Share News

బీచ్‌రోడ్డులో సండే టెర్రర్‌!

ABN , Publish Date - Jun 08 , 2026 | 12:48 AM

ఆహ్లాదానికి చిరునామాగా భావించే బీచ్‌రోడ్డు వాహనాల రద్దీతో ట్రాఫిక్‌ పద్మవ్యూహాన్ని తలపిస్తోంది.

బీచ్‌రోడ్డులో సండే టెర్రర్‌!

వాహనాలతో కిటకిటలాడుతున్న వైనం

పార్కింగ్‌కు స్థలం లేక రోడ్డుపైనే నిలిపివేత

ఫుట్‌పాత్‌లపైనే ద్విచక్ర వాహనాల పార్కింగ్‌

పాదచారులు, సందర్శకుల తప్పని వెతలు

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

ఆహ్లాదానికి చిరునామాగా భావించే బీచ్‌రోడ్డు వాహనాల రద్దీతో ట్రాఫిక్‌ పద్మవ్యూహాన్ని తలపిస్తోంది. ఆదివారం సాయంత్రమైతే బీచ్‌రోడు పొడవునా వాహనాలు నిలిచిపోతున్నాయి. రహదారి మొత్తం కార్లు, ఆటోలతో నిండిపోగా, పార్కింగ్‌ స్థలం లేక ద్విచక్రవాహనాలను ఫుట్‌పాత్‌లపైకి ఎక్కించి నిలిపివేస్తున్నారు. దీంతో బీచ్‌రోడ్డుకు వచ్చే సందర్శకులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి.

నగరవాసులతో పాటు వివిధ ప్రాంతాలకు చెందినవారు బీచ్‌లో ఆహ్లాదంగా గడిపేందుకు ఆసక్తి చూపుతుంటారు. వారంతాల్లో నగరవాసులు కుటుంబాలతో సహా తీరానికి చేరుకుంటారు. పర్యాటకులు, సందర్శకుల తాకిడికూడా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం వేసవి కావడంతో ఉదయం నుంచి ఉక్కపోత, ఎండతీవ్రతకు అల్లాడిపోతున్న జనం సాయంత్రమయ్యేసరికి బీచ్‌కు వెళ్లి సేదతీరుతున్నారు. దీనివల్ల బీచ్‌రోడ్డులో రద్దీ దారుణంగా పెరిగిపోయింది. అధికశాతం మంది కార్లతో వస్తున్నారు. ఈ నేపథ్యంలో బీచ్‌రోడ్డుని ఆనుకుని ఉన్న పార్కింగ్‌స్థలాలన్నీ నిండిపోతుండడంతో వాహనాలను రహదారి పక్కన నిలిపేస్తున్నారు. దీనివల్ల బీచ్‌రోడ్డుమీదుగా వాహనాలు ఒకవైపు నుంచి మాత్రమే రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరోవైపు ద్విచక్రవాహనాల తాకిడి అధికంగా ఉండడంతో ఎక్కడ పార్కింగ్‌ చేయాలో తెలియక ఫుట్‌పాత్‌పైకి ఎక్కించి అక్కడ పార్కింగ్‌చేసి బీచ్‌లోకి వెళ్లిపోతున్నారు. బీచ్‌రోడ్డుతోపాటు ఫుట్‌పాత్‌లు కూడా వాహనాలతో నిండిపోవడంతో కాలుపెట్టడానికి కూడా స్థలం కనిపించడం లేదు. పాదచారులు, సందర్శకులు బీచ్‌రోడ్డులో పది అడుగులు నడవాలంటే ఎటువైపు నుంచి ఏ వాహనం వచ్చి ఢీకొడుతుందోనని భయపడుతున్నారు. వాహన రాకపోకలను క్రమబద్ధీకరించడంతో పాటు పార్కింగ్‌ స్థలాల్లోనే వాహనాలను నిలిపేలా చూడాల్సిన ట్రాఫిక్‌ పోలీసులు చలానాలు రాయడంలో నిమగ్నమైపోతున్నారు. ఆదివారం సాయంత్రం సమయంలో బీచ్‌రోడ్డులోకి వాహనాలు ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటే సందర్శకులకు ఆహ్లాదం చేరువవుతుందని భావిస్తున్నారు.

Updated Date - Jun 08 , 2026 | 12:48 AM