Share News

చెరకు సాగుకు తిలోదకాలు

ABN , Publish Date - Feb 23 , 2026 | 12:39 AM

జిల్లాలోని సహకార చక్కెర కర్మాగారాలు ఒక్కొక్కటిగా మూతపడుతుండడంతో వీటి ప్రభావం చెరకు సాగుపై పడుతున్నది. ఇప్పటికే తుమ్మపాల, ఏటికొప్పాక, తాండవ పంచదార మిల్లుల పరిధిలో చెరకు సాగు చేసే రైతుల్లో ఎక్కువ మంది ఇతర పంటలవైపు మళ్లారు. ఇప్పుడు గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీలో కూడా క్రషింగ్‌ జరగకపోవడంతో చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో పలువురు రైతులు చెరకు సాగుకు స్వస్తపలికారు. వాస్తవంగా ఐదారేళ్ల క్రితం నుంచే చెరకు సాగు విస్తీర్ణం క్రమేపీ తగ్గుతూ వస్తున్నది. ఆయా భూముల్లో రైతులు సరుగుడు, ఆయిల్‌పామ్‌ తోటలు, ఇతర వ్యవసాయ పంటలు పండిస్తున్నారు.

చెరకు సాగుకు తిలోదకాలు
చోడవరం మండలం భోగాపురంలో గత ఏడాది వేసిన సరుగుడు మొక్కలు. గతంలో ఈ పొలాల్లో చెరకు తోటలు మాత్రమే కనిపించేవి.

షుగర్‌ ఫ్యాక్టరీలు మూతపడడంతో ఇతర పంటలపైపు మళ్లుతున్న రైతులు

పుష్కర కాలం క్రితం 82 వేల ఎకరాల్లో చెరకు సాగు

గత ఏడాది 12 వేల ఎకరాలే!

వచ్చే సీజన్‌కు గోవాడ షుగర్స్‌ తెరవడంపై అనుమానాలు

ఫ్యాక్టరీ పరిధిలోని రైతుల్లో సందిగ్ధం

ప్రత్యామ్నాయంగా సరుగుడు, ఆయిల్‌ పామ్‌, కొబ్బరి సాగుకు మొగ్గు

చోడవరం, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని సహకార చక్కెర కర్మాగారాలు ఒక్కొక్కటిగా మూతపడుతుండడంతో వీటి ప్రభావం చెరకు సాగుపై పడుతున్నది. ఇప్పటికే తుమ్మపాల, ఏటికొప్పాక, తాండవ పంచదార మిల్లుల పరిధిలో చెరకు సాగు చేసే రైతుల్లో ఎక్కువ మంది ఇతర పంటలవైపు మళ్లారు. ఇప్పుడు గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీలో కూడా క్రషింగ్‌ జరగకపోవడంతో చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో పలువురు రైతులు చెరకు సాగుకు స్వస్తపలికారు. వాస్తవంగా ఐదారేళ్ల క్రితం నుంచే చెరకు సాగు విస్తీర్ణం క్రమేపీ తగ్గుతూ వస్తున్నది. ఆయా భూముల్లో రైతులు సరుగుడు, ఆయిల్‌పామ్‌ తోటలు, ఇతర వ్యవసాయ పంటలు పండిస్తున్నారు.

జిల్లాలో ఒకప్పుడు వరి తరువాత అత్యధిక విస్తీర్ణంలో చెరకు పంట సాగయ్యేది. అప్పట్లో జిల్లాలో నాలుగు సహకార చక్కెర ఫ్యాక్టరీలు వుండేవి. చెరకుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధర గిట్టుబాటు కాకపోవడం, షుగర్‌ ఫ్యాక్టరీలు చెరకు డబ్బులు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం, సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం వంటి కారణాలతో రైతులు చెరకు సాగును వదిలేసి ఇతర పంటవైపు మళ్లుతున్నారు. ఈ క్రమంలో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అనకాపల్లి మండలం తుమ్మపాల షుగర్స్‌ను మూసేసింది. మూడేళ్ల తరువాత ఎలమంచిలి మండలం ఏటికొప్పాక, పాయకరావుపేట మండలం తాండవ ఫ్యాక్టరీలకు తాళాలు వేసింది. దీంతో ఈ మూడు ఫ్యాక్టరీల పరిధిలో చెరకు సాగు గణనీయంగా తగ్గిపోయింది. ఇక మిగిలిన గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ ఆధునికీకరణకు నోచుకోకపోవడం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా చెరకు సరఫరా చేసిన రైతులకు, ఫ్యాక్టరీ కార్మికులకు సకాలంలో డబ్బులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామన్న నాటి వైసీపీ పాలకులు, నేటి కూటమి నేతల మాటలు నీటి మూటలుగా మారాయి. సుమారు 12 ఏళ్ల క్రితం జిల్లాలో 82 వేల ఎకరాల్లో చెరకు సాగు కాగా, గత ఏడాది 12 వేల ఎకరాలకు పడిపోయింది. ఇందులో సుమారు ఏడు వేల ఎకరాలు గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ పరిధిలోనే వుంది. ఒకప్పుడు ఏటా ఐదు లక్షల టన్నుల చెరకును క్రషింగ్‌ చేసిన గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ.. 2024-25 సీజన్‌లో 70 వేల టన్నులకు పడిపోయింది. దీంతో రైతులు, కార్మికులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుత సీజన్‌లో చెరకు క్రషింగ్‌ చేయలేమంటూ గోవాడ ఫ్యాక్టరీ యాజమాన్యం చెతులెత్తేసింది. వచ్చే సీజన్‌లో ఫ్యాక్టరీ నడుస్తుందా? లేదా? అన్నది సందిగ్ధంగా మారింది. దీంతో రానున్న ఖరీఫ్‌లో ఈ ఫ్యాక్టరీ పరిధిలో ఎంతమంది రైతులు చెరకు సాగు చేస్తారన్నది ప్రశ్నార్థకమే! వాస్తవంగా పదేళ్ల క్రితం గోవాడ ఫ్యాక్టరీ పరిధిలో సుమారు 30 వేల ఎకరాల్లో చెరకు సాగయ్యేది. గోవాడ ఫ్యాక్టరీ యాజమాన్యం చెరకు డబ్బులు చెల్లింపుల్లో జాప్యం చేయడం, కేంద్రం ప్రకటించే మద్దతు ధర గిట్టుబాటు కాకపోవడంతో ఐదారేళ్ల నుంచే ఫ్యాక్టరీ పరిధిలో చెరకు సాగు తగ్గుతూ వస్తున్నది. గత సీజన్‌లో ఇది ఏడు వేల ఎకరాలకు పడిపోయింది. చెరకు సాగు చేసిన పొలాల్లో రైతులు సరుగుడు, ఆయిల్‌పామ్‌, కొబ్బరి వంటి తోటలు వేస్తున్నారు. నీటి సదుపాయం వున్న భూముల్లో వరి, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. ఒకప్పుడు చెరకు సాగు చేసిన పొలాల్లో ఇప్పుడు సరుగుడు తోటలు కనిపిస్తున్నాయి. బెల్లం తయారుచేసే రైతులు మినహా మిగిలిన వారెవరూ చెరకు సాగు చేసే పరిస్థితి లేదు.

Updated Date - Feb 23 , 2026 | 12:39 AM