ఎల్‌నినో ప్రభావంపై అధ్యయనం
ABN , Publish Date - Aug 04 , 2026 | 12:22 AM
గిరిజన ప్రాంతంలో ఎన్‌నినో ప్రభావంపై అధ్యయనం చేస్తున్నట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బాల హుస్సేన్‌రెడ్డి తెలిపారు.
వర్షాలు ఆలస్యమైతే వరి సాగు విడిచిపెట్టాలి
ఆర్‌ఏఆర్‌ఎస్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బాల హుస్సేన్‌రెడ్డి సూచన
చింతపల్లి, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో ఎన్‌నినో ప్రభావంపై అధ్యయనం చేస్తున్నట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బాల హుస్సేన్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆర్‌ఏఆర్‌ఎస్, పాడేరు ఏరువాక ప్రధాన శాస్త్రవేత్తలు మండలంలోని రౌరింతాడ, చిన్నగెడ్డ గ్రామాల్లో రైతుల పంట పొలాలను పరిశీలించారు. రైతులతో సమావేశమై ఖరీఫ్, ముందస్తు రబీ పంట సాగుపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ బాల హుస్సేన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ మొదటి పక్షంలో వర్షాలు పడి నీటి లభ్యత ఉంటే రైతులు 40-45 రోజుల వయస్సు కలిగిన ముదురు నారును దగ్గరగా నాటు కోవాలన్నారు. పంటలకు ఎరువులు వేసే అలవాటు ఉన్న రైతులు ఎకరాకు ఒక బస్తా డీఏపీ ఎరువు నాటుకునే ముందు దమ్ములో వేయాలన్నారు. 20 రోజుల తరువాత మరో 20 కిలోల యూరియా వేసుకోవాలన్నారు. వర్షాలు పడడం ఆలస్యమైతే రైతులు వరి సాగు విడిచిపెట్టడం మంచిదన్నారు. వరికి ప్రత్యామ్నాయంగా రాగిని సాగు చేసుకోవాలని సూచించారు. రాగిని వెదజల్లే పద్ధతిలో గాని, నారు పోసుకుని సాళ్ల పద్ధతిలో గాని నాటు కోవాలన్నారు. అలాగే మినుములకు బదులుగా పెసర సాగు చేసుకోవాలన్నారు. రైతులకు వ్యవసాయశాఖ రాయితీపై రాగి విత్తనాలు అందజేస్తున్నదన్నారు. ఎల్‌నినో ప్రభావం ఉన్నందున ప్రతి రైతు బీమా చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఏఆర్‌ఎస్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బయ్యపురెడ్డి, పాడేరు ఏరువాక ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఉమామహేశ్, వ్యవసాయ శాఖ అధికారి టి.మధుసూదనరావు పాల్గొన్నారు.