సర్‌లో సక్సెస్
ABN , Publish Date - Jul 14 , 2026 | 12:32 AM
భారత ఎన్నికల సంఘం ఆదేశాలతో ఓటరు జాబితాల స్పెషల్ ఇన్‌టెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియలో జిల్లా దూకుడు పెంచింది. దీంతో గడువుకు ఒకరోజు ముందే శతశాతం ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేసి, రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది.
అట్టడుగు నుంచి ప్రథమ స్థానానికి చేరిక
గడువుకు ఒకరోజు ముందే పూర్తయిన లక్ష్యం
మొత్తం 4,99,752 మంది ఓటర్ల సమగ్ర సవరణ పూర్తి
రేయింబవళ్లు శ్రమించిన జిల్లా యంత్రాంగం
పాడేరు, జూలై 13 (ఆంధ్రజ్యోతి): భారత ఎన్నికల సంఘం ఆదేశాలతో ఓటరు జాబితాల స్పెషల్ ఇన్‌టెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియలో జిల్లా దూకుడు పెంచింది. దీంతో గడువుకు ఒకరోజు ముందే శతశాతం ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేసి, రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రథమ, ఏలూరు ద్వితీయ, పార్వతీపురం మన్యం జిల్లా తృతీయ స్థానాల్లో ఉన్నాయి. ఫారాల పంపిణీ, స్వీకరణలో శతశాతం పూర్తి చేసి అల్లూరి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. వాస్తవానికి జిల్లాలోని ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల 5వ తేదీ వరకు సర్ ప్రక్రియ(43 శాతం) మందకొడిగా జరిగింది. ఈ తరుణంలో (ఈ నెల 14) గడువు నాటికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని ఈసీ ఆదేశాలతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.నిషాంతి ప్రత్యేక శ్రద్ధ కనబరిచి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జిల్లాలోని 11 మండలాల్లోని 624 బూత్‌ల్లో సైతం సర్ ప్రక్రియ పక్కాగా జరగాలని ఆదేశించారు. ఈ క్రమంలో నిర్లక్ష్యంగా ఉన్న ఇద్దరు బూత్ స్థాయి అధికారులను సస్పెండ్ చేయడం, మరో జిల్లా అధికారికి షోకాజ్ నోటీసు జారీ చేయడంతో పాటు ఏ స్థాయి అధికారి అలక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని ఘాటుగా హెచ్చరించారు. ప్రతి సచివాలయంలోనూ అవసరమైన సదుపాయాలు కల్పించి సిబ్బంది ఆశించిన స్థాయిలో పనులు చేపట్టేలా ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ టి.నిషాంతి, జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్ లోకేశ్వరరావు జిల్లాలోని పాడేరు, అరకులోయ నియోజకవర్గాల్లోని పదకొండు మండలాల్లోని తహశీల్దార్లు, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, బీఎల్‌వోలు, బీఎల్‌ఏలను అప్రమత్తం చేసి రేయింబవళ్లు సర్ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన చేపట్టారు. ఫలితంగా గడువుకు ఒకరోజు ముందే జిల్లాలో సర్ ప్రక్రియ శత శాతం పూర్తయి, రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. జిల్లాలో ముంచంగిపుట్టు మండలంలో 39,041 మంది ఓటర్లు, పెదబయలులో 43,408, హుకుంపేటలో 45,871, డుంబ్రిగుడలో 38,879, అరకులోయలో 43,002, అనంతగిరిలో 38,464, జీకేవీధిలో 52,515, కొయ్యూరులో 43,755, చింతపల్లిలో 65,462, జి.మాడుగులలో 44,808, పాడేరు మండలంలో 44,547 మంది ఓటర్లు కలిపి మొత్తం 4 లక్షల 99 వేల 752 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలను ఆదివారం అర్థరాత్రి నాటికే శతశాతం డిజిటలైజేషన్ చేశారు.
సమష్టి కృషితోనే జిల్లాకు అగ్రస్థానం
గ్రామస్థాయి ఉద్యోగి నుంచి జిల్లాస్థాయి అధికారి వరకు అందరి సమష్టి కృషి ఫలితంగానే ఓటరు జాబితాల స్పెషన్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియలో రాష్ట్రస్థాయిలో జిల్లాను అగ్రగామిగా నిలిపామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.నిషాంతి అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, గ్రామాలు మారుమూల ప్రాంతాల్లో ఉండడం వంటి కారణాలతో సర్ ప్రక్రియలో అట్టడుగున ఉన్న జిల్లా అందరి సహకారం, అంకితభావం, నిరంతర శ్రమ కారణంగా నేడు రాష్ట్రంలో ప్రథమ స్థానానికి చేరుకుందన్నారు. ఈ విజయానికి కారణమైన జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్ లోకేశ్వరరావు, ఆర్‌డీవో ఎం.భుజంగరావు, మండల ప్రత్యేకాధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, యువతకు ఆమె ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో జిల్లా అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన అంశాలపైనా అందరం ప్రత్యేక శ్రద్ధ కొనసాగిద్దామని ఆమె పిలుపునిచ్చారు.
సెప్టెంబరు 22న తుది ఓటరు జాబితా ప్రదర్శన
ప్రస్తుతం జిల్లాలో 4 లక్షల 99 వేల 752 మంది ఓటర్లకు సంబంధించిన సమగ్ర సవరణ ప్రక్రియ పూర్తయిందని, తదుపరి ప్రక్రియను సైతం పారదర్శకంగా చేపట్టి ఈ ఏడాది సెప్టెంబరు 22న బూత్ స్థాయిల్లో తుది ఓటరు జాబితాలను ప్రదర్శిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు. అలాగే ప్రస్తుతం జరిగిన సర్ ప్రక్రియల్లో ఎవరికైనా అభ్యంతరాలున్నా ఈ నెల 21 నుంచి వచ్చే నెల 20 లోపు తెలియజేయవచ్చునన్నారు. ఆగస్టు 21 నుంచి సెప్టెంబరు 18 వరకు ఓటర్లు సమర్పించిన అభ్యంతరాలపై విచారణ చేపట్టి, సమస్యలు పరిష్కరించి సెప్టెంబరు 22న తుది ఓటరు జాబితాలను ప్రదర్శిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.