Share News

మత్స్య పరిశ్రమకు సహకరించాలి

ABN , Publish Date - Jan 07 , 2026 | 01:07 AM

దేశంలో మత్స్య పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ సంస్థలు తగిన సహకారం అందించాలని ఎంపీ శ్రీభరత్‌ కోరారు.

మత్స్య పరిశ్రమకు సహకరించాలి

వాణిజ్య వ్యవహారాల స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో ఎంపీ శ్రీభరత్‌

అమెరికా సుంకాల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్కెట్లపై దృష్టిసారించాలని పరిశ్రమ ప్రతినిధులకు సూచన

విశాఖపట్నం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి):

దేశంలో మత్స్య పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ సంస్థలు తగిన సహకారం అందించాలని ఎంపీ శ్రీభరత్‌ కోరారు. విశాఖపట్నం వచ్చిన వాణిజ్య వ్యవహారాల స్టాండింగ్‌ కమిటీ నోవాటెల్‌ హోటల్‌లో మంగళవారం సమావేశం నిర్వహించింది. ‘భారతదేశం-అమెరికా సంబంధాల మూల్యాంకనం’ అనే అంశంపై నిర్వహించిన ఈ సమావేశానికి వాటాదారులను కూడా ఆహ్వానించింది. అందులో ఎంపీ శ్రీభరత్‌ మాట్లాడుతూ, భారతదేశంపై అమెరికా ప్రతీకార సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో మత్స్య పరిశ్రమ సవాళ్లను ఎదుర్కొంటున్నదని వివరించారు. ప్రత్యామ్నాయ ఎగుమతి మార్కెట్లను విస్తరించుకోవాలని, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కార్యకలాపాలు ఆధునికీకరించుకోవలసి ఉందని పారిశ్రామిక ప్రతినిధులకు సూచించారు. కమిటీ చైర్మన్‌ డోలా సేన్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో రేణుకా చౌదరి సహా 15 మంది ఎంపీలు పాల్గొన్నారు. వివిధ అంశాలపై చర్చించారు. ఎంపెడా చైర్మన్‌ డీవీ స్వామి (ఐఏఎస్‌) మాట్లాడుతూ భారతదేశంపై సుంకాలు 58.26 శాతానికి చేరడంతో రొయ్యల ఎగుమతిదారులు అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీని ఎదుర్కొనలేకపోతున్నారన్నారు. సమస్యల పరిష్కారాల కోసం వాటాదారుల నుంచి సలహాలు తీసుకున్నారు. సమావేశంలో ఫిషింగ్‌ బోటు ఓనర్ల అసోసియేషన్‌, సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ టెక్నాలజీ, మత్స్య శాఖ, వాణిజ్య పన్నుల విభాగం, ఎక్స్‌పోర్ట్‌ ఇన్‌స్పెక్షన్‌ కౌన్సిల్‌, నేషనల్‌ ఫిషరీష్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు, వైజాగ్‌పటం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, సీఫుడ్‌ ఎక్స్‌పోర్టర్స్‌ అసోసియేషన్‌, ఆక్వా కల్చర్‌ ప్రతినిధులు, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.

కైలాసగిరిపై ఎంపీల సందడి

నగరానికి వచ్చిన వాణిజ్య వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సభ్యులైన ఎంపీలు కైలాసగిరిపై మంగళవారం సాయంత్రం సందడి చేశారు. ఎంపీలు శ్రీభరత్‌, రేణుకా చౌదరి, మాజీ క్రికెటర్‌, తృణమూల్‌ ఎంపీ అయిన యూసఫ్‌ ఖాన్‌ పఠాన్‌ తదితరులు గ్లాస్‌ బ్రిడ్జిని చూశారు. పఠాన్‌ స్కై సైక్లింగ్‌ చేశారు.

Updated Date - Jan 07 , 2026 | 01:07 AM