వేసవిలో ఆహ్లాదం
ABN , Publish Date - May 12 , 2026 | 01:39 AM
మండలంలోని బయ్యవరంలో జాతీయ రహదారిని ఆనుకొని అటవీ శాఖ ఏర్పాటు చేసిన ‘శారదా వనం’ సందర్శకులకు అందుబాటులోకి వచ్చింది.
బయ్యవరంలో అందుబాటులోకి శారదా వనం
అడవిని తలపించేలా తీర్చిదిద్దిన అధికారులు
సందర్శకులను ఆకట్టుకుంటున్న పలు రకాల జంతువుల ఆకృతులు
కశింకోట, మే 11 (ఆంధ్రజ్యోతి):
మండలంలోని బయ్యవరంలో జాతీయ రహదారిని ఆనుకొని అటవీ శాఖ ఏర్పాటు చేసిన ‘శారదా వనం’ సందర్శకులకు అందుబాటులోకి వచ్చింది. అడవిని తలపించేలా పచ్చని చెట్లు, పక్కనే కొండలు, వనంలో ఏర్పాటు చేసిన పలు రకాల జంతువుల ఆకృతులు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. వేసవిలో కుటుంబంతో సహాల ఇక్కడకు వస్తే.. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆహ్లాదకరంగా గడిపేలా తీర్చిదిద్దారు. ఇక్కడ అటవీ శాఖకు మొత్తం 600 ఎకరాలకుపై కొండలు, అడవులు వుండగా, ఇందుకు 25 ఎకరాల్లో శారదా వననాన్ని అభివృద్ధి చేశారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.1.4 కోట్లు మంజూరు చేసింది. పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. సుమారు రూ.8 లక్షలు వెచ్చించి ప్రవేశ ద్వారాన్ని నిర్మించారు. పెన్సిళ్ల ఆకారంలో చెక్కలను చెక్కి చుట్టూ శారదావనం చుట్టూ ప్రహరీ గోడ మాదిరిగా అందంగా తీర్చి దిద్దారు. వనం లోపల నిజమైన ఏనుగును తలపించేలా భారీ ఏనుగుబొమ్మను, రెండు అడవి దున్నల బొమ్మలను ఏర్పాటు చేశారు. సందర్శకులు వీటి వద్ద నిలబడి సరదాగా ఫొటోలు దిగుతున్నారు. పార్కు మధ్యలో డెక్‌ను ఏర్పాటు చేశారు. పర్యాటకులు దీనిపైకి ఎక్కి చుట్టూ పచ్చగా వున్న ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. పార్కులో ఆర్‌వో వాటర్ ప్లాంటు, క్యాంటిన్, ఇంటర్‌ప్రిటేషన్ కేంద్రం, ఐదు పగోడాలు నిర్మించారు. అయితే వాటర్ ప్లాంటు, క్యాంటీన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. శారదా వనంలోకి ప్రవేశ రుసుము రూ.20గా నిర్ధారించారు. అయితే పర్యాటకులను మరింతగా ఆకట్టుకోవాలంటే ఇంకా సదుపాయాలు కల్పించాల్సిన అవసరం వుందని సందర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, కలెక్టర్ విజయకృష్ణన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నారు.