రాయితీ ఉల్లి?
ABN , Publish Date - Sep 29 , 2026 | 12:59 AM
ఉల్లిపాయల ధర రోజురోజుకూ ఘాటెక్కుతోంది. గత రెండు నెలల నుంచి పెరుగుతూ వస్తోంది.
రెండు వారాల క్రితం మంత్రి నాదెండ్ల ప్రకటన
ఇప్పటికీ స్పందించని అధికారులు
రైతుబజార్లలో కిలో రూ.52
బహిరంగ మార్కెట్‌లో రూ.70
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఉల్లిపాయల ధర రోజురోజుకూ ఘాటెక్కుతోంది. గత రెండు నెలల నుంచి పెరుగుతూ వస్తోంది. కిలో రూ.24 నుంచి రూ.54కి చేరింది. రైతుబజార్లలో నాసిరకం సరుకు తెచ్చి వినియోగదారులకు అంటగడుతున్నారు. రైతుబజార్లలో రాయితీ ధరకు కిలో రూ.32 చొప్పున ఉల్లిపాయలు విక్రయిస్తామని పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ నెల నాలుగో తేదీన ప్రకటించారు. సాధారణంగా ఇలా ధరలు పెరిగినప్పుడు పంట పండే ప్రాంతాలకు అధికారులు వెళ్లి ఎంత ధరకైనా కొని రాయితీపై విక్రయిస్తారు. కానీ ఈసారి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ, రైతుబజార్ల అధికారులు దీనిపై స్పందించలేదు. మిల్లర్ల సహకారంతో కేవలం బియ్యం మాత్రమే రాయితీ ధరపై కిలో రూ.52 చొప్పున అమ్ముతున్నారు. ఉల్లిపాయలను అందుబాటులోకి తీసుకువచ్చే ఆలోచనే తమకు లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో రైతుబజార్లను పర్యవేక్షించే అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లి రూ.70కు అమ్ముతున్నారు. రైతుబజార్లలో సోమవారం ధర రూ.52గా నిర్ణయించారు. కొన్ని రైతుబజార్లలో తప్పితే ఎక్కువ శాతం రైతుబజార్లలో నాణ్యమైన ఉల్లి విక్రయించడం లేదు. నాసిరకం తీసుకువచ్చి దానినే కిలో రూ.52 చొప్పున ఇస్తున్నారు. అవి కూడా ఇప్పుడు తగినన్ని లభించడం లేదు.
ధరల స్థిరీరణ నిధుల నుంచి ఉల్లిని టోకున కొనుగోలు చేసి నేషనల్ కో-ఆపరేటివ్ కన్సూమర్ ఫెడరేషన్ సాయంతో రాయితీ ధరకు అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. పేదలకు పట్టాభిషేకం పేరుతో నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ నెల 19న మంత్రి నాదెండ్ల మనోహర్ నగరానికి వచ్చారు. అప్పుడు కూడా రాయితీ ఉల్లి విషయం ప్రస్తావించారు. గతంలో ఉల్లి ధరలు పెరిగితే మహారాష్ట్ర, కర్నూలు ప్రాంతాల టోకు వ్యాపారులతో చర్చించి, అక్కడికి ఓ అధికారిని పంపించి లారీలతో తెప్పించేవారు. ఇప్పుడు అలా చేయడం లేదు. ధరలు తగ్గేంత వరకూ వేచి చూద్దాం...అనే ధోరణిలో మార్కెటింగ్ శాఖాధికారులు ఉన్నట్టు తెలిసింది. మంత్రి కూడా ప్రకటన చేసి పని అయిపోయిందనుకున్నారు. దానిపై మళ్లీ సమీక్షించలేదు. దీనిపై ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
వర్షం
ఈదురుగాలులతో విరిగిన చెట్ల కొమ్మలు
విశాఖపట్నం, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి):
నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. సాయంత్రం ఆరు గంటల తరువాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఏడు గంటలు సమయంలో అనేక ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీవర్షం కురిసింది. ఆ సమయంలో పెనుగాలులు వీయడంతో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. జ్ఞానాపురం, వన్‌టౌన్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.