కాఫీ దిగుబడులకు వేసవి సస్యరక్షణ కీలకం
ABN , Publish Date - Apr 19 , 2026 | 11:45 PM
మన్యంలో గిరిజన రైతులు సాగు చేస్తున్న కాఫీ తోటల్లో అధిక దిగుబడులు సాధించేందుకు వేసవి సస్యరక్షణ చాలా కీలకమని చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు, జిల్లా ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు.
ఎండు, పొడవైన కొమ్మలు తొలగించాలి
మొక్కకు 12 నుంచి 13 కొమ్మలే ఉండాలి
ఉద్యాన పరిశోధన శాఖ అధికారులు, శాస్త్రవేత్తల సూచన
ఈ ఏడాది ఆశాజనకంగా కాఫీ పూత
చింతపల్లి, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి):
మన్యంలో గిరిజన రైతులు సాగు చేస్తున్న కాఫీ తోటల్లో అధిక దిగుబడులు సాధించేందుకు వేసవి సస్యరక్షణ చాలా కీలకమని చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు, జిల్లా ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. గిరిజన ప్రాంతంలో రైతులు సంప్రదాయేతర ప్రధాన వాణిజ్య పంటగా కాఫీ సాగు చేపడుతున్నారు. అల్లూరి జిల్లాలో 2.58 లక్షల ఎకరాల్లో కాఫీ సాగు చేస్తున్నారు. గిరిజన ప్రాంత రైతులు ఎకరానికి 500 నుంచి 600 కిలోల కాఫీ పండ్లు నుంచి 100 కిలోల క్లీన్ కాఫీ సాధిస్తున్నారు. కేరళం, తమిళనాడు, కర్ణాటక రైతులు ఎకరానికి 1400 నుంచి 1500 కిలోల కాఫీ పండ్ల నుంచి 300 కిలోల క్లీన్ కాఫీ దిగుబడులు పొందుతున్నారు. గిరిజన ప్రాంతంలో 300 కిలోల క్లీన్ కాఫీ సాధించే రైతులు పదుల సంఖ్యలో మాత్రమే ఉన్నారని కేంద్ర కాఫీ బోర్డు అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా గిరిజన రైతులు కాఫీ సాగులో వేసవి సస్యరక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్ల ఆశించిన దిగుబడి పొందలేకపోతున్నారు. ప్రస్తుతం రైతులు తోటల్లో కాఫీ పండ్ల కోత పనులు పూర్తిచేసుకున్నారు. తొలకరి వర్షాలు కూడా కురవడంతో కాఫీ మొక్కల్లో పూత కూడా ప్రారంభమైంది. వేసవిలో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలపై శాస్త్రవేత్తలు పలు సూచనలు చేస్తున్నారు.
ఫైర్‌లైన్ క్లియరెన్స్..
వేసవిలో కాఫీతోటలు అగ్ని ప్రమాదానికి గురికాకుండా రైతులు ఫైర్‌లైన్ క్లియరెన్స్ పనులను చేసుకోవాలి. కాఫీతోట నలుదిక్కులా ఎండిపోయిన ఆకులు, కొమ్మలను తొలగించుకోవాలి. కనీసం కాఫీతోటల అంచుల చుట్టూ మూడు అడుగు విస్తీర్ణం కలిగిన బాటలను ఏర్పరుచుకుని ఎండు ఆకులు, ఎండు కొమ్మలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
కొమ్మల కత్తిరింపు..
కాఫీ సాగులో కొమ్మల కత్తిరింపు చాలా కీలకం. ఏప్రిల్, మేలో కాఫీ మొక్కలపైన కొత్తగా వచ్చిన నిటారు లేతకొమ్మలను ఏటవాలుగా కత్తిరించుకోవాలి. అడ్డదిడ్డంగా ఉన్న కొమ్మలను కత్తిరించుకోవాలి. ఈ కొమ్మలపై నిటారుగా ఉన్నవాటిని కూడా కత్తిరించుకోవాలి. ప్రతి కొమ్మకు కాంతి తగిలే చూసుకోవాలి. ఎండుకొమ్మను తొలగించుకోవాలి. ఒక మొక్కలో 12 నుంచి 13 కొమ్మలు మాత్రమే ఉండేలా చూసుకోవాలి. ఈవిధంగా కొమ్మల కత్తిరింపు పనులు చేసుకోవడంతో దిగుబడినిచ్చే కొమ్మలకు పోషకాలు పూర్తిస్థాయిలో అందుతాయి. దీంతో కాఫీ దిగుబడి పెరుగుతోంది.
కలుపు నివారణ, అంతర్ కృషి
కాఫీ తోటల్లో కలుపును తొలగించుకోవాలి. మూడేళ్లలోపు మొక్కలకు చుట్టూ గొప్పు చేసుకుని గూడు కట్టుకోవడం మంచిది. మూడేళ్లలోపు మొక్కలకు రెండు కిలోల పశువు గెత్తం వేసుకోవాలి. నాలుగేళ్లు పైబడిన ఒక్కొక్క మొక్కకు ఐదు కిలోల పశువుల గెత్తం వేసుకొని మొక్కల చుట్టూ గొప్పు చేసుకోవాలి.
కాండం తొలుచు పురుగు నివారణ కోసం..
కాఫీ మొక్కలకు సరైన నీడ లేకపోతే కాండం తొలుచు పురుగు ఆశిస్తుంది. మొక్కలపై ఎండ ప్రభావం ఎక్కువగా వుంటే ఈ పురుగు వ్యాప్తి అధికంగా వుంటోంది. ఈ పురుగు మొక్క ప్రధాన కొమ్మపై వేల సంఖ్యలో గుడ్లు పెడుతోంది. ఈ గుడ్ల నుంచి వందల సంఖ్యలో కాండం తొలుచు పురుగులు బయటకొచ్చి పంటను నాశనం చేసే ప్రమాదముంది. ఈ సమస్యను అధిగమించేందుకు రైతులు మొక్కల ప్రధాన కాండం కింద నుంచి పైభాగం వరకూ కొబ్బరిపీచు, గోనెసంచితో నునుపుగా చేసుకోవాలి. కాండాన్ని నునుపుగా చేసుకోవడం వల్ల కాండం తొలుచు పురుగు మొక్కకాండంపై గుడ్లుపెట్టినా అవి మొక్క కిందకు రాలిపోతాయి. ఈపురుగు ప్రధాన కాండానికి చిన్నరంధ్రం చేసుకుని లోపలకు ప్రవేశిస్తుంది. కాండంలో ఉన్న పోషకాలను పీల్చివేస్తుంది. కాండం తొలుచు పురుగు ఆశించిన మొక్కల నుంచి కాఫీ దిగుబడి రాదు. ఈ మొక్కలను రైతులు గుర్తించి పూర్తిగా తొలగించుకుని కాల్చివేయాలి. ఈ మొక్కల స్థానంలో కొత్తగా మొక్కలను నాటుకోవాలి. కాఫీ తోటకు పూర్తి స్థాయిలో నీడను కల్పించేందుకు మొక్కలను పెంపొందించుకోవాలి.
బోర్డో మిశ్రమంతో తెగుళ్ల నివారణ
కాఫీ పంటలో తెగుళ్లను నివారించుకునేందుకు వేసవిలో బోర్డో మిశ్రమం పిచికారీ చేసుకోవాలి. ఈ మిశ్రమం పిచికారీ చేసుకోవడం వల్ల ఆకుమచ్చ తెగులు, పొలుసు పురుగు, కాండం తొలుచు పురుగులను నియత్రించుకోవచ్చు. అలాగే 1500 సీసీఎం వేపనూనె 5 మిల్లీలీటర్లు ఒక లీటరు నీటిలో కలుపుకుని మొక్కలపై పిచికారీ చేసుకోవాలి.
ఆశాజనకంగా కాఫీ పూత
కంటా బాల కర్ణ, జిల్లా ఉద్యానశాఖ అధికారి, పాడేరు
ఈ ఏడాది కాఫీ తోటల్లో పూత ఆశాజనకంగా ఉన్నది. మార్చి, ఏప్రిల్ మాసాల్లో మంచి వర్షాలు పడ్డాయి. ఈ వర్షాలు కాఫీ పంటకు చాలా ఉపయోగకరం. గిరిజన ప్రాంతంలో కాఫీ తోటల్లో విస్తారంగా పూత వచ్చింది. 15 రోజులు తరువాత వర్షాలు పడితే పూత దశ నుంచి పిందె దశకు చేరుకుంటాయి. ఈఏడాది ఎలీనో ప్రభావం ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని ప్రభావం కాఫీ పంటపై ఏ స్థాయిలో ఉంటుదో చెప్పలేం. వర్షాలు అనుకూలిస్తే ఈ ఏడాది దిగుబడులు పెరిగే అవకాశం ఉంది. రైతులు సస్యరక్షణ చర్యలు క్రమంగా చేపడితే నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు.