Share News

గ్రామాల్లో సమ్మర్‌ క్రాష్‌

ABN , Publish Date - Feb 09 , 2026 | 12:43 AM

జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్‌) ఆధ్వర్యంలో చేతి బోర్ల మరమ్మతు పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మార్చి 15వ తేదీ వరకు సమ్మర్‌ క్రాష్‌ కార్యక్రమంలో భాగంగా నీటి పథకాలు, చేతి బోర్లు తనిఖీ చేయాలి. ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్‌ టీమ్‌లను అధికారులు ఏర్పాటు చేశారు.

గ్రామాల్లో సమ్మర్‌ క్రాష్‌
వేములపూడిలో చేతి బోరును బాగు చేస్తున్న సిబ్బంది

చేతి బోర్లుకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు

పలు రకాల తాగునీటి పథకాల పనితీరు పరిశీలన

వచ్చే నెల 15లోగా పనులు పూర్తి చేయాలని ప్రభుత్వ ఆదేశాలు

మండల పరిషత్‌ల ఆర్థిక సంఘం నిధుల నుంచి వ్యయం

నర్సీపట్నం, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్‌) ఆధ్వర్యంలో చేతి బోర్ల మరమ్మతు పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మార్చి 15వ తేదీ వరకు సమ్మర్‌ క్రాష్‌ కార్యక్రమంలో భాగంగా నీటి పథకాలు, చేతి బోర్లు తనిఖీ చేయాలి. ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్‌ టీమ్‌లను అధికారులు ఏర్పాటు చేశారు.

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో చేతి బోర్లు 15,938 ఉన్నాయి. ఇంకా 10 వేల లీటర్ల లోపు నిల్వ సామర్థ్యం ఉన్న నీటి పథకాలు 767, 20 వేల లీటర్లకుపైబడి సామర్థ్యం ఉన్న నీటి పథకాలు పథకాలు 1083, డైరెక్ట్‌ పంపింగ్‌ పథకాలు 91, సంపులలోకి నీటిని నింపి గ్రామాల్లో వాటర్‌ ట్యాంకుల ద్వారా సరఫరా చేసే పథకాలు 10 ఉన్నాయి. ఆయా మొబైల్‌ టీమ్‌లు నిర్ణీత గడువు.. మార్చి 15వ తేదీలోగా బోర్లుతోపాటు ఈ పథకాలను తనిఖీ చేయాలి. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు వారం రోజుల వ్యవధిలో 1,888 చేతి బోర్లను తనిఖీ చేశారు. వీటిలో 1,823 బోర్లు పని చేస్తుండగా 48 బోర్లు పని చేయడం లేదని గుర్తించారు. ఒకటి మినహా మిగిలిన వాటికి మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకువచ్చారు. ఇక 10 వేల లీటర్ల లోపు సామర్థ్యంగల నీటి పథకాల్లో 107 ట్యాంకులను తనీఖీ చేసి, అన్నీ పని చేస్తున్నట్టు నిర్ధారించారు. . 20 వేల లీటర్లకుపైబడి సామర్థ్యంగల నీటి పథకాలల్లో 140 పథకాలు, డైరెక్ట్‌ పంపింగ్‌ పథకాలు, సంపుల్లోకి నీటిని నింపి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసే పథకాన్నీ వినియోగంలో ఉన్నట్టు గుర్తించారు. కాగా బోర్లు, నీటి పథకాల మరమ్మతుల ఖర్చులను మండల పరిషత్‌ కార్యాలయాల 15వ ఆర్థిక సంఘం నిధులను వినియోగిస్తున్నారు. పలు మండలాల అధికారులు బోర్లు మరమ్మతులకు అవసరమైన సామగ్రిని ఇప్పటికే కొనుగోలు చేయగా, మిగిలిన మండలాల అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు.

Updated Date - Feb 09 , 2026 | 12:43 AM