Share News

రైళ్లకు వేసవి తాకిడి

ABN , Publish Date - Apr 04 , 2026 | 01:24 AM

వేసవి సెలవుల్లో తీర్థయాత్రలు, విహారయాత్రలతోపాటు అనేకమంది సొంత ఊళ్లకు ప్రయాణం కావడంతో రైళ్లకు తాకిడి బాగా పెరిగింది.

రైళ్లకు వేసవి తాకిడి

  • హౌరా, బెంగళూరు, చెన్నై రూట్లలో డిమాండ్‌

  • మే నెలాఖరు వరకూ ఫుల్‌

  • తిరుపతి వైపు వెళ్లే రైళ్లలో బెర్త్‌ దొరకడం గగనం

విశాఖపట్నం, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి):

వేసవి సెలవుల్లో తీర్థయాత్రలు, విహారయాత్రలతోపాటు అనేకమంది సొంత ఊళ్లకు ప్రయాణం కావడంతో రైళ్లకు తాకిడి బాగా పెరిగింది. విశాఖ మీదుగా హౌరా, చెన్నై, బెంగళూరు నడిచే రైళ్లకు మే నెలాఖరు వరకు ఖరారు బెర్తులు లభించే పరిస్థితి లేదు.

మే నెలాఖరు వరకు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ ఫుల్‌

భువనేశ్వర్‌ నుంచి విశాఖ మీదుగా బెంగళూరు వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ (18463)కు మే నెలాఖరు వరకు బెర్తులు రిజర్వు అయిపోయాయి. ఇక హౌరా-యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (12863)కు కూడా మే నెలాఖరు వరకు నిరీక్షణ జాబితా నెలకొంది. ప్రతి ఆదివారం అందుబాటులో ఉండే విశాఖ-బెంగళూరు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ (08581), దువ్వాడ మీదుగా వెళ్లే భువనేశ్వర్‌-బెంగళూరు ప్రత్యేక రైలుకు (02811) బెర్తులు అందుబాటులో ఉన్నాయి. హటియా-బెంగళూరు (12835), గువాహటి-బెంగళూరు (12510), భగల్‌పూర్‌-బెంగళూరు (అంగా) (12254), కామాఖ్య-బెంగళూరు (12552), టాటా-యశ్వంత్‌పూర్‌ (18111), టాటా-బెంగళూరు (12889), హౌరా-మైసూర్‌ (22817), భువనేశ్వర్‌-బెంగళూరు (12845), హటియా-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ (18637)తో పాటు పలు వారాంతపు రైళ్లకు మే నెలాఖరు వరకు డిమాండ్‌ నెలకొంది. అయితే రెండు, మూడు వారాంతపు రైళ్లకు కొన్ని తేదీల్లో థర్డ్‌ ఏసీ బెర్తులు ఖాళీగా ఉన్నాయి.

మెయిల్‌, కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌లకు డిమాండ్‌

విశాఖ మీదుగా చెన్నై వెళ్లే కోరమండల్‌ (12841), మెయిల్‌ (12839), బొకారో (13351) వంటి రెగ్యులర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు మే నెలాఖరు వరకు డిమాండ్‌ ఉంది. మే చివరి వారంలోని కొన్ని తేదీల్లో ఫస్ట్‌, సెకండ్‌ ఏసీ కోచ్‌లలో అతి తక్కువ బెర్తులు లభించే పరిస్థితి ఉంది. ప్రతి సోమవారం విశాఖ నుంచి నడిచే విశాఖ-చెన్నై సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (22869)కు మే 25న బెర్తులు అందుబాటులో ఉన్నాయి. ధన్‌బాద్‌-అలెప్పీ బొకారో (13351), టాటా-ఎర్నాకులం (18189), హౌరా-కన్యాకుమారి (12665), భువనేశ్వర్‌-పాండిచ్చేరి (12898), షాలిమార్‌-చెన్నై ఎక్స్‌ప్రెస్‌ (22825)లు, భువనేశ్వర్‌-చెన్నై సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (12830)లో బెర్తులకు డిమాండ్‌ ఏర్పడింది.

తిరుమల ఎక్స్‌ప్రెస్‌ నెలాఖరు వరకు ఫుల్‌

తిరుమల ఎక్స్‌ప్రెస్‌ (18521)లో మే నెలాఖరు వరకు బెర్తులు ఫుల్‌ అయిపోయాయి. దాంతోపాటు ప్రతి శని, ఆదివారాల్లో విశాఖ మీదుగా తిరుపతి వెళ్లే భువనేశ్వర్‌-తిరుపతి (22871/22879) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు మే నెలాఖరు వరకు బెర్తులు నిండిపోయాయి. ఇక వివిధ ప్రాంతాల నుంచి విశాఖ మీదుగా తిరుపతి, రేణిగుంట, గూడూరు వెళ్లే పలు వారాంతపు ఎక్స్‌ప్రెస్‌లకు డిమాండ్‌ ఏర్పడింది.

హౌరాకు వెళ్లే అన్ని రైళ్లు ఫుల్‌

విశాఖ మీదుగా హౌరా వెళ్లే అన్ని రైళ్లకు రద్దీ ఏర్పడింది. రోజూ నడిచే ఈస్ట్‌కోస్ట్‌ (18046), ఫలక్‌నుమా (12704), కోరమండల్‌ (12842), మెయిల్‌ (12840), యశ్వంత్‌పూర్‌-హౌరా (12864) వంటి రైళ్లకు మే నెలలోని కొన్ని తేదీలలో మాత్రమే బెర్తులు లభించే పరిస్థితి ఉంది.

సికింద్రాబాద్‌ రైళ్లకు సాధారణం

విశాఖ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్‌ (12727), విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (17015), దురంతో (22203), గరీబ్‌రథ్‌ (12739), విశాఖ-నాందేడు (20811), ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ (18519), విశాఖ-మహబూబ్‌నగర్‌ (12861), జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ (12805), వందే భారత్‌ (20833, 20708) రైళ్లకు సాధారణ రద్దీ నెలకొంది.

Updated Date - Apr 04 , 2026 | 01:24 AM