Share News

రైతుబజార్లలో నాసిరకం ఉల్లి

ABN , Publish Date - Jun 03 , 2026 | 12:50 AM

రైతుబజార్లలో ఉల్లిపాయలు నాణ్యమైనవి లభించడం లేదు. గత పది రోజులుగా కుళ్లిన, నాసిరకం ఉల్లినే విక్రయిస్తున్నారు.

రైతుబజార్లలో నాసిరకం ఉల్లి

కుళ్లిన సరుకు విక్రయం

పది రోజులుగా ఇదే పరిస్థితి

పట్టించుకోకుండా రైతుల స్టాళ్ల డ్రాపైనే అధికారుల దృష్టి

విశాఖపట్నం, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి):

రైతుబజార్లలో ఉల్లిపాయలు నాణ్యమైనవి లభించడం లేదు. గత పది రోజులుగా కుళ్లిన, నాసిరకం ఉల్లినే విక్రయిస్తున్నారు. బయట మార్కెట్లలో మాత్రం నాణ్యమైన ఉల్లిపాయలు దొరుకుతున్నాయి. రైతుబజార్లలో ఇటీవల ఉల్లి రేటు కూడా పెంచారు. కిలో 18 రూపాయల నుంచి 23 రూపాయల వరకు తీసుకువచ్చారు. ఇంకా పెరుగుతుందని అంటున్నారు. కిలోకు రెండు రూపాయిలు ఎక్కువ తీసుకున్నా నాణ్యమైన సరకు అందుబాటులో ఉంచాలని వినియోగదారులు కోరుతున్నారు. బయట మార్కెట్‌లో అమ్ముతున్న నాణ్యమైన రకం రైతుబజార్లకు ఎందుకు తేవడం లేదని ప్రశ్నిస్తున్నారు. రైతుబజార్లను పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖాధికారి పట్టనట్టుగా ఉంటున్నారు. వారంలో మూడు రోజులు రైతుల స్టాళ్లను డ్రా తీయడానికి వివిధ బజార్లకు వెళుతున్న ఆయన రైతులు, డ్వాక్రా సంఘాలతో మాట్లాడుతున్నారే తప్ప వినియోగదారుల అవసరాలు ఏమిటి?, సరకుల నాణ్యత ఎలా ఉందనే అంశాలు పట్టించుకోవడం లేదు.

డ్వాక్రా సంఘాల మాట కూడా వినడడం లేదు

రైతుబజార్లలో ఉల్లి, టమాటా, బంగాళాదుంపలను డ్వాక్రా సంఘాలు విక్రయిస్తాయి. హోల్‌సేల్‌ మార్కెట్‌ రేట్లకు అనుగుణంగా కిలో రూపాయి లాభం వచ్చేలా ధరలు నిర్ణయిస్తారు. అయితే వేసవి ఎండలు, అనుకోకుండా వర్షాలు కురవడం వంటి కారణాలతో ఉల్లి కొంత పాడైపోతోందని వారు చెబుతున్నారు. యాభై కిలోల బస్తాలో నాలుగైదు కిలోలు ఇలా పోతున్నాయని, వాటిని కూడా కలుపుకొని సగటు రేటు నిర్ణయిస్తేనే గిట్టుబాటు అవుతుందని వారు అంటున్నారు. ఈ విషయాలేవీ పట్టించుకోకుండా అధికారులు వ్యవహరిస్తున్నారు. దాంతో ఏ సరకు అమ్మితే సాయంత్రానికి నాలుగు రూపాయలు వస్తాయో చూసుకొని అవే తెచ్చి అమ్ముతున్నారు. అత్యదిక శాతం రైతుబజార్లలో నాసిరకం ఉల్లినే విక్రయిస్తున్నారు. ఇది తెలిసి కూడా పట్టించుకోకపోవడంతో వినియోగదారులు నిరసన వ్యక్తంచేస్తున్నారు. గతంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్లు ఆకస్మికంగా, ఎవరికీ సమాచారం ఇవ్వకుండా రైతుబజార్లను తనిఖీలు చేసేవారు. వినియోగదారులు, రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకునేవారు. చాలాకాలంగా విశాఖ జిల్లాలో అది అమలు కావడం లేదు. వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖాధికారులు చెప్పిందే నిజమని నమ్ముతున్నారు. గతంలో జేసీలు రైతుబజార్ల సిబ్బందితో కూడా కలెక్టరేట్‌లో సమావేశాలు నిర్వహించేవారు. వాటికి కూడా తిలోదకాలు ఇచ్చేశారు. జిల్లాలో కేవలం ఒకే ఒక అధికారి ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌పై ఆధారపడి రైతుబాజర్ల పనితీరు అంచనా వేస్తున్నారు. దీనివల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అవినీతి కూడా జరుగుతోంది. దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Updated Date - Jun 03 , 2026 | 12:50 AM