Share News

ఆశ్రమ విద్యార్థులకు ఆసరా

ABN , Publish Date - Jul 09 , 2026 | 11:20 PM

తల్లిదండ్రులకు దూరంగా హాస్టళ్లలో ఉండే విద్యార్థులను మరింతగా ప్రోత్సహించడంతో పాటు వారికి నాణ్యమైన పోషకాహారం అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం మెన్‌ చార్జీలను పది శాతం పెంచాలని నిర్ణయించింది.

ఆశ్రమ విద్యార్థులకు ఆసరా
పెదబయలు మండలం గోమంగిలోని మినీ గురుకులం

మెస్‌ చార్జీలను 10 శాతం పెంచాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం

విద్యార్థులకు మరింత నాణ్యమైన పోషకాహారం అందించడమే లక్ష్యం

జిల్లా వ్యాప్తంగా 56,199 మందికి ప్రయోజనం

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

తల్లిదండ్రులకు దూరంగా హాస్టళ్లలో ఉండే విద్యార్థులను మరింతగా ప్రోత్సహించడంతో పాటు వారికి నాణ్యమైన పోషకాహారం అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం మెన్‌ చార్జీలను పది శాతం పెంచాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లోని ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో విద్యను అభ్యసించే గిరిజన విద్యార్థులకు ఆసరాగా ఉంటుందని ఉపాధ్యాయులు అంటున్నారు. దీని వల్ల జిల్లాలోని పదకొండు మండలాల్లో హాస్టళ్లలో ఉంటున్న 56,199 మంది గిరిజన విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.

జిల్లాలోని పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు, అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో 117 గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల్లో 37,304 మంది గిరిజన విద్యార్థులు, 33 గిరిజన సంక్షేమ గురుకులాల్లో 11,695 మంది, 33 పోస్ట్‌ మెట్రిక్‌(కాలేజీలకు అనుబంధం) హాస్టళ్లలో 7,200 మంది గిరిజన విద్యార్థులు ఆశ్రమ విద్యను అభ్యసిస్తున్నారు. వారికి తరగతులను బట్టి ప్రతి నెలా డైట్‌ చార్జీలను ప్రభుత్వం మంజూరు చేస్తుంది. అయితే గతంలో 3 లేదా 5 శాతం మాత్రమే డైట్‌ చార్జీలు పెంచేవారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ, సంస్కరణలకు బాటలు వేస్తున్న రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖా మంత్రి నారా లోకేశ్‌ చొరవతో డైట్‌(మెస్‌)చార్జీలను పది శాతం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రుల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అందుకు ఆమోదం తెలిపారు.

గిరిజన విద్యార్థులకు మరింత ప్రయోజనం

సర్కారు విద్యను ప్రోత్సహించాలనే లక్ష్యంతో పాటు వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు మరింత నాణ్యమైన పోషకాహారాన్ని అందించాలనే ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం మెస్‌ చార్జీలను పది శాతం పెంచాలని నిర్ణయించింది. దీంతో గిరిజన ప్రాంతాల్లోని ఆశ్రమ విద్యకు మరింత వెన్నుదన్నుగా ఉంటుందని ఉపాధ్యాయులు అంటున్నారు. ఇతర ప్రాంతాలతో పోల్చితే గిరిజన ప్రాంతాల్లో ప్రైవేటు పాఠశాలలు ఉండకపోవడంతో పాటు గిరిజనుల పేదరికం కారణంగా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పిస్తారు. అలాగే ఏజెన్సీలో అధిక సంఖ్యలో ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలే ఉంటాయి. అందులో గిరిజన విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తూ విద్యా బోధన చేస్తుంటారు. దీంతో శత శాతం గిరిజన విద్యార్థులు సైతం ఆశ్రమ విద్యనే అభ్యసిస్తున్నారు. ఈ తరుణంలో పెంచిన మెస్‌ చార్జీల ప్రయోజనం ఇతరుల కంటే గిరిజన విద్యార్థులకే ఎక్కువగా లబ్ధి చేకూరుతుందని టీచర్లు తెలిపారు.

ప్రభుత్వం పెంచే మెస్‌ చార్జీల వివరాలు (నెలకు)

తరగతులు ప్రస్తుత మెస్‌ చార్జీలు పెంచే మెస్‌ చార్జీలు

3 నుంచి 4 రూ.1,150 రూ.1,265

4 నుంచి 10 రూ.1,400 రూ.1,540

పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లు రూ.1,600 రూ.1,760

Updated Date - Jul 09 , 2026 | 11:20 PM