Share News

భానుడి భగభగ

ABN , Publish Date - May 27 , 2026 | 12:40 AM

ఎండ తీవ్రత, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన నగరవాసులకు సాయంత్రం ఈదురుగాలులతో కురిసిన వర్షం కాస్తంత ఉపశమనం కలిగించింది.

భానుడి భగభగ

ఎండ, ఉక్కపోతతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి

మధ్యాహ్నం నిర్మానుష్యంగా రహదారులు

సాయంత్రం ఈదురుగాలులతో జల్లులు

పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

నేడు, రేపు పెరగనున్న ఎండలు

విశాఖపట్నం, మే 26 (ఆంధ్రజ్యోతి):

ఎండ తీవ్రత, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన నగరవాసులకు సాయంత్రం ఈదురుగాలులతో కురిసిన వర్షం కాస్తంత ఉపశమనం కలిగించింది. మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకే వాతావరణం వేడెక్కింది. మధ్యాహ్న సమయానికి వేడిగాలులు వీచాయి. కొన్ని ప్రాంతాలు నిప్పుల కుంపటిలా మారాయి. ప్రధాన రహదారులు కూడా నిర్మానుష్యంగా మారాయి. వాహనాలు లేకపోవడంతో జాతీయ రహదారి కూడా కనిపించింది. అయితే సాయంత్రం నాలుగు గంటల నుంచి మేఘాలు ఆవరించడంతో వాతావరణం కొంత చల్లబడింది. ఆరు గంటల సమయంలో ఒక్కసారిగా మేఘాలు ఆవరించాయి. ఆ తరువాత ఈదురుగాలులు వీచాయి. మెరుపులు వచ్చాయి. నగరంతోపాటు పరిసర ప్రాంతాలు, ఉత్తరాంధ్రలో సుమారు పది వేల మెరుపులు వచ్చినట్టు భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖకు చెందిన దామిని యాప్‌లో నమోదైందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. ఇదిలావుండగా ఈదురుగాలులకు అక్కడక్కడా చెట్లుకొమ్మలు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. సీతమ్మధారలో ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు వాహనంపై చెట్టు కూలింది. గాలులతోపాటు జల్లులు కురవడంతో వాతావరణం చల్లబడింది. కాగా పద్మనాభం, ములగాడల్లో 38.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. బుధ, గురువారాల్లో నగరంలో ఎండ తీవ్రత పెరిగి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదుకానున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.


ఆర్టీసీపై డీజిల్‌ భారం

పది రోజుల్లో లీటరుకు 8 రూపాయల పెంపు

రీజియన్‌లో 710 బస్సులు, రోజుకు 44,000 లీటర్ల వినియోగం

ఈ లెక్కన రూ.3.52 లక్షలు అదనపు వ్యయం

ద్వారకా బస్‌స్టేషన్‌, మే 26 (ఆంధ్రజ్యోతి):

డీజిల్‌ ధర పెంపుతో ఆర్టీసీపై మరింత భారం పడనున్నది. గత పది రోజుల్లో డీజిల్‌ లీటరుకు ఎనిమిది రూపాయలు పెరిగిన విషయం తెలిసిందే. ఈ నెల 15న రూ.3.14, తరువాత మూడు రోజుల వ్యవధిలో 98 పైసలు, మరో రెండు రోజులకు 98 పైసలు, సోమవారం మరో రూ.2.9 పెరిగింది. ఇలా డీజిల్‌ ధర పెరుగుదల వల్ల ఆర్టీసీ మరింతగా నష్టాల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రీజియన్‌లోని మద్దిలపాలెం, మధురవాడ, వాల్తేరు, విశాఖపట్నం, గాజువాక, సింహాచలం, స్టీల్‌ సిటీ డిపోల పరిధిలో రోజూ 710 బస్సులు నడుస్తున్నాయి. వాటికి రోజుకు సుమారు 44 వేల లీటర్లు అవసరం. ఆర్టీసీతో కుదిరిన ఒప్పందం మేరకు చమురు సంస్థలు ఇప్పటివరకూ లీటరు డీజిల్‌ 90 రూపాయలకు సరఫరా చేసేవి. అయితే అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో దశల వారీగా లీటరుకు ఎనిమిది రూపాయలు పెంచాయి. దీనివల్ల రీజియన్‌పై రోజుకు రూ.3.52 లక్షలు అదనపు భారం పడనున్నది. ప్రస్తుత రేటు ప్రకారం చూస్తే ఏడాదికి రూ.12.85 కోట్లు భారం పడినట్టని అధికారులు లెక్కలు వేసుకుంటున్నారు. స్త్రీశక్తి, దివ్యాంగశక్తి పథకాల అమలు కారణంగా బస్సులు సామర్థ్యానికి మించిన బరువును మోయాల్సి వస్తుందని, దీనివల్ల డీజిల్‌ వినియోగం గతంలో కంటే పెరిగిందని అధికారులు చెబుతున్నారు.


ప్రతికూల వాతావరణంతో విమానాల మళ్లింపు

గోపాలపట్నం, మే 26 (ఆంధ్రజ్యోతి):

ప్రతికూల వాతావరణం కారణంగా పలు రాష్ట్రాల నుంచి మంగళవారం రాత్రి విశాఖ రావాల్సిన విమాన సర్వీసులను మళ్లించారు. సాయంత్రం నుంచి నగరంలో ఉరుములు, మెరుపులతో భారీగా ఈదురుగాలులు వీయడంతో విమానాల ల్యాండింగ్‌, టేకాఫ్‌కు వాతావరణం అనుకూలించలేదు. దీంతో సాయంత్రం 6.30 గంటల తరువాత విశాఖ రావాల్సిన బెంగళూరు-విశాఖ, హైదరాబాద్‌-విశాఖ విమాన సర్వీసులను భువనేశ్వర్‌, రాజమండ్రి విమానాశ్రయాలకు మళ్లించారు. తిరిగి ఈ సర్వీసులు రాత్రి 12 గంటల తరువాత విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటాయని అధికారులు తెలిపారు.

Updated Date - May 27 , 2026 | 12:40 AM