భర్త హత్యకు సుపారీ!
ABN , Publish Date - Jan 08 , 2026 | 01:16 AM
వివాహేతర సంబంధం మోజులో కట్టుకున్న భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది...ప్రియుడితో కలిసి హత్యకు ప్రణాళిక రచించింది. ఆమె ప్రోత్సాహంతో అతను తనకు తెలిసిన ఇద్దరికి రూ.50 వేలు సుపారీ ఇచ్చాడు. భర్తను హత్య చేయించిన తరువాత ఏమీ తెలియనట్టు పోలీసులకు మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చింది. ప్రియుడితో కలిసి వేరొకచోట కాపురం పెట్టిన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో హత్యోదంతాన్ని బయటపెట్టింది. పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ హత్యకు సంబంధించి సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
వివాహేతర సంబంధం మోజులో అఘాయిత్యం
మద్యం తాగించి గొంతునులిమి
చంపేసిన ప్రియుడు, మరో ఇద్దరు
ఏమీ తెలియనట్టు
భర్త కనిపించడం లేదని స్టేషన్‌లో ఫిర్యాదు
ప్రియుడితో కలిసి వేరొకచోట కాపురం
పోలీసుల దర్యాప్తులో హత్యోదంతం బట్టబయలు
నలుగురిని అరెస్టు
విశాఖపట్నం/కొమ్మాది,
జనవరి 7 (ఆంధ్రజ్యోతి):
వివాహేతర సంబంధం మోజులో కట్టుకున్న భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది...ప్రియుడితో కలిసి హత్యకు ప్రణాళిక రచించింది. ఆమె ప్రోత్సాహంతో అతను తనకు తెలిసిన ఇద్దరికి రూ.50 వేలు సుపారీ ఇచ్చాడు. భర్తను హత్య చేయించిన తరువాత ఏమీ తెలియనట్టు పోలీసులకు మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చింది. ప్రియుడితో కలిసి వేరొకచోట కాపురం పెట్టిన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో హత్యోదంతాన్ని బయటపెట్టింది. పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ హత్యకు సంబంధించి సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
విజయనగరం జిల్లా గరివిడి మండలం కోనూరుకు చెందిన అల్లాడ నాగరాజు (40)కు అదే మండలం బొండపల్లికి చెందిన రమ్య(34)తో పదేళ్ల కిందట వివాహం జరిగింది. ఎనిమిదేళ్ల కిందట ఉపాధి కోసం నాగరాజు భార్యతో కలిసి నగరానికి వచ్చాడు. కొమ్మాది సమీపంలోని కే 2 కాలనీలో కాపురం పెట్టాడు. నాగరాజు పనోరమహిల్స్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. నాగరాజు, రమ్య దంపతులకు ఎనిమిది, ఆరేళ్ల వయస్సు ఉన్న ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇదిలావుండగా పనోరమ హిల్స్‌లోనే ట్రీట్‌మెంట్ ప్లాంటు వర్కర్‌గా టెక్కలికి చెందిన సంజీవి వసంతరావు (38) పనిచేస్తున్నాడు. ఏడాది కిందట నాగరాజుకు అతనితో పరిచయమైంది. వసంతరావు కంచరపాలెం ధర్మానగర్‌లో ఉంటున్నాడు. వసంతరావును నాగరాజు తరచూ తన ఇంటికి తీసుకువెళుతుండేవాడు. ఈ క్రమంలో నాగరాజు భార్యతో వసంతరావుకు పరిచయం పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. తమ సంబంధానికి నాగరాజు అడ్డుగా ఉంటున్నాడని భావించిన రమ్య ఎలాగైనా అతడిని అడ్డుతొలగించుకోవాలని భావించింది. ప్రియుడు వసంతరావుతో కలిసి హత్యకు ప్రణాళిక రచించింది. నాగరాజు హత్య కోసం వసంతరావు తాను ఉంటున్న ధర్మానగర్ ప్రాంతానికి చెందిన బాలకృష్ణ, ప్రవీణ్ అలియాస్ పండుకు రూ.50 వేలు సుపారీ ఇచాడు. ప్రణాళికలో భాగంగా గత ఏడాది నవంబరు 27న నాగరాజును వసంతరావు, బాలకృష్ణ, ప్రవీణ్ కలిసి మధురవాడ మిథిలాపురి వుడా కాలనీలోని లాడ్జికి తీసుకువెళ్లి మద్యం తాగించారు. అనంతరం ఊపిరాడకుండా గొంతునులిమి హత్యచేశారు. అదేరోజు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మృతదేహాన్ని బైక్ మీద తీసుకువెళ్లి తిమ్మాపురంలో బావికొండ ఎదురుగా ఉన్న తుప్పల్లో పడేసి వెళ్లిపోయారు.
నాగరాజు తల్లిదండ్రులు తమ కుమారుడు తమతో మాట్లాడకపోవడంతో రమ్యకు ఫోన్ చేసి అడిగితే పొంతనలేని సమాధానాలు చెబుతుండేది. ఈ క్రమంలో వారికి అనుమానం రాకుండా ఉండేందుకు తన భర్త కనిపించడం లేదంటూ గత నెల 17న పీఎం పాలెం పోలీసులకు రమ్య ఫిర్యాదు చేసింది. తర్వాత కే2 కాలనీలోని ఇంటిని ఖాళీ చేసి బక్కన్నపాలెంలో ఒక ఇల్లు తీసుకుని ప్రియుడితో కలిసి కాపురం పెట్టింది. దీంతో నాగరాజు తల్లిదండ్రులకు అనుమానం రావడంతో తమ కుమారుడు కనిపించడం లేదని, కోడలిపై అనుమానం ఉందని పీఎం పోలీసులకు చెప్పారు. అయితే తాము దీనిపై ఇప్పటికే ఏసీపీ అప్పలరాజు పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే కేసు మిస్టరీ వీడుతుందని చెప్పి, రమ్యను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. తాను, తన ప్రియుడు వసంతరావు కలిసి తన భర్తను సుపారీ ఇచ్చి హత్య చేయించామని అంగీకరించింది. దీంతో వసంతరావును అదుపులోకి తీసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా బాలకృష్ణ, ప్రవీణ్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు తిమ్మాపురం వెళ్లి మృతదేహాన్ని గుర్తించి, పోస్టుమార్టానికి తరలించారు. నిందితులు నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సీఐ బాలకృష్ణ తెలిపారు.