Share News

పట్టుదలతోనే విజయం సాధ్యం

ABN , Publish Date - Aug 18 , 2026 | 12:30 AM

పట్టుదలతోనే పోటీ పరీక్షల్లో విజయం సాధ్యమవుతుందని కలెక్టర్‌ టి.నిషాంతి అన్నారు. డీఎస్‌సీకి ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థులకు స్థానిక ఎస్‌ఆర్‌.శంకరన్‌ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ఒక్క రోజు అవగాహన సదస్సులో కలెక్టర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

పట్టుదలతోనే విజయం సాధ్యం
డీఎస్‌సీ స్టడీ మెటీరియల్‌ను ప్రదర్శిస్తున్న కలెక్టర్‌ నిషాంతి, ఇతర అధికారులు

డీఎస్‌సీ అభ్యర్థులకు అవగాహన సదస్సులో కలెక్టర్‌ టి.నిషాంతి

పాడేరు, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): పట్టుదలతోనే పోటీ పరీక్షల్లో విజయం సాధ్యమవుతుందని కలెక్టర్‌ టి.నిషాంతి అన్నారు. డీఎస్‌సీకి ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థులకు స్థానిక ఎస్‌ఆర్‌.శంకరన్‌ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ఒక్క రోజు అవగాహన సదస్సులో కలెక్టర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు పట్టుదల, కృషి, అంకితభావం అనే మూడు సూత్రాలను పక్కాగా పాటించాలన్నారు. తమ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకుని, ఆ దిశగా ప్రణాళికాబద్ధంగా శ్రమిస్తే తప్పక విజయం సొంతమవుతుందన్నారు. ప్రధానంగా డీఎస్‌సీ అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న సిలబస్‌ను సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలని, రోజువారీ టైమ్‌ టేబుల్‌ ఏర్పాటు చేసుకుని సాధన చేయాలన్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుని నిరంతర సాధన, మాక్‌ టెస్ట్‌లు, గత ప్రశ్నాప్రత్రాల పరిశీలన వంటి వాటికి ప్రాధాన్యమివ్వాలన్నారు. గత డీఎస్‌సీలో చక్కని ప్రతిభతో టీచర్లుగా ఉద్యోగాలు సాధించిన వారితో మాట్లాడి, అనేక అంశాలను గుర్తించాలని సూచించారు. ఈ సందర్భంగా గతంలో చక్కని ర్యాంకులు పొందిన వారినే రీసోర్సుపర్సన్లుగా ఏర్పాటు చేసి, అనేక అంశాలను డీఎస్‌సీ అభ్యర్థులకు వివరించారు. శిక్షణకు హాజరైన అభ్యర్థులకు నోట్‌ప్యాడ్‌లు, స్టడీ మెటీరియల్‌ను కలెక్టర్‌ అందించారు. తమ కోసం ప్రత్యేకంగా అవగాహన సదస్సు నిర్వహించినందుకు డీఎస్‌సీ అభ్యర్థులు కలెక్టర్‌, విద్యాశాఖాధికారులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్‌ లోకేశ్వరరావు, జిల్లా విద్యాశాఖాధికారి ఎన్‌.భానుమూర్తిరాజు, సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్‌ వీఏ స్వామినాయుడు, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ పీబీకే పరిమిళ, గురుకులం ఓఎస్‌డీ పీఎస్‌ఎన్‌.మూర్తి, రీసోర్సు పర్సన్లు, 350 మంది డీఎస్‌సీ అభ్యర్థులు పాల్గొన్నారు.

Updated Date - Aug 18 , 2026 | 12:30 AM