ఏసీబీ వలలో సబ్ ట్రెజరీ ఉద్యోగి
ABN , Publish Date - Aug 29 , 2026 | 12:38 AM
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్ ట్రెజరీ కార్యాలయం సీనియర్ అకౌంటెంట్ శుక్రవారం రిటైర్డ్ తహశీల్దార్ నుంచి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
బిల్లుల మంజూరుకు రిటైర్డ్ తహశీల్దార్ ను లంచం డిమాండ్ చేసిన సీనియర్ అకౌంటెంట్
నర్సీపట్నం, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి):
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్ ట్రెజరీ కార్యాలయం సీనియర్ అకౌంటెంట్ శుక్రవారం రిటైర్డ్ తహశీల్దార్ నుంచి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఇందుకు సంబంధించి ఏసీబీ విశాఖపట్నం అదనపు ఎస్పీ ఎస్.ఆర్.హర్షిత, డీఎస్పీ బీవీఎస్‌ఎస్ మూర్తి అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశ్రాంత మండల రెవెన్యూ అధికారి ఉద్యోగ విరమణ అనంతరం తనకు రావలసిన ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన బిల్లులు నర్సీపట్నం సబ్ ట్రెజరీ కార్యాలయంలో అందజేశారు. సబ్ ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న నరవ విజయభాస్కర్ బిల్లులు మంజూరుచేయడానికి రూ.40 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వకపోతే బిల్లులు చేయనన్నారు. దీంతో విశ్రాంత మండల రెవెన్యూ అధికారి ఈ నెల 26న విశాఖపట్నం ఏసీబీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం విశ్రాంత రెవెన్యూ అధికారి నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా సబ్ ట్రెజరీ సీనియర్ అకౌంటెంట్ విజయభాస్కర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని తెలిపారు. నర్సీపట్నం కొత్తవీధిలోని ఆయన నివాసంలో సోదాలు చేస్తున్నామని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి దస్త్రాలు ఆయన దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. విశ్రాంత తహశీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. నిందితుడు విజయభాస్కర్‌ను శనివారం విశాఖపట్నం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే పర్యావసానం ఇలాగే ఉంటుందన్నారు. ఎవరైనా లంచం అడిగితే 1064కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఏసీబీ దాడుల్లో ఏసీబీ డీఎస్పీ ఎ.పృథ్వీతేజ్, ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్, లక్ష్మణరావు, సుప్రియ, వెంకట్రావు, సిబ్బంది పాల్గొన్నారు.
నేడు, రేపు ‘సర్’పై ప్రత్యేక క్యాంపులు
విశాఖపట్నం, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి):
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై శని, ఆదివారాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. సందేహాలు నివృత్తి చేయడంతో పాటు ఓటర్ల జాబితాలో నమోదుకు దరఖాస్తులను స్వీకరిస్తారు. కాగా జిల్లాలో 2,29,924 మంది ఓటర్లు అందజేసిన ఎన్యూమరేషన్ ఫారాల్లో వివరాలు సరిగా లేవని అధికారులు గుర్తించారు. వారందరికీ బీఎల్‌వోలు నోటీసులు జారీచేశారు. నోటీసులు అందుకున్న వారిలో 62,465 మంది వివరాలను సరిచేసి తిరిగి సమర్పించారు. మిగిలిన వారు కూడా వచ్చే నెల 28వ తేదీలోగా సమర్పించాల్సి ఉంది.
సింహాచల దేవస్థానం ఉద్యోగి సస్పెన్షన్
శీఘ్రదర్శనం టికెట్ల అమ్మకంలో చేతివాటం
మద్యం సేవించి వచ్చిన మరో ఉద్యోగిపైనా వేటు
సింహాచలం, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి):
వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నయనార్ అనే ఉద్యోగి విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడడంతో సస్పండ్ చేసినట్టు కార్యనిర్వాహణాధికారి జల్లేపల్లి వెంకటరావు తెలిపారు. ఆయన అందజేసిన సమాచారం ప్రకారం...అతి శీఘ్రదర్శనం (రూ.300) టికెట్ల విక్రయ కేంద్రంలో నయనార్ విధులు నిర్వహిస్తున్నారు. కొందరు భక్తులకు టికెట్లు జారీ చేయకుండా సొమ్మును స్వాహా చేశారని ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. ఆలయ ధ్వజ స్తంభం వద్ద రూ.300 టికెట్లను సిబ్బంది తనిఖీ చేస్తారు. శుక్రవారం కొందరు భక్తులు తాము కౌంటర్‌లో డబ్బులిచ్చి వచ్చామని, టికెట్లు ఏమీ ఇవ్వలేదంటూ సమాధానం చెప్పడంతో అక్కడ విధి నిర్వహణలో ఉన్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి ఆలయ ఏఈఓకు ఫిర్యాదు చేశారు. ఏఈఓ ఈ విషయాన్ని ఈఓకు సమాచారం ఇచ్చి కౌంటర్‌కు వెళ్లి విచారణ జరిపారు. అక్కడి సీసీ కెమెరాల పరిశీలించడంతో పాటు సొమ్మును లెక్కించడంతో అవకతవకలకు పాల్పడినట్టు తేలింది. ఈ నేపథ్యంలో విధుల నుంచి నయనార్‌ను సస్పెండ్ చేసి విచారణను కొనసాగిస్తున్నట్టు ఈఓ తెలిపారు. అదేవిధంగా ఆలయంలో కప్పస్తంభం వద్ద క్లర్క్‌గా పనిచేస్తున్న అరుణ్ ఎటువంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరు కావడంతో అతనికి షోకాజ్ నోటీస్ ఇచ్చినట్టు తెలిసింది. అదేవిధంగా ఆలయంలో నాలుగో తరగతి ఉద్యోగిగా పనిచేస్తున్న బలిరెడ్డి సన్నాసిరావు మద్యం సేవించి ఉండడంతో విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఈఓ ఆదేశాలిచ్చారు.
పాఠశాలల నిర్వహణకు నిధులు విడుదల
జిల్లాకు రూ.86.7 లక్షలు
విశాఖపట్నం, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి):
ప్రస్తుత విద్యా సంవత్సరానికిగాను జిల్లాలో గల 582 ప్రభుత్వ పాఠశాలకు పారిశుధ్యం, తాగునీటి నిర్వహణ, ఇతర ఖర్చుల నిమిత్తం సమగ్ర శిక్ష అభియాన్ ఉన్నతాధికారులు రూ.86.7 లక్షలు మంజూరుచేశారు. ఏడాదికి రూ.173.4 లక్షలు కేటాయించినా అందులో సగం మాత్రమే విడుదల చేశారు. 30 మంది కంటే తక్కువ విద్యార్థులున్న పాఠశాలలకు ఏడాదికి రూ.10 వేలు, 30 నుంచి 100 మంది ఉంటే రూ.25 వేలు, 101 నుంచి 250 వరకు రూ.50 వేలు, 250 నుంచి 1000 మంది ఉంటే రూ.75 వేలు, వెయ్యి మంది దాటితే రూ.లక్ష ఇవ్వాలి. అయితే ఇందులో ప్రస్తుతం సగం గ్రాంటు విడుదల చేశారు. వైసీపీ హయాంలో ఒక ఏడాది తప్ప మిగిలిన నాలుగు సంవత్సరాలూ పాఠశాలలకు ఒక్కపైసా విడుదల చేయకపోవడంతో హెచ్‌ఎంలపై భారంపడింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 2024 నుంచి స్కూలు గ్రాంటు విడుదల చేస్తున్నారు. అయితే సగమే ఇస్తున్నారు. మిగిలిన మొత్తం కూడా విడుదల చేయాలని ప్రధానోపాధ్యాయులు కోరుతున్నారు.