Share News

గిరి మహిళల ఆర్థిక ప్రగతికి తోడ్పాటు

ABN , Publish Date - Jul 15 , 2026 | 12:31 AM

ఆదివాసీ రైతులు పండించిన సీజనల్‌ పండ్లకు విలువలు జోడించి మార్కెటింగ్‌ చేసుకుంటే అధిక ఆదాయం పొందవచ్చునని గృహవిజ్ఞాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రధానంగా అనాస, పనస పండ్లతో పలు రకాల విలువ ఆధారిత ఉత్పత్తులు చేసుకోవచ్చు. ఈ ఉప ఉత్పత్తుల తయారీపై ఆదివాసీ మహిళా రైతులకు హరిపురం బీసీటీ-కేవీకే గృహవిజ్ఞాన శాస్త్రవేత్తలు శిక్షణ ఇస్తున్నారు. గిరిజన మహిళల విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీని కుటీర పరిశ్రమగా అభివృద్ధి చేసుకుని ఆర్థిక ప్రగతి సాధించేందుకు కూటమి ప్రభుత్వం బాటలు వేస్తున్నది.

గిరి మహిళల ఆర్థిక ప్రగతికి తోడ్పాటు
అనాస, పనస విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై శిక్షణ పొందిన సంఘంబంద గిరిజన మహిళలు

- ప్రోత్సహిస్తున్న కూటమి ప్రభుత్వం

- అనాస, పనసతో పలు రకాల ఆహార ఉత్పత్తుల తయారీకి శిక్షణ

- సహకారం అందిస్తున్న కేవీకే శాస్త్రవేత్తలు

- ప్రతి గ్రామంలో తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడమే లక్ష్యం

చింతపల్లి, జూలై 14 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీ రైతులు పండించిన సీజనల్‌ పండ్లకు విలువలు జోడించి మార్కెటింగ్‌ చేసుకుంటే అధిక ఆదాయం పొందవచ్చునని గృహవిజ్ఞాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రధానంగా అనాస, పనస పండ్లతో పలు రకాల విలువ ఆధారిత ఉత్పత్తులు చేసుకోవచ్చు. ఈ ఉప ఉత్పత్తుల తయారీపై ఆదివాసీ మహిళా రైతులకు హరిపురం బీసీటీ-కేవీకే గృహవిజ్ఞాన శాస్త్రవేత్తలు శిక్షణ ఇస్తున్నారు. గిరిజన మహిళల విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీని కుటీర పరిశ్రమగా అభివృద్ధి చేసుకుని ఆర్థిక ప్రగతి సాధించేందుకు కూటమి ప్రభుత్వం బాటలు వేస్తున్నది.

గిరిజన ప్రాంతంలో వివిధ సీజన్లలో పలు రకాల పంటలు అందుబాటులోకి వస్తాయి. ఆదివాసీ రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా విక్రయించుకోవడం వల్ల సరైన నికర ఆదాయం అందడం లేదు. గతంలో రైతులు కాఫీని చెర్రీగా విక్రయించేవారు. ప్రస్తుతం రైతులు పండ్లను ప్రాసెసింగ్‌ చేసి పార్చిమెంట్‌గా తయారు చేసుకుని మార్కెటింగ్‌ చేసుకోవడం వల్ల రెట్టింపు ఆదాయం పొందుతున్నారు. మిరియాలు, పసుపు, అల్లం, పనస, అనాస, మామిడి దిగుబడులను గిరిజన రైతులు వారపు సంతలు, ప్రాంతీయ మార్కెట్‌లో వర్తకులకు విక్రయిస్తున్నారు. వర్తకులు గిరిజన వ్యవసాయ ఉత్పత్తులను మైదాన ప్రాంతాలకు తరలించి విలువలు జోడించి మార్కెటింగ్‌ చేస్తూ అధిక ఆదాయం పొందుతున్నారు. రెండేళ్లుగా వ్యవసాయం ద్వారా గిరిజన రైతులు ఆర్థిక పురోగతి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తున్నది. వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు, పరిశోధన స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, డాట్‌ సెంటర్ల శాస్త్రవేత్తలతో నూతన యాజమాన్యపద్ధతులు, నూతన వంగడాలను రైతులకు పరిచయం చేయడంతో పాటు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై శిక్షణలు ఇస్తున్నారు. కొంత మంది అభ్యుదయ రైతులు శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలను పాటిస్తూ అధిక ఆదాయం పొందుతున్నారు. అయితే మెజారిటీ గిరిజనులు వ్యవసాయం ద్వారా ఆర్థిక పురోగతి సాధించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం గిరిజన ప్రాంతంలో ప్రత్యేక పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్నది.

అవగాహన లేక నష్టపోతున్న రైతులు

గిరిజన రైతులు వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేసుకునే విధానాలపై సరైన అవగాహన లేక నష్టపోతున్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గిరిజన ప్రాంతంలో ఆదివాసీలు అనాస, పనసను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఈ సీజన్‌లో అధిక మొత్తంలో దిగుబడులు వస్తున్నాయి. రైతులు కొంత మంది ఫిబ్రవరి, మార్చిలో కూర కోసం కాయలను విక్రయిస్తున్నారు. జూన్‌, జూలై మాసాల్లో పండ్ల రూపంలో అమ్ముకుంటున్నారు. అనాసను పండ్ల రూపంలో నేరుగా మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఒకేసారి అధిక దిగుబడులు రావడంతో రైతులు నిల్వ చేసుకునే పరిస్థితి లేక కొన్ని సందర్భాల్లో తక్కువ ధరకు విక్రయించుకోవాల్సి వస్తుంది. పనసకు గిరిజన ప్రాంతంలో సరైన మార్కెటింగ్‌ సదుపాయం లేదు. దీంతో అనాస, పనస నుంచి రైతులు సరైన ఆదాయం పొందలేకపోతున్నారు. ఈ మేరకు గిరిజన రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు బీసీటీ-కృషి విజ్ఞాన శాస్త్రవేత్తలు అనాస, పనసతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీని ప్రోత్సహిస్తున్నారు.

పనస ఉప ఉత్పత్తులు

పనస పండ్లతో పది రకాల విలువ ఆధారిత ఉత్పత్తులు చేసుకోవచ్చు. పనస తొనలు(కాయ నుంచి సేకరించినవి) చిన్న ముక్కలుగా తయారీ చేసి చిప్స్‌ తయారు చేయవచ్చు. ఈ చిప్స్‌ కరకరమంటూ చాలా రుచిగా ఉంటాయి. చిప్స్‌ మిక్చర్‌, పకోడి, ఊరగాయ, అప్పడాలు చేసుకోవచ్చు. అలాగే పండిన పనస తొనల నుంచి పాయసం, స్క్వాష్‌, తాండ్ర, కస్టర్డ్‌ తయారు చేయవచ్చు. ఈ విధంగా విలువలు జోడించి పనన ఆహార ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేసుకోవడం వల్ల మంచి ఆదాయం లభిస్తుంది.

అనాస(పైనాపిల్‌) ఉత్పత్తులు

అనాసతోనూ పది విలువ ఆధారిత ఉత్పత్తులు చేసుకోవచ్చు. ప్రధానంగా అనాస పండ్లతో జ్యూస్‌, స్క్వాష్‌, జామ్‌, క్యాండీ, బుట్టీ ఫ్రూటీ, బార్చెక్యూ(గ్రిల్‌ చేసిన ముక్కలు), పచ్చడి, హల్వా, శర్బత్‌, ఎండబెట్టిన పైనాపిల్‌ స్లైస్‌ రూపాల్లో తయారు చేసి మార్కెటింగ్‌ చేసుకోవచ్చు. అనాసతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అనాస విలువ ఆధారిత ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది.

మెండైన పోషకాలు

అనాస, పనస మానవుల ఆరోగ్యానికి మేలు చేసే మెండైన పోషకాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అనాసలో విటమిన్‌ సీ పుష్కలంగా లభిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతోంది. ఫైబర్‌ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియకు సహాయ పడుతుంది. తక్కువ క్యాలరీలు ఉండడంతో ఆరోగ్యకరమైన పండ్ల జాబితాలో అనాస ఒకటి. ఈ ఆహార ఉత్పత్తుల ద్వారా పొటాషియం, మాంగనీస్‌, ఖనిజాలు శరీరానికి పూర్తిగా అందుతాయి. పనస నుంచి విటమిన్‌-సీ, ఫైబర్‌, పొటాషియం, కాల్షియంతో పాటు యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి.

Updated Date - Jul 15 , 2026 | 12:31 AM