరణంలో మార్పులతో వ్యాధుల బారిన పడుతున్న జనం
- ఆస్పత్రులకు వచ్చే రోగుల్లో జ్వర బాధితులే అధికం
- గతేడాదితో పోలిస్తే పెరిగిన మలేరియా కేసులు
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
ప్రస్తుతం వాతావరణంలో మార్పుల కారణంగా జిల్లాలో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఏజెన్సీలోని ప్రభుత్వాస్పత్రులు జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. ఆస్పత్రుల్లో రోజువారీ ఓపీలో జ్వర బాధితులే అధికంగా ఉంటున్నారు. అలాగే గత ఏడాది జూన్‌తో పోలిస్తే ఈ ఏడాది మలేరియా కేసులు అధికంగా నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం ఏజెన్సీలో విభిన్న వాతావరణం కారణంగా వైరల్ జ్వరాలు సోకుతున్నాయని వైద్యులు అంటున్నారు. జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు వస్తున్నాయి. అలాగే వైరల్ జ్వరం వస్తే మూడు నుంచి ఐదు రోజుల వరకు ఉంటుంది. జ్వరం వచ్చిన వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం లేదా వెల్‌నెస్ సెంటర్లకు వెళ్లి చికిత్సలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దోమ తెరలు వినియోగించాలని, కాచి చల్లార్చిన నీళ్లు తాగడంతో పాటు వేడి ఆహారాన్ని తీసుకోవాలని, నిల్వ ఆహారాన్ని భుజించవద్దని చెబుతున్నారు.
ఆస్పత్రులకు వచ్చే వారిలో జ్వర బాధితులే అధికం
ప్రస్తుతం ఆస్పత్రులకు వచ్చే రోగుల్లో జ్వరబాధితులే అధికంగా ఉంటున్నారు. పది మందిలో కనీసం ఆరుగురు జ్వరంతో బాఽధపడుతున్న వారే కనిపిస్తున్నారు. గత రెండు వారాలుగా వైరల్ జ్వరాల ప్రభావం అధికమైందని వైద్యులు అంటున్నారు. గతంలో స్థానిక జిల్లా ఆస్పత్రికి రోజుకు 150 నుంచి 200 మంది అవుట్ పేషెంట్‌లుగా వచ్చేవారు. ఆ సంఖ్య ప్రస్తుతం 250 నుంచి 300 వరకు పెరిగింది. అలాగే వారిలోనూ 50 శాతం మంది వైరల్ జ్వర బాధితులే ఉంటున్నారు. ఇదే పరిస్థితి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ కొనసాగుతున్నది. దీంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా వైరల్ జ్వరాల ప్రభావమే అధికంగా కొనసాగుతున్నది. అయితే జ్వరాల ప్రభావంతో జనం ఇబ్బందులు పడుతున్నప్పటికీ సకాలంలో వైద్య సేవలు అందుతుండడంతో మరణాలు సంభవించడం లేదని తెలుస్తున్నది.
క్రమంగా పెరుగుతున్న మలేరియా కేసులు
ఏజెన్సీలో జ్వరాలతో పాటు మలేరియా కేసులు సైతం క్రమంగా పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జ్వరాల కంటే మలేరియా కేసులు ఎక్కువగానే నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ 21వ తేదీ వరకు జిల్లాలోని లక్షా 53 వేల 949 మంది జ్వర బాధితులకు రక్త నమూనాలు సేకరించి పరీక్షించగా 1,133 మలేరియా కేసులు నిర్ధారణ అయ్యాయి. గతేడాది జనవరి నుంచి జూన్ 21 వరకు మొత్తం లక్షా 62 వేల 865 మంది జ్వరబాధితులను పరీక్షిస్తే 890 మలేరియా కేసులు మాత్రమే వచ్చాయి. గతేడాది మొత్తంలో 1,678 మలేరియా కేసులు రాగా, ఈ ఏడాది కేవలం ఆరు నెలల్లోనే 1,133 మలేరియా కేసులు నమోదు కావడం విశేషం. అయితే మలేరియా నియంత్రణలో భాగంగా చేపడుతున్న చర్యలు సైతం ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదనే వాదన వినిపిస్తున్నది. ఉదాహరణకు గతేడాది మలేరియా కేసులు నమోదైన ప్రాంతాల్లో ఈ ఏడాది మలేరియా దోమల నివారణకు అవసరమైన మందు పిచికారీ పనులు చేపడుతున్నారు. మలేరియా వచ్చిన ఏడాది తర్వాత ఆయా ప్రాంతాల్లో దోమల మందు పిచికారీ చేయడం ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. దోమలను లార్వా దశలోనే నాశనం చేసే యాంటీ లార్వా ఆపరేషన్ వంటి ప్రక్రియలు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. అలాగే దోమ తెరలు సైతం అరకొరగా పంపిణీ చేయడం, వాటి వినియోగంపై యంత్రాంగం ప్రజలకు అవగాహన కల్పించని పరిస్థితి కొనసాగుతుండడంతో అవి ఎక్కువగా దుర్వినియోగమవుతున్నాయని తెలుస్తుంది.
అరకులోయలో..
అరకులోయ : స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలో 20 మంది మలేరియా బాధితులు చికిత్స పొందుతున్నారు. శనివారం సాయంత్రానికి వార్డుల్లో 114 మంది ఇన్‌పేషెంట్లు ఉండగా, వీరిలో ఎక్కువ మంది జ్వరపీడితులు ఉన్నారు. గత నెల నుంచి ఈ నెల 26 వరకు వందకు పైగా మలేరియా కేసులు నమోదైనట్టు తెలిసింది. గత ఏడాది జూన్ నెలతో పోలిస్తే ఈ ఏడాది మలేరియా కేసులు ఎక్కువగానే నమోదయ్యాయి.
జి.మాడుగులలో...
జి.మాడుగుల: మండలంలోని జి.మాడుగుల, గెమ్మెలి పీహెచ్‌సీల్లో రోజూ 50 ఓపీలు వస్తుండగా, ఇందులో 30 మంది వరకు జ్వరపీడితులు ఉంటున్నారు. మండలంలోని ఆశ్రమ పాఠశాలల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తున్నట్టు స్థానిక వైద్యాధికారి కిశోర్ తెలిపారు.
అనంతగిరిలో..
అనంతగిరి: మండలంలోని నాలుగు పీహెచ్‌సీలకు రోగుల తాకిడి పెరిగింది. మండల కేంద్రంలోని పీహెచ్‌సీకి శనివారం 64 ఓపీకి గాను 27 మంది జ్వర పీడితులు, లుంగపర్తి పీహెచ్‌సీకి 40 ఓపికి గాను పది మంది జ్వర బాధితులు ఉన్నారు. భీమవరం పీహెచ్‌సీ 81 ఓపికి గాను 30 మంది, పినకోట పీహెచ్‌సీలో 48 ఓపికి పది మంది వరకు జ్వర బాధితులు ఉన్నారు.
పరమసింగవరంలో..
సీలేరు: జీకే వీధి మండలం గుమ్మిరేవుల పంచాయతీ పరిధధిలోని మారుమూల పరమసింగవరం గ్రామంలో మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామంలో ఇంటికి ఒకరు చొప్పున జ్వరాలతో మంచాన పడ్డారు. గుమ్మిరేవుల పంచాయతీ కేంద్రం నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. ఈ గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో ఆస్పత్రికి వెళ్లడం కష్టమే. వైద్య సిబ్బంది కూడా ఇక్కడికి రావడం లేదు. దీంతో జ్వర పీడితులు ఇళ్లల్లోనే ఆర్‌ఎంపీతో చికిత్స చేయించుకుంటున్నారు.
పెదబయలులో..
పెదబయలు: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రోగుల తాకిడి పెరిగింది. రోజూ సుమారు 120 ఓపీ వస్తుండగా, జ్వరపీడితులే ఎక్కువ మంది ఉంటున్నారు.
కొలపరిలో గిరిజన విద్యార్థినికి డెంగ్యూ
చింతపల్లి: మండంలోని కొమ్మంగి పంచాయతీ కొలపరి గ్రామంలో డెంగ్యూ కేసు నమోదైంది. గ్రామానికి చెందిన వంతల సౌజన్యకు రక్త పరీక్షలు నిర్వహించగా, డెంగ్యూ నిర్ధారణ అయింది. ఆ బాలిక చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా ఈ ఏడాది గిరిజన ప్రాంతంలో నమోదైన తొలి డెంగ్యూ కేసుగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. గిరిజన గ్రామాల్లో జ్వరాలు ప్రబలుతున్నాయి. పలు గ్రామాల్లో గిరిజనులు మలేరియా, టైఫాయిడ్, వైరల్ జ్వరాలతో బాధపడుతున్నారు. చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో ప్రతి రోజు 80- 90 మంది జ్వరబాధితులు చికిత్స కోసం వస్తున్నారు.
జిల్లాలో గత నాలుగేళ్లుగా నమోదైన జ్వరాలు, మలేరియా కేసులు
సంవత్సరం జ్వర బాధితులు నమోదైన మలేరియా కేసులు
2023 3,82,778 1,812
2024 4,46,114 2,363
2025 3,43,917 1,678
2026 1,53,949 1,133(జనవరి నుంచి జూన్ 21 వరకు)