విద్యాభ్యాసానికి విద్యార్థిని ‘సంసిద్ధత’
ABN , Publish Date - Jun 20 , 2026 | 11:19 PM
ప్రతి విద్యార్థి విద్యలో రాణించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్నది. ప్రాథమిక విద్యలోనే బలమైన పునాది వేయాలని ఒకటి, రెండు తరగతులకు ఎఫ్‌ఎల్‌ఎన్ ద్వారా బోధన అందిస్తున్నది. ఈ ఏడాది తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలకు వచ్చిన విద్యార్థికి నేరుగా పాఠ్యాంశాల బోధన ప్రారంభించకుండా కొన్ని రోజులపాటు ఆటా, పాటలతో ప్రాథమిక విద్యను అందిస్తూ విద్యాభ్యాసానికి సిద్ధం చేసేందుకు ‘సంసిద్ధత’ (రెడీనెస్ ప్రొగ్రాం) కార్యక్రమాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఉపాధ్యాయులు పాఠశాల పునఃప్రారంభం నుంచి ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు సంసిద్ధత బోధన అందిస్తున్నారు.
బలమైన పునాదికి వినూత్న కార్యక్రమం
తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న విద్యాశాఖ
చింతపల్లి, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): విద్యార్థి ఉన్నత విద్యలో రాణించాలంటే ప్రాథమిక విద్యలో మంచి పునాది ఉండాలి. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్థులు సున్నిత మనస్సు కలిగి ఉంటారు. విద్యార్థులకు పాఠశాల, ఉపాధ్యాయులంటే తెలియని భయం ఉంటుంది. పాఠశాలకు వచ్చిన విద్యార్థిలో భయాన్ని తొలగించి మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తే డ్రాపౌట్‌ల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. ప్రతి రోజు విద్యార్థి పాఠశాలకు హాజరుకావాలనే ఆసక్తి పెరుగుతుంది. పాఠశాలకు వచ్చిన విద్యార్థికి నేరుగా పాఠ్యాంశాలను బోధిస్తే అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. దీంతో విద్యార్థి విద్యలో రాణించలేదు. ఈ విషయాలపై రాష్ట్ర విద్యాశాఖ సుదీర్ఘంగా అధ్యయనం చేసి సంసిద్ధత కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధనకు ముందుగా 35 రోజులు, మూడు నుంచి ఐదో తరగతి విద్యార్థులకు 12 రోజుల పాటు సంసిద్ధత కార్యక్రమాన్ని అమలు చేయాలని విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. సంసిద్ధత కార్యక్రమం కోసం ప్రత్యేకంగా పాఠ్యపుస్తకాలను ముద్రించి విద్యార్థులకు ప్రభుత్వం అందించింది. విద్యార్థికి ఏరోజు ఏమి బోధించాలి? ఏకృత్యం చేయించాలి? ఎటువంటి ఆటలు, పాటలు పాడించాలనే సమగ్ర సమాచారం సంసిద్ధత పుస్తకాల్లో స్పష్టంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని అమలులోకి తీసుకు రావడం వల్ల ఉపాధ్యాయులు విద్యార్థి స్థాయికి వెళ్లి ఆటా, పాటలతో బోధన అందిస్తున్నారు. ఈ విధానంతో విద్యార్థుల్లో నూతనోత్సాహం కనిపిస్తుందని, విద్యార్థులు ఆసక్తితో ప్రతి రోజు పాఠశాలకు క్రమంగా హాజరవుతున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం నూతన సంస్కరణలు అమలుపరుస్తూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రాథమిక, ఉన్నత విద్యలో మార్పులు తీసుకొచ్చేందుకు స్వయంగా ఆయనే ప్రత్యేక కార్యక్రమాల రూపకల్పనలతో భాగస్తులవుతున్నట్టు విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎఫ్‌ఎల్‌ఎన్, సంసిద్ధత కార్యక్రమాలతోపాటు పదో తరగతి విద్యార్థులకు అమలుచేస్తున్న వంద రోజుల ప్రణాళిక ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.