పూరిపాకల్లో చదువులు
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:45 AM
మండలంలోని పలు పాఠశాలలకు భవనాలు లేకపోవడంతో పూరిపాకల్లో కొనసాగుతున్నాయి. కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. ఏళ్ల తరబడి ఈ సమస్య ఉన్నా విద్యాశాఖాధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
మండలంలో పలు పాఠశాలలకు భవనాలు కరువు
కనీస సదుపాయాలు లేక విద్యార్థులకు ఇబ్బందులు
వర్షాకాలంలో పరిస్థితి దారుణం
బంగారమ్మపేట, పనసలపాడు గ్రామాల్లోనూ ఇదే దుస్థితి
గుమ్మళ్లపాలెంలో తొమ్మిదేళ్ల క్రితం పాఠశాల భవనానికి నిధులు మంజూరు
ఆ నిధులు ఏమయ్యాయో ఎవరికీ తెలియని వైనం
పట్టించుకోని పాలకులు, అధికారులు
కొయ్యూరు, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు పాఠశాలలకు భవనాలు లేకపోవడంతో పూరిపాకల్లో కొనసాగుతున్నాయి. కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. ఏళ్ల తరబడి ఈ సమస్య ఉన్నా విద్యాశాఖాధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
మండలంలోని గుమ్మళ్లపాలెం, బంగారమ్మపేట, పనసలపాడు గ్రామాల్లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు దశాబ్దం క్రితం నుంచి భవనాలు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భవనాల నిర్మాణంపై అధికారులు, పాలకులు నిర్లక్ష్యం చూపుతున్నారని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. గుమ్మళ్లపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు ఉన్న భవనం శిథిలావస్థకు చేరింది. పాఠశాల ఉపాధ్యాయురాలు, గ్రామస్థులు పూరిపాకను వేయడంతో గత ఎనిమిదేళ్ల నుంచి పాఠశాల అందులోనే కొనసాగుతోంది. పాఠశాల భవన నిర్మాణానికి 2016లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్‌లో రూ.10 లక్షలు మంజూరు చేసింది. దీంతో పాత భవనాన్ని కూల్చి దానికి సంబంధించిన ఇనుము, తలుపులు, తదితర సామగ్రిని కనిపించకుండా చేశారు. నాటి నుంచి నేటి వరకు కూల్చిన భవనం స్థానంలో కొత్త నిర్మాణాలకు చర్యలు తీసుకోలేదు. అయితే ఈ భవన నిర్మాణానికి మంజూరైన నిధులు ఏమయ్యాయో అటు ఇంజనీరింగ్ అధికారుల వద్దగానీ, ఇటు విద్యాశాఖాధికారుల వద్ద గానీ సమాచారం లేదు. చివరకు ఆడిట్ అధికారులు ఈ నిధులపై ఉన్నతాధికారులకు నివేదికలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ భవన నిర్మాణం విషయంలో నిధులు దారి మళ్లాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాఠశాలకు సుమారు 10 సెంట్లు స్థలం ఉంది. దీన్ని గ్రామస్థుల అవసరాలకు ఆక్రమించే ప్రయత్నం చేయకుండా ఉపాధ్యాయురాలు కంచె వేయించారు. ప్రస్తుతం పాఠశాలలో 10 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు.
బంగారమ్మపేటలో..
బంగారమ్మపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన భవనం శిఽథిలం కాగా.. దాని పక్కనే 15 సంవత్సరాల క్రితం మరో భవనాన్ని నిర్మించారు. ప్రస్తుతం 30 మంది విద్యార్థులతో పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. ఉన్న భవనంలో వసతి చాలక వరండాలోనూ, చెట్ల నీడన విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. పాఠశాల పక్కన శిథిల భవనాన్ని ఇంతవరకు కూల్చివేయకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఆ భవనాన్ని అధికారులు కూల్చివేయించాలని, అలాగే విద్యార్థులకు కొత్త భవనాన్ని నిర్మించాలని కోరుతున్నారు.
పనసలపాడు గ్రామంలో..
మాలమాకవరం పంచాయతీ పనసలపాడు గ్రామంలో 25 మంది విద్యార్థులతో పాఠశాలను నడుపుతున్నారు. ఇక్కడ భవనం ఆరేళ్ల క్రితమే శిఽథిలావస్థకు చేరింది. దీంతో గ్రామస్థులు పాఠశాల భవనానికి సమీపంలో గ్రామకంఠంలో తాత్కాలికంగా పాకను నిర్మించారు. ప్రస్తుతం ఈ పాకలోనే విద్యాబోధన జరుగుతోంది. పాఠశాల భవనం గోడలు బీటలు బారి శ్లాబ్ పెచ్చులూడి ఏ క్షణాన కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పాఠశాల భవనం కోసం పలు పర్యాయాలు ఎమ్మెల్యే, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయిందని గ్రామస్థులు వాపోయారు. వర్షాకాలంలో విద్యార్థుల ఇబ్బందులు వర్ణనాతీతమని వారంటున్నారు. ఈ విషయమై ఎంఈవో రాంబాబును సంప్రతించగా.. ఈ పాఠశాలలకు భవనాల కోసం ప్రతిపాదనలు పంపామన్నారు. త్వరలో నిధులు మంజూరయ్యే అవకాశం ఉందన్నారు.