Share News

వేసవి టూర్లు

ABN , Publish Date - May 05 , 2026 | 12:54 AM

విద్యా సంస్థలకు వేసవి సెలవులు ప్రకటించడంతో ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ప్రత్యేక ప్యాకేజీలు రూపొందించింది.

వేసవి టూర్లు

పర్యాటక శాఖ సన్నద్ధం

అనంతగిరి ట్రెక్కింగ్‌కు యువత ఆసక్తి

అరకు ప్యాకేజీకి ఆదరణ

విశాఖపట్నం, మే 4 (ఆంధ్రజ్యోతి):

విద్యా సంస్థలకు వేసవి సెలవులు ప్రకటించడంతో ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ప్రత్యేక ప్యాకేజీలు రూపొందించింది. వీటిలో అనంతగిరికి ఎక్కువ డిమాండ్‌ కనిపిస్తోంది. అక్కడ అటవీ శాఖ అధికారులు ట్రెక్కింగ్‌కు ఏర్పాట్లు చేయడంతో యువతీ యువకులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఎప్పటిలాగే అరకు-బొర్రా గుహల రైలు కమ్‌ రోడ్డు ప్యాకేజీకి అధిక డిమాండ్‌ లభిస్తోంది.

నగరాన్ని సందర్శించేందుకు పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి వచ్చేవారి కోసం ఏపీటీడీసీ రోజూ రెండు ప్రత్యేక బస్సులు నడుపుతోంది. సింహాచలం నుంచి ఎర్రమట్టి దిబ్బల వరకు ఇవి తిరుగుతున్నాయి. ఇవి కాకుండా బీచ్‌ రోడ్డులో మాత్రమే తిరగడానికి ఏర్పాటు చేసని హాఫ్‌ ఆన్‌-హాఫ్‌ ఆఫ్‌ బస్సులు శని, ఆదివారాల్లో నిండిపోతున్నాయి.

ఇవీ ప్యాకేజీలు

- అరకుకు రోడ్డు ప్యాకేజీ

ఉదయం 6.45 గంటలకు ఎంవీపీ కాలనీలోని అప్పుఘర్‌ సమీపంలోని హరిత హోటల్‌ దగ్గర బస్సు బయలుదేరి అరకులోయ పద్మాపురం గార్డెన్స్‌, గిరిజన మ్యూజియం, అనంతగిరి కాఫీ ప్లాంటేషన్‌, గాలికొండ వ్యూ పాయింట్‌, బొర్రా గుహలు, తైడా జంగిల్‌ బెల్స్‌ చూపించి రాత్రి తొమ్మిది గంటలకు తిరిగి తీసుకువస్తారు. ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టీ, స్నాక్స్‌ ఇస్తారు. ప్రవేశ రుసుములన్నీ పర్యాటకులే చెల్లించాలి. దీనికి పెద్దలకు రూ.1,590, పిల్లలకు 1,270 టికెట్‌ తీసుకోవాలి. ఇది నాన్‌ ఏసీ బస్సు.

వైజాగ్‌ హెరిటేజ్‌ టూర్‌

సింహాచలం, కైలాసగిరి, తొట్లకొండ, రుషికొండ బీచ్‌, విశాఖ మ్యూజియం, సబ్‌మెరైన్‌ మ్యూజియం, టీయూ-142, సీ హారియర్‌ మ్యూజియం చూపిస్తారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రోజూ నడుపుతారు. దీనికి నాన్‌ ఏసీ బస్సు పెద్దలకు రూ.760, పిల్లలకు రూ.610. ఏసీ బస్సు పెద్దలకు రూ.910, పిల్లలకు రూ.730. ఈ ప్యాకేజీలో రుషికొండలో ఉచితంగా బోటు షికారు ఉంటుంది. హరిత హోటల్‌లో లంచ్‌ ఏర్పాటుచేస్తారు.

- అరకుకు రైలు కమ్‌ రోడ్‌ ప్యాకేజీ వేరేగా ఉంది. ఉదయం 5.45 గంటలకు రైల్వేస్టేషన్‌ గేట్‌ నంబరు 1 వద్ద హాజరు కావాలి. 9848813584 నంబరులో సంప్రతించాలి. ఈ ప్యాకేజీలో పెద్దలకు రూ.1,710, పిల్లలకు రూ.1,370 తీసుకుంటారు. అరకు, పద్మాపురం, అనంతగిరి చూపిస్తారు.

త్వరలో వాడపల్లికి ప్రత్యేక బస్సు

వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో వారి కోసం శుక్రవారం రాత్రి విశాఖ నుంచి బస్సు బయలుదేరి, శనివారం ఉదయాన్నే వాడపల్లి చేరుకుని, దర్శనాలు పూర్తయ్యాక, అన్నవరం సందర్శించి, తిరిగి తీసుకువచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశాం. త్వరలోనే దీనిని ప్రకటిస్తాం.

- జగదీశ్‌, డీవీఎం, ఏపీటీడీసీ

Updated Date - May 05 , 2026 | 12:54 AM