కాంపిటేషన్ చట్టంపై విద్యార్థులకు అవగాహన
ABN , Publish Date - Feb 27 , 2026 | 11:53 PM
దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వ విద్యాలయంలో శనివారం ‘డీఎస్‌ఎన్‌ఎల్‌యూ- కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)’ ఆధ్వర్యంలో ‘పోటీ చట్టం’పై న్యాయ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
సబ్బవరం, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వ విద్యాలయంలో శనివారం ‘డీఎస్‌ఎన్‌ఎల్‌యూ- కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)’ ఆధ్వర్యంలో ‘పోటీ చట్టం’పై న్యాయ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉప కులపతి ప్రొఫెసర్ డి.సూర్యప్రకాశరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సీసీఐ చైర్‌పర్సన్ రవ్‌నీత్ కౌర్ (ఐఏఎస్) ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంపిటీషన్ చట్టంపై విద్యార్థులకు, విద్యావేత్తలకు మధ్య అర్థవంతమైన చర్చ జరిగేందుకు సీసీఐ ఔట్ రీచ్‌లో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కాంపిటీషన్ చట్ట వ్యవస్థలో ఇటీవల తీసుకొచ్చిన ముఖ్యమైన సంస్కరణల గురించి ఆమె వివరించారు. కాంపిటీషన్ సవరణ చట్టం-2023తో సంస్థల నియంత్రణ గణనీయంగా అభివృద్ధి చెందిందన్నారు. కొత్తగా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనడానికి, భారతదేశాన్ని ప్రపంచ వ్యాపార కేంద్రంగా మార్చడానికి సీసీఐ కృషి చేస్తున్నదని చెప్పారు. న్యాయ సలహాదారు ధీరజ్ గుప్తా, ఎఫ్‌ఏ డైరెక్టర్ శేఖర్ సీసీఐ పాత్రపై ఉపన్యసించారు. అనంతరం సీసీఐ చైర్‌పర్సన్ రవ్‌నీత్ కౌర్‌ను, వర్సిటీ వీసీ సత్కరించి జ్ఞాపికను అందించారు. కార్యక్రమంలో సెంటర్ ఫర్ కాంపిటీషన్ లా సెంటర్ ఇన్‌చార్జి డాక్టర్ దీప్తి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.