Share News

పర్యాటక ప్రాజెక్టులకు సహకారం

ABN , Publish Date - Mar 06 , 2026 | 01:15 AM

జిల్లాలో పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటు కోసం అవగాహన ఒప్పందాలు చేసుకున్న సంస్థలకు అవసరమైన సహకారం అందించాలని వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ తేజ్‌ భరత్‌ సూచించారు.

పర్యాటక ప్రాజెక్టులకు సహకారం

వివిధ శాఖల అధికారులతో వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ తేజ్‌ భరత్‌ సమీక్ష

విశాఖపట్నం, మార్చి 5 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటు కోసం అవగాహన ఒప్పందాలు చేసుకున్న సంస్థలకు అవసరమైన సహకారం అందించాలని వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ తేజ్‌ భరత్‌ సూచించారు. వీఎంఆర్‌డీఏ కార్యాలయంలో పర్యాటక శాఖ అధికారులతో కలిసి వివిధ శాఖల అధికారులతో గురువారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. వారు ఎంపిక చేసుకున్న భూముల్లో ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన అనుమతుల కోసం సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆదేశించారు. మొత్తం 43 సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయని, వాటికి జీవీఎంసీ, ఏపీఈపీడీసీఎల్‌, యూసీడీ అధికారులు సహకరించాలన్నారు. వారు పనులు ప్రారంభించే విధంగా ముందుకు తీసుకువెళ్లాలన్నారు. ఈ సమావేశంలో సీఏఓ హరిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


రుషికొండ తీరంలో వించ్‌ పారాసెయిలింగ్‌

ట్రయల్‌రన్‌ విజయవంతం

సాగర్‌నగర్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి):

నగరంలోని రుషికొండ వద్ద గురువారం వించ్‌ పారా సెయిలింగ్‌ ట్రయల్‌రన్‌ విజయవంతంగా నిర్వహించారు. ఇది సాధారణ పారా సెయిలింగ్‌కు భిన్నంగా ఉంటుంది. పర్యాటకులు బోటు పైనుంచి పారాచూట్‌ సాయంతో పైకి వెళ్లి, తిరిగి వస్తారు. పర్యాటక శాఖ అధికారులు, నిపుణుల సమక్షంలో ఈ ట్రయిల్‌ రన్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా గాలివేగం, సాంకేతిక అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విశాఖకు వచ్చే పర్యాటకులకు అంతర్జాతీయ స్థాయి సాహస క్రీడలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టినట్టు నిర్వాహకులు తెలిపారు.


పంచాయతీల వారీగా కులగణన

ఓటర్ల జాబితాలపై కసరత్తు

తొమ్మిదోతేదీన ముసాయిదా జాబితాల ప్రదర్శన

విశాఖపట్నం, మార్చి 5 (ఆంధ్రజ్యోతి):

పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల విభాగం నుంచి తీసుకున్న జాబితాల్లో పంచాయతీల వారీగా ఓటర్లను విభజించారు. ఇంటింటికీ వెళ్లి కులాల వారీగా వివరాలు సేకరిస్తున్నారు. కొన్ని పంచాయతీల్లో ఈ కార్యక్రమం ఇప్పటికే పూర్తికాగా, మరికొన్నిచోట్ల తుది దశకు చేరుకుంది. కులగణన పక్కాగా జరుగుతుందా?, లేదా?...అనేది జిల్లా, మండల అఽధికారులు పర్యవేక్షిస్తున్నారు. రానున్న రెండు, మూడు రోజుల్లో కులగణన పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ఆ తరువాత పంచాయతీల వారీగా ఓటర్ల వివరాలను మండల, డివిజన్‌ స్థాయిలో అధికారులు తనిఖీ చేస్తారు. ఈ ప్రక్రియ ముగిసిన తరువాత పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలు ముద్రించి ఈనెల తొమ్మిదో తేదీన ఎక్కడికక్కడ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. వాటిపై అభ్యంతరాల స్వీకరణకు గడువు ఇవ్వనున్నారు. గత పర్యాయం విశాఖ జిల్లాలో అత్యధికంగా పద్మనాభం మండలం పాండ్రంకి పంచాయతీలో ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. ఈ పర్యాయం ఏ పంచాయతీలో ఎక్కువ ఓటర్లు ఉన్నారనేది ఈనెల తొమ్మిదో తేదీన తేలనున్నది.


జనగణన-2027పై రేపటి నుంచి అధికారులకు శిక్షణ

విశాఖపట్నం, మార్చి 5 (ఆంధ్రజ్యోతి):

జనగణన-2027కు సన్నాహాలు ప్రారంభించినట్టు జిల్లా ప్రిన్సిపల్‌ సెన్సెస్‌ అధికారి, కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తొలిదశలో ఇళ్ల వివరాలు, కుటుంబ సభ్యుల వివరాల నమోదుకు అధికారులకు ఈనెల ఏడో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో ప్రతిరోజు ఉదయం 9.30 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు.


డబ్బాలతో సహా తూకం

కొంతమంది రేషన్‌ డీలర్ల మోసం

డీఎస్‌వో తనిఖీల్లో బహిర్గతం

మహారాణిపేట, మార్చి 5 (ఆంధ్రజ్యోతి):

వన్‌టౌన్‌ ఏరియాలో కొందరు రేషన్‌ డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కార్డుదారులకు బియ్యం పంపిణీలో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ ప్రాంతంలో బియ్యాన్ని డబ్బాలతో సహా కొలుస్తున్నారు. జిల్లా పౌరసరఫరాల అధికారి వి.భాస్కర్‌ తనిఖీల్లో ఈ విషయం గుర్తించారు. బియ్యం తూకం వేసే ముందు డబ్బా బరువు తూకం వేయాలి. ఆ తరువాత బియ్యం తూకం వేసినప్పుడు డబ్బా బరువు కలిపి చూపాలి. కానీ కొంతమంది డీలర్లు అదేమీ పట్టించుకోవడం లేదు. దీనిపై డీలర్లను డీఎస్‌వో గట్టిగా మందలించారు. బియ్యం తూకంలో డబ్బాలు వాడొద్దని హెచ్చరించారు. మరోసారి పునరావృతమైతే చర్యలు తీసుకుంటామన్నారు. కార్డుదారులకు బియ్యమే పంపిణీ చేయాలని సొమ్ములు ఇస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలావుండగా వన్‌టౌన్‌ ప్రాంతంలో కోట వీధి నుంచి జగదాంబ జంక్షన్‌ వరకు పలు డిపోలను బినామీలు నిర్వహిస్తున్నారు. వీరిలో ఎక్కువమంది కార్డుదారులకు బియ్యానికి బదులు డబ్బులు ఇస్తున్నారు. గట్టిగా అడిగితే ఈపోస్‌ మిషన్‌ పనిచేయదని చెబుతుంటారని పలువురు కార్డుదారులు ఆరోపిస్తున్నారు.

Updated Date - Mar 06 , 2026 | 01:15 AM