Share News

నిప్పులు చెరిగిన సూరీడు

ABN , Publish Date - Apr 12 , 2026 | 11:33 PM

మన్యంలో ఆదివారం తీవ్రమైన ఎండ కాసింది. ఎండ తీవ్రతకు ఏజెన్సీ వాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు.

నిప్పులు చెరిగిన సూరీడు
నిర్మానుష్యంగా ఉన్న ముంచంగిపుట్టు ప్రధాన రహదారి

విలవిలలాడిన జనం

కొయ్యూరులో అత్యధికంగా 37.4 డిగ్రీలు

పాడేరు, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): మన్యంలో ఆదివారం తీవ్రమైన ఎండ కాసింది. ఎండ తీవ్రతకు ఏజెన్సీ వాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఉదయం వేళ కాస్త చల్లదనంగా ఉంటున్నప్పటికీ, మిలిగిన వేళల్లో మాత్రం వేడి ప్రభావం చూపుతున్నది. ప్రధానంగా పగలు ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. దీంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో బయట సంచరించలేని పరిస్థితి ఏర్పడుతుండడంతో రోడ్లు సైతం జనం, వాహన సంచారం లేక నిర్మానుష్యంగా మారుతున్నాయి. తీవ్ర ఎండ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల శాఖ సూచిస్తున్నది. ఏజెన్సీలో ఆదివారం కొయ్యూరులో 37.4 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా అరకులోయలో 35.9, చింతపల్లిలో 34.5, జి.మాడుగులలో 34.3, పెదబయలు, హుకుంపేటలో 32.9, ముంచంగిపుట్టులో 32.0, అనంతగిరి 31.7 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ముంచంగిపుట్టులో..

వేసవి ఎండలు మండిపోతున్నాయి. ఆదివారం భానుడు నిప్పులు చెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. మండల కేంద్రంలో 34 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కావడంతో జనం అల్లాడిపోయారు. ప్రధాన రహదారితోపాటు గ్రామాల్లో జన సంచారం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించింది. దుకాణాలు కూడా ఖాళీగా కనిపించాయి. అత్యవసర పనుల మీద మాత్రమే కొద్ది మంది గొడుగులు, టోపీలు, ముఖానికి వస్త్రాలు కప్పును ఎండ బారిన పడకుండా చూసుకుంటున్నారు.

Updated Date - Apr 12 , 2026 | 11:33 PM