వరహా నదిలో విద్యార్థి గల్లంతు
ABN , Publish Date - Jun 26 , 2026 | 12:16 AM
మండలంలోని బంగారమ్మపాలెం వద్ద వరహా నదిలో ఈతకు వెళ్లిన విద్యార్థి గల్లంతయ్యాడు. చీకటి పడేవరకు గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.
ఎస్.రాయవరం, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బంగారమ్మపాలెం వద్ద వరహా నదిలో ఈతకు వెళ్లిన విద్యార్థి గల్లంతయ్యాడు. చీకటి పడేవరకు గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి. బంగారమ్మపాలెం గ్రామానికి చెందిన కారే అశోక్ (14) స్థానిక ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. గురువారం మొహర్రం సందర్భంగా పాఠశాలకు సెలవు ఇవ్వడంతో పలువురు విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గ్రామానికి సమీపంలో ఎన్‌ఏవోబీ సరిహద్దు వద్ద వరహా నదిలో ఈత కొట్టడానికి వెళ్లారు. అక్కడ చేపల బోటులు నిలిపే ప్రదేశంలో తొలుత అశోక్ నీటిలో దిగాడు. అక్కడ లోతు ఎక్కువగా వుండడంతో నీటిలో మునిగిపోయాడు. తోటి విద్యార్థులు కేకలు వేయడంతో సమీపంలో వున్న మత్స్యకారులు వచ్చి నదిలో గాలించారు. కానీ అచూకీ లభించలేదు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ రమేశ్ ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. పక్కనే ఎన్‌ఏవోబీలో పనిచేస్తున్న ఈతగాళ్ల సహాయంతో నదిలో గాలించారు. చీకటి పడే వరకు ఆచూకీ లభించకపోవడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు.