రిప్ కరెంట్‌పై అధ్యయనం
ABN , Publish Date - Jun 04 , 2026 | 12:59 AM
సముద్ర తీరంలో అలల మధ్య పుట్టే రిప్ కరెంట్ (మృత్యు ప్రవాహం) వల్ల అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇస్రో (అహ్మదాబాద్), ఏయూ సంయుక్తంగా చేపట్టాలని నిర్ణయం
‘భారతి’ పేరుతో ఏఐ ఆధారిత మోడల్ ప్రాజెక్టుకు రూపకల్పన
సందర్శకుల ప్రాణాలు కాపాడడమే లక్ష్యం
తొలుత ఆర్కే బీచ్, రుషికొండ బీచ్‌లలో స్టడీ
విశాఖపట్నం, జూన్ 3 (ఆంధ్రజ్యోతి):
సముద్ర తీరంలో అలల మధ్య పుట్టే రిప్ కరెంట్ (మృత్యు ప్రవాహం) వల్ల అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆహ్లాదం కోసంసముద్ర తీరానికి వెళ్లే సందర్శకులు రిప్ కరెంట్‌పై అవగాహన లేక మృత్యువాతపడడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో రిప్ కరెంట్‌పై అధ్యయనం కోసం అహ్మదాబాద్ ఇస్రో స్పేస్ ఆప్లికేషన్ సెంటర్, ఏయూ సముద్ర అధ్యయన విభాగం సంయుక్తంగా ‘భారతి’ పేరుతో ఏఐ ఆధారిత ప్రాజెక్టును చేపట్టాయి. రాష్ట్రంలో రుషికొండ, ఆర్కే బీచ్, యారాడ, మైపాడు, సూర్యలంక బీచ్‌లలో రిప్ కరెంట్‌పై అధ్యయనం చేయాలని నిర్ణయించాయి. ముందుగా ఆర్కే బీచ్, రుషికొండ బీచ్‌లలో రిప్ కరెంట్ తీరు తెన్నులు పరిశీలిస్తాయి. కోస్తా తీరంలో రిప్ కరెంట్ ప్రమాదాల నివారణకు ఏపీ మెరైన్ పోలీసులు బుధవారం ఏయూలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన అహ్మదాబాద్ ఇస్రో స్పేస్ ఆప్లికేషన్ సెంటర్ సీనియర్ సైంటిస్టు డా.సూరిశెట్టి అరుణ్‌కుమార్ రిప్ కరెంట్ గురించి వివరించారు.
రిప్ కరెంట్ ప్రమాదం గుర్తింపు ఇలా..
విశాఖలోని బీచ్‌లలో రిప్ కరెంట్‌పై 2017లోనే డాక్టర్ అరుణ్‌కుమార్ అధ్యయనం చేశారు. రుషికొండతో పాటు ఆర్కే బీచ్‌లో కాళీమాత గుడి నుంచి కురుసుర మ్యూజియం వరకు మధ్య బీచ్‌లో ఎక్కువగా రిప్ కరెంట్ ప్రమాదం ఉందని అప్పట్లో గుర్తించారు. అప్పటి అధ్యయనంలో గుర్తించిన అంశాలను ప్రామాణికంగా తీసుకుని తాజాగా ఏఐ ఆధారిత సాంకేతికతతో పూర్తిస్థాయిలో అధ్యయనం చేయనున్నారు. దీనికి భారతి అని పేరు పెట్టారు. ప్రాజెక్టులో భాగంగా ఆర్కే బీచ్, రుషికొండ బీచ్‌లో ఏర్పాటుచేసే ఏఐ ఆధారిత సీసీ కెమెరాల ద్వారా రిప్ కరెంట్‌ను గుర్తిస్తారు. కెమెరా ద్వారా రిప్ కరెంట్ ఏర్పడే ప్రాంతాన్ని గుర్తించిన వెంటనే బీచ్‌లో విధులు నిర్వహించే లైఫ్ గార్డులకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేస్తారు. ఈలోగా బీచ్‌లో సైరన్ మోగించడం ద్వారా రిప్ కరెంట్ వైపు వెళ్లే సందర్శకులను అప్రమత్తం చేస్తారు. ఒకవేళ అప్పటికే రిప్ కరెంట్ ఉన్న ప్రాంతం మధ్యలో సందర్శకుడు చిక్కుకుంటే లై్‌ఫ్ గార్డు వెంటనే రక్షించేందుకు అవకాశం ఉంటుంది. రిప్ కరెంట్ మరీ తీవ్రంగా ఉంటే డ్రోన్ ద్వారా సముద్రం లోపలకు వెళ్లే వ్యక్తిని రక్షించువచ్చు. భారతి ప్రాజెక్టులో భాగంగా ‘సేఫ్ బీచ్’ యాప్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. బీచ్‌లో అలల మధ్య రిప్ కరెంట్ ఏర్పడిన విషయం గుర్తించిన వెంటనే సందర్శకులను అప్రమత్తం చేయడానికి నెక్ట్స్ జెన్ ఏఐ లైఫ్ గార్డు అలర్ట్ సిస్టమ్ అనే యంత్రాన్ని తయారుచేస్తున్నారు. దీనికి రూ.రెండు లక్షల ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.
ఆ నాలుగు నెలల్లో రిప్ కరెంట్ ఎక్కువ
డాక్టర్ అరుణ్‌కుమార్, సైంటిస్టు, అహ్మదాబాద్ ఇస్రో స్పేస్ ఆప్లికేషన్ సెంటర్
గాలుల దిశ మార్పు సముద్ర తీరంలో అలలపై ప్రభావం చూపుతోంది. గాలుల దిశ వల్లే ఒక్కొక్కసారి బీచ్ ఏర్పడడం, లేదా కోతకు గురవడం జరుగుతుంటుంది. తీరం కోతకు గురైనప్పుడు అక్కడ లోతు ఏర్పడుతుంది. అక్కడ అలలు వెనక్కి వెళ్లే సమయంలో రిప్ కరెంట్ పుడుతుంది. తీరం నుంచి సముద్రంలోకి 50 నుంచి 150 మీటర్లు పొడవు, 10 నుంచి 15 మీటర్లు వెడల్పులో రిప్ కరెంట్ ఏర్పడుతుంది. తీరంలోని అలలు తెల్లని నురగతో ఉంటే వాటి మధ్య నల్లని రంగులో ఉండే ప్రాంతమే రిప్ కరెంట్. ఏప్రిల్, మే, అక్టోబరు, నవంబరు నెలల్లో గాలులు దిశ మారే క్రమంలో రిప్ కరెంటు వస్తోంది. ఆర్కే బీచ్‌లో కాళీమాత గుడి ఎదురుగా, కురుసుర మ్యూజియం వెనుక రిప్ కరెంట్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. రుషికొండలోనూ రిప్ కరెంట్ తీవ్రత ఉంది. అందువల్ల ఈ ప్రాంతాలను సందర్శించే వారంతా అప్రమత్తంగా ఉండాలి. అలల మధ్య రంగును గుర్తించి అటువైపు వెళ్లవద్దు. ఈ రెండుచోట్ల పైలట్‌గా అధ్యయనం చేస్తాం. ఆ తరువాత కోస్తాంధ్రలో మిగిలిన బీచ్‌లలో అధ్యయనం చేస్తాం.