Share News

భోగాపురానికి 130 బస్సుల్లో విద్యార్థుల తరలింపు

ABN , Publish Date - Jul 30 , 2026 | 12:07 AM

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు ఒకటిన ప్రధాని మోదీ ప్రారంభిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో ధింసా ప్రదర్శనకు 130 బస్సుల్లో గిరిజన విద్యార్థులను ఇక్కడి నుంచి విజయనగరం తరలిస్తున్నారు.

భోగాపురానికి 130 బస్సుల్లో విద్యార్థుల తరలింపు
బుధవారం రాత్రి విజయనగరం చేరుకున్న గిరిజన విద్యార్థులు

ప్రధాని మోదీ స్వాగత కార్యక్రమంలో గిరి విద్యార్థుల ధింసా ప్రదర్శన

ఐటీడీఏ పీవో ఆధ్వర్యంలో ఏర్పాట్లు

పాడేరు, జూలై 29(ఆంధ్రజ్యోతి): భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు ఒకటిన ప్రధాని మోదీ ప్రారంభిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో ధింసా ప్రదర్శనకు 130 బస్సుల్లో గిరిజన విద్యార్థులను ఇక్కడి నుంచి విజయనగరం తరలిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ డిపోలకు చెందిన బస్సులు బుధవారం జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలకు చేరుకున్నాయి. ఆయా బస్సుల్లో విద్యార్థులను ఎక్కించుకుని విజయనగరంలోని 29 ప్రత్యేక ప్రదేశాల్లో వారికి వసతి సదుపాయాలు కల్పించారు. అలాగే విద్యార్థుల ప్రదర్శనలకు అవసరమైన రిహార్సల్స్‌ ఇప్పిస్తారు. అనంతరం ఆగస్టు ఒకటిన వారందరితో ప్రధాని మోదీ స్వాగత కార్యక్రమంలో ప్రదర్శన చేయిస్తారు. ప్రతి బస్సులో విద్యార్థులకు సహాయకులుగా నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను నియమించారు. ఈ మొత్తం ప్రక్రియలను నిర్వహించాలని ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించడంతో ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ పీబీకే పరిమిళ, సిబ్బంది ఆయా పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా పాల్గొనే విశిష్టమైన కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చే అవకాశం దక్కడంపై గిరిజన విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరో 46 బస్సుల్లో జనం తరలింపు

ఆగస్టు ఒకటిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా నుంచి 46 బస్సుల్లో జనాన్ని తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రణాళికను జిల్లా అధికారులు సిద్ధం చేయగా, పలు గ్రామాలను ఎంపిక చేసుకుని ఆయా ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సుల్లో ఆగస్టు ఒకటో తేదీన వారందర్నీ భోగాపురానికి తరలించనున్నారు. అలాగే వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నారు.

Updated Date - Jul 30 , 2026 | 12:07 AM