Share News

అన్నదాతకు అండ

ABN , Publish Date - Feb 12 , 2026 | 11:17 PM

అన్నదాతలకు బహుళ ప్రయోజనం చేకూర్చాలనే లక్ష్యంతో ‘ఆంధ్రప్రదేశ్‌ ఫార్మర్‌ రిజిస్ట్రీ’ (ఏపీఎఫ్‌ఆర్‌)ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీంతో భూమి కలిగిన ప్రతి రైతు విధిగా ఏపీఎఫ్‌ఆర్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.

అన్నదాతకు అండ
పాడేరు మండలం బరిసింగి కొండపై రైతు నమోదు ప్రక్రియ చేపడుతున్న వ్యవసాయాధికారులు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పొందేందుకు రైతు నమోదు కీలకం

జిల్లాలో 1.58 లక్షల మంది గిరిజన రైతులకు లబ్ధి

ప్రతి రైతు విధిగా నమోదు చేయించుకోవాలని అధికారుల సూచన

ఇంటర్నెట్‌ సదుపాయం లేక అవస్థలు పడుతున్న రైతులు, అధికారులు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

అన్నదాతలకు బహుళ ప్రయోజనం చేకూర్చాలనే లక్ష్యంతో ‘ఆంధ్రప్రదేశ్‌ ఫార్మర్‌ రిజిస్ట్రీ’ (ఏపీఎఫ్‌ఆర్‌)ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీంతో భూమి కలిగిన ప్రతి రైతు విధిగా ఏపీఎఫ్‌ఆర్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఈ నెల 10 నుంచి దానిని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఫార్మర్‌ రిజిస్ట్రీలో నమోదైన రైతులకు ప్రభుత్వం 11 అంకెలతో కూడిన యూనిక్‌ ఫార్మర్‌ ఐడీ నంబర్‌ను కేటాయిస్తుంది. దీంతో భవిష్యత్తులో రైతులకు సంబంధించిన అన్ని రకాల ప్రయోజనాలు పొందేందుకు ఫార్మర్‌ రిజిస్ట్రీ తప్పనిసరి కానుంది.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆంధ్రప్రదేశ్‌ ఫార్మర్‌ రిజిస్ట్రీ’ (ఏపీఎఫ్‌ఆర్‌)ప్రక్రియతో జిల్లాలోని లక్షా 58 వేల మంది రైతులకు బహుళ ప్రయోజనం చేకూరుతుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. జిల్లాలో అనంతగిరిలో 12,726 మంది రైతులు, అరకులోయలో 12,388, చింతపల్లిలో 16,127, డుంబ్రిగుడలో 14,578, జి.మాడుగులలో 15,518, జీకేవీధిలో 15,8978, హుకుంపేటలో 18,000, కొయ్యూరులో 14,126, ముంచంగిపుట్టులో 12,058, పాడేరులో 12,276, పెదబయలులో 14,404 మంది రైతులున్నారు. జిల్లాలో మొత్తం లక్షా 58 వేల 78 మంది రైతులకు గాను కేవలం రెండు రోజుల్లో 75 వేల 847 మంది రైతులు నమోదు చేసుకున్నారు. ఇంకా మిలిగిన రైతులు సైతం విధిగా నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు

ఇంటర్నెట్‌ సదుపాయం లేక అవస్థలు

జిల్లాలో పూర్తి స్థాయిలో ఇంటర్నెట్‌ సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో ‘ఆంధ్రప్రదేశ్‌ ఫార్మర్‌ రిజిస్ట్రీ’ (ఏపీఎఫ్‌ఆర్‌)ప్రక్రియను చేపట్టేందుకు వ్యవసాయాధికారులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలోని 11 మండలాల్లో 244 గ్రామ పంచాయతీలుండగా, నేటికీ 30 శాతం పంచాయతీలకు ఇంటర్నెట్‌ సదుపాయం లేదు. దీంతో ఆయా ప్రాంతాల్లోని ఫార్మర్‌ రిజిస్ర్టీ ప్రక్రియకు సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయి. ఉదాహరణకు పాడేరు మండలం డోకులూరు, బరిసింగి పంచాయతీ కేంద్రాల్లో ఇంటర్నెట్‌ సదుపాయం సరిగా లేకపోవడంతో గురువారం పాడేరుకు శివారున ఉన్న బరికొండ వద్ద రైతులను రప్పించి, వ్యవసాయాధికారులు నమోదు ప్రక్రియలను చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా కేంద్రం పాడేరు మండలంలోనే ఈ పరిస్థితులుంటే, ఇక మారుమూల ప్రాంతాల్లో దుస్థితిని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయినప్పటికీ వ్యవసాయాధికారులు, సిబ్బంది ఆశించిన స్థాయికంటే అధికంగానే రైతుల నమోదు ప్రక్రియను చేపట్టడం విశేషం.

Updated Date - Feb 12 , 2026 | 11:17 PM