Share News

జ్వరాల బారిన విద్యార్థులు

ABN , Publish Date - Jul 05 , 2026 | 12:48 AM

మండలంలోని తెనుగుపూడి అంబేడ్కర్‌ గురుకుల కళాశాల విద్యార్థులు మలేరియా జ్వరాలతో బాధపడుతున్నారు. ఇక్కడ ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదువుతున్నారు.

జ్వరాల బారిన విద్యార్థులు
జ్వరాలతో బాధపడుతున్న తెనుగుపూడి గురుకుల కళాశాల విద్యార్థులు

- తెనుగుపూడి గురుకుల కళాశాలలో పలువురికి మలేరియా

దేవరాపల్లి, జూలై 4 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తెనుగుపూడి అంబేడ్కర్‌ గురుకుల కళాశాల విద్యార్థులు మలేరియా జ్వరాలతో బాధపడుతున్నారు. ఇక్కడ ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదువుతున్నారు. ప్రతి రోజూ ఇద్దరు, ముగ్గురు చొప్పున విద్యార్థులు జ్వరాలతో మంచాన పడుతున్నారు. కళాశాల ప్రారంభం నుంచి నేటి వరకు 22 మందికి జ్వరాలు వచ్చాయి. గత మూడు రోజుల్లో 13 మంది జ్వరాల బారిన పడ్డారు. కళాశాల చుట్టూ లోపించిన పారిశుధ్యం, దట్టమైన చెట్లతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. మలేరియా సోకిన వారిలో పూడి ప్రశాంత్‌కుమార్‌, కంటికర్ల చంద్రరావు, జన్ని మహేష్‌, చందాడ అశోక్‌, పెద్దాడ హర్షవర్ధన్‌, పూడి చిన్నోడు, ఏల్నేటి అఖిల్‌, మని సాత్విక్‌, సాంభి జోసెఫ్‌, శవిదేవ్‌రాజ్‌, బొడ్డు కిరణ్‌పాల్‌, జలుమూరు ఆనంద్‌, శీదరి వరుణ్‌తేజ్‌, తదితరులు ఉన్నారు. విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు చేశామని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి మెరుగుగా ఉందని సీహెచ్‌ఓ ఆనంద్‌ తెలిపారు. పర్యవేక్షకురాలు లక్ష్మి, ఏఎన్‌ఎం దేవి పర్యవేక్షణలో వైద్య శిబిరాలు నిర్వహించామన్నారు. విషయం తెలుసుకున్న అంబేడ్కర్‌ గురుకుల విద్యా సంస్థల జిల్లా సమన్వయ అధికారి జి.గ్రేస్‌ శనివారం తెనుగుపూడి గురుకుల కళాశాలను సందర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ప్రిన్సిపాల్‌ రమణమూర్తిని అడిగి తెలుసుకున్నారు. జ్వరాలు తీవ్రం కాకుండా చూడాలని ఆమె ఆదేశించారు.

Updated Date - Jul 05 , 2026 | 12:48 AM