Share News

సంతలే మన్యం సూపర్‌ మార్కెట్లు!

ABN , Publish Date - Jan 09 , 2026 | 10:27 PM

మన్యంలోని వారపు సంతలే గిరిజనానికి సూపర్‌ మార్కెట్లుగా అవసరాలు తీర్చుతున్నాయి. పల్లెల్లో జనం తమ నిత్యావసర సరుకులతో పాటు ఇతర వస్తువులను కొనుగోలు చేసేందుకు వారపు సంతలనే ఆశ్రయిస్తారు. ఏజెన్సీలో నిత్యం ఏదో ప్రాంతంలో సంతలు జరుగుతుంటాయి. ప్రతి ఏడాది నవంబరు, డిసెంబరు నెలల్లోనే గిరిజనుల వ్యవసాయ, అటవీ ఫలసాయం చేతికి వస్తుంది. వాటిని సంతల్లో విక్రయించి, వచ్చిన డబ్బులతో సరుకులన్నీ కొనుగోలు చేసుకుంటారు.

సంతలే మన్యం సూపర్‌ మార్కెట్లు!
పాడేరు మండలం గుత్తులపుట్టు వారపు సంతలో బట్టలు కొనుగోలు చేస్తున్న గిరిజనులు

గిరిజనులకు అవసరమైన వస్తువులన్నీ సంతల్లోనే కొనుగోలు

రైతులు, వర్తకులతో సందడి వాతావరణం

సూపర్‌ బజార్లను మించి అన్ని రకాల సరుకులు లభ్యం

ఏజెన్సీలో నిత్యం ఏదో ప్రాంతంలో వారపు సంతల నిర్వహణ

(పాడేరు-ఆంధ్రజ్యోతి)

సంకాంత్రి పండుగ సీజన్‌లో గిరిజనులు తమ పండుగలకు అవసరమైన వస్తువులు, దుస్తులు, ఇతర సామగ్రి అన్నింటినీ వారపు సంతల్లోనే కొనుగోలు చేస్తారు. పూజలకు అవసరమైన కొబ్బరికాయలు మొదలుకుని పిండి వంటల సరుకులు, కొత్త దుస్తులు, చెప్పులు, కుండలు, వంటపాత్రలు, కోళ్లు, మేకలు, తదితరలు కొనుగోలు చేసుకుంటారు. సంతల్లో బట్టలు కొనుగోలు చేసిన వెంటనే అక్కడే కుట్టించుకునేందుకు టైలర్లు కూడా అందుబాటులో ఉంటారు. ఆయా సరుకులను విక్రయించే వర్తకులు డిసెంబరు, జనవరి నెలలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తారంటే అతిశయోక్తి కాదు. మైదాన ప్రాంతాల్లో సూపర్‌బజార్లతో లభించే అన్ని వస్తువులు ఏజెన్సీని వారపు సంతల్లోనూ లభిస్తాయి. దీంతో గిరిజనులు సంతలపైనే ఆధారపడతారు.

మన్యంలో వారపు సంతలు జరిగే ప్రాంతాలివే...

8సోమవారం: పెదబయలు మండలంలో పెదబయలు, రూడకోట, చింతపల్లి మండలంలో అన్నవరం, జీకేవీధి మండలంలో ఆర్వీనగర్‌.

8మంగళవారం: జి.మాడుగుల, చింతపల్లి మండలం లోతుగెడ్డ కూడలి, ముంచంగిపుట్టు మండలంలో బూసిపుట్టు.

8బుధవారం: చింతపల్లి, డుంబ్రిగుడ మండలంలో కించుమండ, అనంతగిరి మండలంలో కాశీపట్నం, డముకు.

8గురువారం: పాడేరు మండలంలో గుత్తులపుట్టు, జీకేవీధి, చింతపల్లి మండలంలో లంబసింగి.

8శుక్రవారం: పాడేరు, డుంబ్రిగుడ మండలంలో అరకు, జీకేవీధి మండలంలో పెదవలస.

8శనివారం: ముంచంగిపుట్టు, హుకుంపేట.

8ఆదివారం: పాడేరు మండలంలో వంట్లమామిడి, మినుములూరు, అరకులోయ మండలంలో సుంకరమెట్ట, చింతపల్లి మండలంలో జర్రెల, జీకేవీధి మండలంలో ధారకొండ, కొయ్యూరు మండలంలో కాకరపాడు.

Updated Date - Jan 09 , 2026 | 10:27 PM