Share News

పెట్టుబడుల్లో సూపర్‌

ABN , Publish Date - Sep 11 , 2026 | 12:49 AM

జిల్లాకు పెట్టుబడులు సూపర్‌ వేగంతో వస్తున్నాయి. పెట్టుబడుల ఆకర్షణలో అనకాపల్లి జిల్లా రాష్ట్రంలో మిగిలిన జిల్లాలతో పోలిస్తే ముందు వరుసలో వుంది. ఆర్థిక, సామాజిక రంగసాల్లో మెరుగైన ఫలితాలను సాధిస్తున్నది. అయితే పరిపాలనలో మాత్రం ఒకింత వెనుకబడింది.

పెట్టుబడుల్లో సూపర్‌
అమరావతిలో నిర్వహించిన సదస్సులో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌

రాష్ట్రంలో అతిపెద్ద పెట్టుబడుల కేంద్రంగా జిల్లా

భేషుగ్గా ఆర్థిక, సామాజిక ప్రగతి

86 స్కోరుతో ‘ఏ’ గ్రేడ్‌

పాలనలో మందకొడితనంతో ‘బీ’ గ్రేడ్‌

మెరుగ్గా గృహ నిర్మాణం, మౌలిక వసతుల కల్పన

కరువు కోరల్లో జిల్లా.. 54 శాతం లోటు వర్షపాతం

కలెక్టర్ల సదస్సులో నివేదిక వెల్లడి

అనకాపల్లి, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి):

జిల్లాకు పెట్టుబడులు సూపర్‌ వేగంతో వస్తున్నాయి. పెట్టుబడుల ఆకర్షణలో అనకాపల్లి జిల్లా రాష్ట్రంలో మిగిలిన జిల్లాలతో పోలిస్తే ముందు వరుసలో వుంది. ఆర్థిక, సామాజిక రంగసాల్లో మెరుగైన ఫలితాలను సాధిస్తున్నది. అయితే పరిపాలనలో మాత్రం ఒకింత వెనుకబడింది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం ప్రారంభమైన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో అనకాపల్లి జిల్లా ప్రగతికి సంబంధించి ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు ఇవి. ఆర్థిక ప్రగతి, మౌలిక వసతులు, పరిశ్రమలు, తదితర అంశాలపై ముఖ్యమంత్రి విస్తృతస్థాయి సమీక్ష నిర్వహించారు. సదస్సులో ప్రవేశపెట్టిన నివేదికల ఆధారంగా పెట్టుబడుల ఆకర్షణలో అనకాపల్లి జిల్లా రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిపాలన, భూసేకరణ, వర్షాభావ పరిస్థితులను సమర్థంఆ ఎదుర్కోవడంలో వెనుకబడి ఉన్నట్టు స్పష్టమవుతున్నది.

పెట్టుబడుల కేంద్రంగా...

పెట్టుబడుల ఆకర్షణ కేంద్రంగా అనకాపల్లి బాగా ఎదిగిందని ప్రభుత్వ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు అనకాపల్లి జిల్లాను ప్రత్యేకంగా ప్రశంసించారు. గత రెండేళ్లలో దాదాపు రూ.2.6 లక్షల కోట్ల పెట్టుబడులు జిల్లాకు రాగా, పరిశ్రమల కోసం 8,300 ఎకరాలను కేటాయించారు. ఈ పరిశ్రమల ఏర్పాటు ద్వారా సుమారు 83 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పారిశ్రామికంగా మరింత అభివృద్ధి కోసం మాకవరపాలెం మండలంలో 4,800 ఎకరాలకు ల్యాండ్‌ బ్యాంకుగా జిల్లా అధికార యంత్రాంగం గుర్తించింది. దీంతోపాటు రాచపల్లి రెవెన్యూలో మరో 500 ఎకరాల్లో సుమారు రూ.30 వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రములు, కంపెనీలు ఏర్పాటు కానున్నాయి. వీటిల్లో ఉత్పత్తి ప్రారంభం అయితే సుమారు 20 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

ఆర్థిక ప్రగతి భేష్‌

ఆర్థిక, సామాజిక సూచీలో అగస్టు నెలకుగాను 86 స్కోరుతో అనకాపల్లి జిల్లా ‘ఏ’ గ్రేడ్‌లో నిలిచింది. ఆర్థిక విభాగంలో అత్యుత్తమంగా 94 స్కోర్‌తో ‘ఏ ఫ్లస్‌’ గ్రేడ్‌ సాధించడం విశేషం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వ్యవసాయ, అనుబంధ రంగాలల్లో 12.1 శాతం వృద్ధితో రూ.1,257 కోట్లుగా నమోదైంది.

పాలనలో మందకొడితనం...

ఆర్థిక, సామాజిక రంగాల్లో సత్తా చాటినప్పటికీ గవర్నెన్స్‌ (పరిపాలన) విభాగంలో 73 స్కోర్‌తో ‘బీ’ గ్రేడ్‌’కే పరిమితమైంది. సానుకూల ప్రజా అవగాహన మెరుగుపరచాల్సిన జిల్లాల జాబితాలో అనకాపల్లి కూడా ఉందని నివేదిక స్పష్టం చేసింది. జీవీఏ, జీఎస్‌డీపీ అంచానాలపై అధికారులకు కెపాసిటీ బిల్డింగ్‌ శిక్షణ ఇంకా పూర్తికాని ఐదు జిల్లాల్లో అనకాపల్లి ఉండడం గమనార్హం.

గృహ నిర్మాణం, మౌలిక వసతుల కల్పన

ప్రధానమంత్రి ఆవాస యోజన (పీఎంఏవై) కింద జిల్లాలో పేదలకు 54,889 ఇళ్లు మంజూరు చేయగా వీటిలో 45,451 (83 శాతం) ఇళ్ల నిర్మాణం పూర్తయి రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. అర్బన్‌ సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కింద జిల్లాలోని నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీల్లో క్లినిక్‌లు, పార్కులు తదితర లక్ష్యాలను వంద శాతం పూర్తి చేశారు. జిల్లాలో 98.93 శాతం వీధి దీపాలు వెలుగుతుండడం ద్వాఆర రాష్ట్రంలో మూడో స్థానంలో ఉంది. ఇళ్ల నుంచి చెత్త సేకరణలో 99.3 శాతం ఇళ్లను కవర్‌ చేసి ముందంజలో ఉంది. అలాగే 100 శాతం ఇళ్లకు ఎల్‌పీజీ కనెక్షన్‌లు ఉన్నాయి. నర్సీపట్నం నియోజకవర్గానికి తాండవ రిజర్వాయర్‌, అనకాపల్లి నియోజకవర్గానికి ఏలేరు రిజర్వాయర్‌ ద్వారా మల్టీ విలేజ్‌ స్కీమ్‌ మంచినీటి ప్రాజెక్టులను ప్రతిపాదించారు.

జిల్లాలో కరువు ఛాయలు

తీవ్రవర్షాభావ పరిస్థితులు కలవరపెడుతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం ఎదుర్కొంటున్న మొదటి ఐదు జిల్లాలో అనకాపల్లి ఒకటి. జూన్‌ నుంచి ఆగస్టు వరకు సాధారణ వర్షపాతంలో 54 శాతం లోటు నమోదైంది. దీనివల్ల ఖరీఫ్‌ పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడింది.

పెండింగ్‌ పనులు

జిల్లా వ్యాప్తంగా ఇంకా 70 అవాసాలకు సరైన రహదారి సౌకర్యం లేదు. గ్రామీణ మంచినీటి సరఫరాకు సంబంధించి 1,869 పనులకుగాను, 1,227 మాత్రమే (65.65 శాతం) పూర్తయ్యాయి. ఇంకా 642 పనులు పెండింగ్‌లో ఉన్నాయి.

Updated Date - Sep 11 , 2026 | 12:49 AM