సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిట
ABN , Publish Date - Jan 30 , 2026 | 01:16 AM
జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలన్నీ గురువారం కిటకిటలాడాయి.
ఒకటో తేదీ నుంచి భూ విలువల పెరగనుండడమే కారణం
మరోవైపు ఏకాదశి
ఒక్కరోజే 694 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్... రూ.18.17 కోట్ల ఆదాయం
విశాఖపట్నం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలన్నీ గురువారం కిటకిటలాడాయి. జిల్లాలో తొమ్మిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా, ఒక్కరోజే 694 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. వాటి ద్వారా ప్రభుత్వానికి రూ.18.17 కోట్ల ఆదాయం సమకూరింది.
రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి భూముల విలువలు పెంచుతామని ప్రకటించింది. ఎక్కడెక్కడ ఎంతెంత పెరుగుతాయనేది సబ్ రిజిస్ట్రార్లు వారి కార్యాలయాల్లో నోటీస్ బోర్డులో ప్రదర్శించారు. దాంతో ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న కక్షిదారులు ఈ నెల 31లోగా వాటిని రిజిస్టర్ చేసుకోవాలని తొందరపడుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం భీష్మ ఏకాదశి వచ్చింది. అది మంచి ముహూర్తం కావడంతో అంతా వెంటనే రిజిస్ట్రేషన్ కోసం స్లాట్లు తీసుకున్నారు. అయితే ప్రభుత్వం కార్యాలయాల వారీగా కేటాయించిన స్లాట్లు అన్నీ అయిపోవడం, ఇంకా కావాలని ప్రజల నుంచి ఒత్తిడి రావడంతో సబ్ రిజిస్ట్రార్లు ఈ విషయం జిల్లా రిజిస్ట్రార్ ఉపేంద్ర దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వం వీలైనంత ఎక్కువ రాబడి వచ్చేలా చూడాలని చెబుతుండడంతో వెంటనే ఆయా కార్యాలయాలకు అదనపు స్లాట్లు మంజూరుచేశారు. దాంతో ఎక్కువ మందికి ఒకే రోజు రిజిస్ట్రేషన్లు చేయడానికి అవకాశం ఏర్పడింది. విశాఖపట్నంలోని సూపర్‌బజారు కార్యాలయం, మధురవాడ, ఆనందపురం, భీమిలి, పెందుర్తి కార్యాలయాలకు రోజుకు 78 మందికే స్లాట్లు ఇచ్చే అవకాశం ఉంది. వారి అభ్యర్థన మేరకు ఒక్కో కార్యాలయానికి అదనంగా 38 చొప్పున స్లాట్లు కేటాయించారు. అంటే ఆయా కార్యాలయాల్లో వందకు మించి రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు కలిగింది. మిగిలిన కార్యాలయాల్లో రోజుకు 38 స్లాట్లు ఉండగా, వారికి కూడా అదనంగా మరో 38 చొప్పున స్లాట్లు ఇచ్చినట్టు జిల్లా రిజిస్ట్రార్ ఉపేంద్ర ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
ఇబ్బందులు ఉంటే 1100కి కాల్ చేయండి
- బాలకృష్ణ, డీఐజీ, విశాఖపట్నం
జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా ప్రభుత్వం ఏర్పాటుచేసిన టోల్ ఫ్రీ నంబరు 1100కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. రిజిస్ట్రేషన్ ఆలస్యమైనా, అధికంగా ఫీజులు వసూలు చేసినా, సిబ్బంది ఇబ్బంది పెట్టినా, ఆన్‌లైన్ సేవల్లో లోపాలు ఉన్నా ఫోన్ చేసి చెప్పవచ్చు. తక్షణమే వాటిపై చర్యలు తీసుకుంటాం. సేవల్లో పారదర్శకత పెంచడానికే ఈ విధానం కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చాం.
కార్యాలయాల వారీగా గురువారం జరిగిన రిజిస్టేషన్ల సంఖ్య, ఆదాయం వివరాలు
---------------------------------------------------------------------
కార్యాలయం డాక్యుమెంట్ల సంఖ్య ఆదాయం
---------------------------------------------------------------------
సూపర్‌బజార్ 104 రూ.5 కోట్లు
మధురవాడ 103 రూ.6.11 కోట్లు
ఆనందపురం 98 రూ.1.43 కోట్లు
ద్వారకానగర్ 66 రూ.1.05 కోట్లు
గాజువాక 74 రూ.1.29 కోట్లు
పెదగంట్యాడ 68 రూ.0.94 కోట్లు
గోపాలపట్నం 41 రూ.0.8 కోట్లు
భీమునిపట్నం 68 రూ.0.79 కోట్లు
పెందుర్తి 72 రూ.0.76 కోట్లు
------------------------------------------------------------------------
మొత్తం 694 రూ.18.17 కోట్లు
--------------------------------------------------------------------------