Share News

అడవి బిడ్డలకు అండగా..!

ABN , Publish Date - Mar 14 , 2026 | 11:41 PM

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌కల్యాణ్‌ శనివారం పాడేరు మండలంలో పర్యటించారు. సమస్యలతో సతమతమయ్యే ఆదివాసీలకు ఆయన భరోసా కల్పించారు.

అడవి బిడ్డలకు అండగా..!
నందిగరువులో జల్‌జీవన్‌ మిషన్‌ కుళాయిని పరిశీలిస్తున్న పవన్‌కల్యాణ్‌

ఆదివాసీలకు భరోసా కల్పించేందుకు

మన్యంలో పర్యటించిన డిప్యూటీ సీఎం

నందిగరువు రోడ్డు వద్ద జనసేన జెండా ఆవిష్కరణ

కాలినడకన నందిగరువుకి వెళ్లిన జనసేనాని

మాటా-మంతీ కార్యక్రమంలో గిరిజనులతో మమేకం

(పాడేరు-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌కల్యాణ్‌ శనివారం పాడేరు మండలంలో పర్యటించారు. సమస్యలతో సతమతమయ్యే ఆదివాసీలకు ఆయన భరోసా కల్పించారు. ఓనూరు జంక్షన్‌ నుంచి నందిగరువు గ్రామానికి రోడ్డు వేయడమే కాదు.. ఆ రోడ్డుపై సామాన్యుడిగా మీతోపాటు నేనూ అంటూ 2.4 కిలోమీటర్లు నడిచారు. గిరిజనులకు మౌలిక సౌకర్యాలపై హామీలు ఇచ్చారు. శనివారం ఉదయం విశాఖపట్నం నుంచి హెలికాఫ్టర్‌లో పాడేరు మండలం లగిశపల్లి హెలిప్యాడ్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో ఓనూరు జంక్షన్‌కు చేరుకుని నందిగరువు రోడ్డు వద్ద జనసేన పార్టీ 13వ వార్షికోత్సవం పురస్కరించుకుని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అలాగే అక్కడి నుంచి నందిగరువుకు కొత్తగా నిర్మించిన 2.4 కిలోమీటర్లు రోడ్డును పరిశీలించి, గ్రామానికి కాలినడకన బయలుదేరారు. ఈక్రమంలో నందిగరువు రోడ్డు నిర్మాణానికి ముందు, తర్వాత ఫొటోల ప్రదర్శన తిలకించారు. రోడ్డు పక్కన ఉన్న కాఫీ తోటలను పరిశీలించారు. ఓనూరు గ్రామానికి చేరుకునే సమయంలో బడి బాలలు ప్లకార్డులతో పవన్‌కల్యాణ్‌కు స్వాగతం పలికారు. వారితో ఆయన సెల్ఫీ దిగారు. తర్వాత ఓనూరు ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. అనంతరం బడి బాలలకు బ్యాగులను అందించారు. ఓనూరు జంక్షన్‌ నుంచి కొత్తపాలెం గ్రామానికి రోడ్డు నిర్మిస్తామని, అక్కడ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాలు మంజూరుచేస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఓనూరులో మ్యాజిక్‌ డ్రైన్లను నిర్మిస్తామని, తాగునీటి సమస్య ఉన్న గ్రామాల్లో జల్‌ జీవన్‌ మిషన్‌లో కొళాయిలు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే జీవో3 పునరుద్ధరణ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానన్నారు. అనంతరం నందిగరువు గ్రామానికి కాలినడకన చేరుకుని, అక్కడ జల్‌ జీవన్‌ మిషన్‌లో ఏర్పాటు చేసిన తాగునీటి కొళాయిలో నీటిని పరిశీలించారు. తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన గిరిజనులతో మాటా-మంతీ కార్యక్రమంలో పాల్గొని గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రత్యేక వాహనంలో హెలిప్యాడ్‌ వద్దకు తిరిగి వస్తున్న క్రమంలో ఘాట్‌లో అమ్మవారి పాదాలు, పాడేరు శివారున ఉన్న శివాలయాన్ని దర్శించుకున్నారు. మార్గమధ్యలోని వర్తనాపల్లి గ్రామంలో డ్రైనేజీని పరిశీలించి, గిరిజనులతో మాట్లాడారు. గ్రామంలో మ్యాజిక్‌ డ్రైన్లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గిరిజనుల సమస్యలకు పరిష్కారం చూపారు. అక్కడి నుంచి నేరుగా హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌, రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, కమిషనర్‌ కృష్ణతేజ, ఈఎన్‌సీ బాలునాయిక్‌, జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌, జిల్లా ఎస్‌పీ అమిత్‌బర్దార్‌, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో ఎం.వెంకటేశ్వరరావు, రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మకత చైర్మన్‌ వంపూరు గంగులయ్య, వివిధ శాఖల అధికారులు, గిరిజనులు పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2026 | 11:41 PM