సమన్వయంతో సాగితేనే విజయం
ABN , Publish Date - Sep 28 , 2026 | 12:17 AM
కూటమి శ్రేణులమధ్య సమన్వయమే జీవీఎంసీ ఎన్నికల్లో విజయానికి కీలకమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
జీవీఎంసీ ఎన్నికల సన్నద్ధతపై కూటమి నేతల సమావేశం
విశాఖపట్నం, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి):
కూటమి శ్రేణులమధ్య సమన్వయమే జీవీఎంసీ ఎన్నికల్లో విజయానికి కీలకమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన అధ్యక్షతన నిర్వహించిన టీడీపీ, జనసేన, బీజేపీ నేతల సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ముమ్మరం చేస్తున్న క్రమంలో ఎన్నికలకు కూటమిపార్టీల సన్నద్ధత, సమన్వయం, నియోజకవర్గాల వారీగా చేపట్టాల్సిన కార్యాచరణపై నేతలు చర్చించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సమర్థంగా ఎదుర్కొనేలా ఆయా పార్టీల శ్రేణులను సమాయత్తం చేయాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు మూడుపార్టీల నేతలు సమన్వయంతో ముందుకుసాగాలని పల్లా సూచించారు. క్షేత్రస్థాయిలో అభివృద్ధి, స్థానిక సమస్యలు, ప్రజల అవసరాలపై సమగ్ర అవగాహన కలిగివున్న వారినే అభ్యర్థులుగా గుర్తించాలని కోరారు. క్షేత్రస్థాయిలో పార్టీల మధ్య నెలకొన్న సమస్యలు, నేతల మధ్య అభిప్రాయభేదాలు, రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణను సవరించుకోవాలని సూచించారు.
ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకత్వం, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల మధ్య నిరంతరం సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు. విపక్షం చేసే ఆరోపణలను ఐక్యంగా తిప్పికొట్టేలా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో టీడీపీ ఎన్నికల ఇన్‌చార్జి ఎంఏ షరీఫ్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, టీడీపీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు పట్టాభి, జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు, తదితరులు పాల్గొన్నారు.
జీవీఎంసీలో విజయమే ధ్యేయం
మేయర్‌తోపాటు అన్నివార్డుల గెలుపే లక్ష్యం
పోటీపై కూటమి శ్రేణుల మధ్య సమన్వయం
ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి
విశాఖపట్నం, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్ స్థానంతోపాటు 120 వార్డు కార్పొరేటర్ పదవులను దక్కించుకోవడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తున్నామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి అన్నారు. టీడీపీ కార్యాలయంలో కూటమి నేతలతో కలిసి ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ మేయర్ ఎన్నిక ప్రత్యక్ష విధానంలో ఉంటుందని, సమర్థుడిని కూటమి అభ్యర్థిగా నిలబెడతామన్నారు. రిజర్వేషన్లు ఖరారైన తర్వాత అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలి, అభ్యర్థుల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూటమిపార్టీల మధ్య సమన్వయం కోసం అధిష్ఠానం ఏడుగురు సభ్యులతో కమిటీని నియమించిందన్నారు. గత ప్రభుత్వంలా రిజర్వేషన్లను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయమని, నిబంధనల ప్రకారమే రిజర్వేషన్‌లు ఖరారవుతాయన్నారు. జీవీఎంసీ ఎన్నికల పరిశీలకుడు షరీఫ్ మాట్లాడుతూ కూటమి సమన్వయ కమిటీ రెండో సమావేశం ఆదివారం సుహృద్భావ వాతావరణంలో జరిగిందన్నారు. రాష్ట్రంలో వైపీపీ ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోవడంతో కకావికలమైందన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావం పెద్దగా ఉండదన్నారు. జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణశ్రీనివాస్ మాట్లాడుతూ జీవీఎంసీ ఎన్నికల్లో వందశాతం స్ర్టైక్‌రేట్ లక్ష్యంగా సమన్వయంతో ముందుకువెళతామన్నారు. జగన్‌కు ప్రజలు సీఎంగా అవకాశం ఇస్తే ఐదేళ్లలో ఒక్కమంచిపని కూడా చేయలేకపోయారని విమర్శించారు. నగరంలో నీటిసమస్యపై ప్రజలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉసిగొల్పాలని వైసీపీ నేతలకు జగన్ ఉపదేశించారని, వరుణుడు వారి కుట్రలను తిప్పికొట్టి పుష్కలంగా వర్షాలు కురిపించాడన్నారు. బీజేపీ నేత సురేంద్ర మాట్లాడుతూ మేయర్ పదవిని సాధించి విశాఖ ప్రజలు కూటమి పక్షాన ఉన్నారని నిరూపించుకుంటారన్నారు.