పర్యాటకానికి సపోర్టు
ABN , Publish Date - Feb 04 , 2026 | 01:02 AM
విశాఖపట్నం పోర్టు నూరు వసంతాలకు చేరువవుతోంది. ప్రస్తుతం పోర్టుకు 93 ఏళ్లు.
నౌకల రాకపోకలు చూసేందుకు నగరవాసులకు అవకాశం
యాజమాన్యం నిర్ణయం
క్రూయిజ్ టెర్మినల్ సమీపాన రూ.16 కోట్లతో విహార ప్రాంగణం నిర్మాణం
కూర్చోడానికి, పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాట్లు
త్వరలో అందుబాటులోకి...
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం పోర్టు నూరు వసంతాలకు చేరువవుతోంది. ప్రస్తుతం పోర్టుకు 93 ఏళ్లు. పోర్టుతో పాటే విశాఖ నగరమూ అభివృద్ధి చెందుతోంది. పోర్టులో ఏమి జరుగుతున్నదో చూడాలంటే మాత్రం సామాన్యులకు సాధ్యం కాదు. అనుమతి లభించదు. ఇకపై పోర్టు పరిసరాలను సామాన్య ప్రజలు కూడా సందర్శకుల్లా చూడడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. క్రూయిజ్ టెర్మినల్ సమీపానే రూ.16 కోట్లతో ప్రమోనేడ్ (ప్రజా విహార ప్రాంగణం) నిర్మిస్తున్నారు. గత ఏడాది జూలైలో శంకుస్థాపన చేసుకున్న ఈ ప్రాజెక్టు త్వరలోనే పూర్తి కానున్నది.
దేశ విదేశాల నుంచి సముద్ర మార్గం ద్వారా వచ్చే నౌకలు పోర్టులో ప్రవేశించి జెట్టీల్లో సరకులను అన్‌లోడింగ్ చేస్తాయి. ఆయిల్ ఉత్పత్తులు, పప్పు దినుసులు, రసాయనాలు, బొగ్గు, జీడిపిక్కలు, ఖనిజాలు అనేకం దిగుమతి అవుతుంటాయి. ఇక్కడి నుంచి ఐరన్‌ఓర్, సముద్ర ఉత్పత్తులు, ఫెర్రో ఎల్లాయిస్, అల్యూమినా, పెట్రో ఉత్పత్తుల వంటివి ఎగుమతి అవుతాయి. ఏటా వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. పోర్టులో ఇన్నర్ హార్బర్, అవుటర్ హార్బర్‌తో పాటు సుమారుగా 30 బెర్తులు ఉన్నాయి. ఇవి ఒక్కోసారి ఖాళీ లేక నౌకలు ఆన్‌రోడ్స్ (పోర్టుకు దూరంగా సముద్రంలో)లోనే రెండు, మూడు రోజులు ఉండిపోతాయి. నౌకల నుంచి దిగుమతి చేసిన సరకులను ఇతర ప్రాంతాలకు రోడ్డు, రైలు మార్గాల ద్వారా పంపేంతవరకు నిల్వ చేయడానికి ఓపెన్ యార్డులను ఉపయోగించుకుంటారు. మరికొన్ని సరుకులను గోదాముల్లో నిల్వ చేస్తారు. వీటి కోసం వందలాది ఎకరాల్లో గోదాములు ఉన్నాయి. అక్కడ కాలుష్యం ఎక్కువ. వాహనాలు పెద్ద సంఖ్యలో తిరుగుతుంటాయి. ఈ ప్రాంతంలో సెక్యూరిటీ ఉంటుంది. అందుకే ఎవరినీ అనుమతించరు. ప్రముఖులు ఎవరైనా వస్తే పోర్టు లాంచీలో ఇన్నర్ హార్బర్ అంతా చూపిస్తుంటారు.
ఇకపై సామాన్యులకు కూడా
పోర్టులోకి వచ్చే నౌకల రాకపోకలను చూసే అవకాశం నగర ప్రజలకు కల్పించాలని యాజమాన్యం నిర్ణయించింది. ఇందు కోసం ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ భవనం సమీపాన సుమారుగా రెండు కి.మీ. పొడవున సముద్రం తీరం వెంబండి వాకింగ్ ట్రాక్ మాదిరి నిర్మాణం చేపడుతున్నారు. హైదరాబాద్‌లో ట్యాంక్ బండ్ మాదిరిగా ఈ నిర్మాణం ఉంటుంది. సందర్శకులు కూర్చోవడానికి, అక్కడక్కడ పార్కులు, పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. టికెట్ పెట్టి సందర్శకులను అనుమతించాలని భావిస్తున్నారు. ఆ ట్రాక్ వెంబడి నడుస్తూ పోర్టులో వచ్చీ, పోయే నౌకలను చూసే అవకాశం మాత్రమే లభిస్తుంది. రెండు, మూడు వారాల్లో ఈ పనులన్నీ పూర్తవుతాయని పోర్టు డిప్యూటీ ఛైర్మన్ రోష్ని అపరంజి తెలిపారు.