Share News

సండే సందడి

ABN , Publish Date - Sep 28 , 2026 | 12:15 AM

ఆర్కే బీచ్‌ ఆదివారం సందర్శకులతో కిటకిటలాడింది.

సండే సందడి

సందర్శకులతో కిటకిటలాడిన సాగర తీరం

ఆర్కే బీచ్‌ ఆదివారం సందర్శకులతో కిటకిటలాడింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా వీఎంఆర్డీఏ పార్కులు, మ్యూజియంలకు ఆదివారం ఉచిత ప్రవేశం కల్పించడంతో సందర్శకులు క్యూ కట్టారు. దీంతో సబ్‌మెరైన్‌, ఎయిర్‌ క్రాఫ్ట్‌ మ్యూజియంలు కిక్కిరిశాయి. కుటుంబాలతో సహా జనం భారీగా తరలిరావడంతో తీరప్రాంతం కోలాహలంగా మారింది. ఎక్కువమంది సమ్రుద స్నానాలు చేసేందుకు ఆసక్తి చూపడంతో ప్రమాదాలు సంభవించకుండా పోలీసులు, గజ ఈతగాళ్లు చర్యలు చేపట్టారు.

- బీచ్‌రోడ్డు/ సిరిపురం ఆంధ్రజ్యోతి


ఐఐపీఈ డైరెక్టర్‌ పోస్టు భర్తీకి సన్నాహాలు

దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌

నవంబరు 9 వరకు గడువు

విశాఖపట్నం, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి):

ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ (ఐఐపీఈ) డైరెక్టర్‌ పోస్టు భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖ పరిధిలోని జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థగా ఐఐపీఈ కొనసాగుతోంది. ఈ సంస్థ డైరెక్టర్‌ పోస్టు పదవీకాలం వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త డైరెక్టర్‌ కోసం శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అభ్యర్థులు పీహెచ్‌డీతోపాటు పెట్రోలియం ఇంజనీరింగ్‌, కెమికల్‌ ఇంజనీరింగ్‌, మెకానికల్‌/ఇండిస్ర్టియల్‌ ఇంజనీరింగ్‌, జియాలజీ లేదా జియో ఫిజిక్స్‌లో బ్యాచిలర్‌ లేదా మాస్టర్స్‌ డిగ్రీలో ప్రథమ శ్రేణి లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. విద్యాపరంగా అత్యుత్తమ రికార్డుతోపాటు ఐఐటీలకు సమానమైన ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో కనీసం పదేళ్ల ప్రొఫెసర్‌ అనుభవం అవసరం. పీహెచ్‌డీ విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించిన అనుభవం కూడా ఉండాలని నిబంధన విధించారు. ఐదేళ్ల పరిపాలనా అనుభవంతో పాటు దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థి వయసు 65 ఏళ్లకు మించకూడదు. 60 ఏళ్లలోపు వారికి ప్రాధాన్యత కల్పిస్తామని నోటిఫికేషన్‌లో రిజిస్ర్టార్‌ పేర్కొన్నారు. ఈ పోస్టుకు ఎంపికయ్యే అభ్యర్థికి నెలకు రూ.2.25 లక్షల వేతనం చెల్లిస్తారు. నవంబరు తొమ్మిదో తేదీలోగా దరఖాస్తులను సబ్బవరం వంగలిలోని వర్సిటీ క్యాంపస్‌లోని రిజిస్ర్టార్‌ పేరుతో పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తుతోపాటు తమపై ఎలాంటి విజిలెన్స్‌ లేదా క్రమశిక్షణా కేసు పెండింగ్‌లో లేదని సంబంధిత అధికారి ధ్రువీకరించిన విజిలెన్స్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ను జత చేయాల్సి ఉంటుంది.


దోపిడీ కేసులో ముమ్మర దర్యాప్తు

ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

విశాఖపట్నం/సీతంపేట సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి):

నగరంలో సంచలనం సృష్టించిన కారులో రూ.71.2 లక్షలు నగదు, పది తులాల బంగారం దోపిడీ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరంచేశారు. కేసు చిక్కుముడి విప్పేందుకు ఎనిమిది ప్రత్యేక బృందాలను నియమించారు. ద్వారకానగర్‌- డైమండ్‌ పార్కు రోడ్డులో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వద్ద ఈనెల 25న అర్ధరాత్రి ఒక కారు అద్దాలు పగలగొట్టి అందులోని రెండు బ్యాగ్‌లతో ఉంచిన రూ.71.2 లక్షల నగదు, పది తులాల బంగారు అభరణాలను గుర్తుతెలియని వ్యక్తులు దోచుకుపోయిన విషయం తెలిసిందే. ఎన్‌ఏడీ సమీపంలోని బుచ్చిరాజుపాలేనికి చెందిన కొణతాల రమేష్‌ ట్రేడింగ్‌ చేస్తుండగా, ఆన్‌లైన్‌లో రాజు అనే వ్యక్తి అతనికి పరిచయమయ్యాడు. రమేష్‌ వద్ద నగదు ఉందని తెలుసుకున్న రాజు ఆ డబ్బును డాలర్ల రూపంలో మారుస్తానన్ని నమ్మించాడు. రాజుని వాట్సాప్‌కాల్‌తో తప్ప నేరుగా చూడని రాజు డబ్బుని ఎక్కడికి తేవాలని అడిగితే, సీతమ్మధారలోని క్షత్రియకల్యాణమండపం వద ్దకు తీసుకువస్తే డాలర్లు అందజేస్తానని చెప్పాడు. దీంతో రాజు డిజైర్‌కారులో తన భార్య, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి వెళ్లగా, అక్కడి నుంచి డైమండ్‌పార్కు వద్దకు రావాలని చెప్పాడు. దీంతో 25న రాత్రి 12 గంటల సమయంలో అక్కడికి వెళ్లారు. రమష్‌తోపాటు వచ్చినవారంతా కారులో ఉండగా కొందరు వచ్చి తమను రాజు పంపించాడని చెప్పి వారితో మాటలు కలిపారు. అనంతరం రెండు బ్యాగుల్లోని డబ్బు, బంగారం లాక్కొనేందుకు యత్నించగా వారు ప్రతిఘటించడంతో కారు అద్దాలను ధ్వంసం చేసి, వారిపై దాడిచేసి నగదు, బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఈ సమయంలో ఒక బైక్‌ను నిందితులు అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. దీనిపై బాధితులు ద్వారకా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే బాధితుడు రాజు అనే వ్యక్తిని నేరుగా చూడలేదని , దోపిడీకి పాల్పడినవారు కూడా తమకు తెలియదని చెబుతుండడంతో పోలీసులు నిందితులను పట్టుకోవడం ఎలా అని తలలు పట్టుకుంటున్నారు. క్రైమ్‌ ఏసీపీ వెంకటరావు పర్యవేక్షణలో ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి ఘటనాస్థలంలోని సీసీ కెమెరాలు, బాధితుడికి వాట్సాప్‌కాల్‌లో మాట్లాడిన రాజు ఫోన్‌నంబరు ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దోపిడీతో సంబంధం ఉందని అనుమానిస్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది.

Updated Date - Sep 28 , 2026 | 12:15 AM